భారీ వర్షాల కారణంగా వరద ప్రాంతాల్లో పాములు, పురుగులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఓ ఇంట్లోకి పాము రావడంతో ఆ పామును పట్టుకెళ్లిన యువకుడు జీహెచ్ఎంసీ కార్యాలయంలో వదిలిపెట్టిన వీడియో వైరల్ అయ్యింది. ఇలా విష సర్పాలు నివాసిత ప్రాంతాల్లోకి రావడం వరదల సమయంలో మామూలైపోయింది. అయితే ఇక్కడ పూర్తిగా భిన్నం.
అటవీ ప్రాంతంలో నివసించే చిరుత.. సినిమా సెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అంతే జనం ప్రాణాలు బిగపెట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జూలై 26, బుధవారం నాడు ముంబైలోని గోరేగావ్ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా మరాఠీ టెలివిజన్ షో సెట్స్‌లోకి చిరుత తన పిల్లతో సహా ప్రవేశించింది.
చిరుతపులి కనిపించడంతో, సెట్‌లో ఉన్న సిబ్బందిలో భయాందోళనలకు గురైయ్యారు. ప్రజలు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో చిరుతపులిని గుర్తించిన తర్వాత సిబ్బంది కూడా షూటింగ్ సెట్ నుండి పారిపోవడాన్ని చూడవచ్చు.
ఈ ఘటనపై ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేశ్ శ్యామ్‌లాల్ గుప్తా మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా జరగడంతో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్‌లో 200 మందికి పైగా ఉన్నారు.
అలాంటి సమయంలో చిరుత రావడంతో జనాలు జడుసుకున్నారు. ఇలాంటి సంఘటనలో ఎవరైనా ప్రాణాలు కోల్పోవచ్చు. గత పది రోజులలో ఇది నాలుగో ఘటన. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవడం లేదని అని గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకపోతే.. ఫిల్మ్‌సిటీలో షూటింగ్ సెట్స్‌లోకి చిరుతపులి ప్రవేశించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రొడక్షన్ సిబ్బంది, తారాగణం సభ్యులు తమ పనిలో బిజీగా ఉన్న సమయంలో చిరుతపులి సెట్‌లోకి ప్రవేశించి వీధి కుక్కపై దాడి చేసింది. అయితే, సిబ్బంది ఎవరూ గాయపడలేదు.
ఈ ఘటన వెలుగులోకి రావడంతో పలు అధికారుల బృందాలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటన తర్వాత, ప్రజల భద్రత కోసం కొన్ని పటిష్ట చర్యలు తీసుకోవాలని గుప్తా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను అభ్యర్థించారు.
గోరేగావ్ ఫిల్మ్ సిటీ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ సమీపంలో ఉండటంతో షూటింగ్ సెట్స్‌లోకి చిరుతలు ప్రవేశించిన సంఘటనలు పదే పదే జరుగుతున్నాయి. చిరుత పులులు సెట్ లోకి రావడంతో షూటింగ్ కోసం రెగ్యులర్‌గా ఫిల్మ్ సిటీకి వచ్చే నటీనటులు, నిర్మాణ సిబ్బందిలో భయం అలముకుంది.