పదో తరగతి లేదా ఇంటర్ మీడియట్ పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే చాలామంది కుంగిపోతుంటారు. కొందరు పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఉదంతాలు సైతం వెలుగుచూస్తున్నాయి. ఇలాంటివారికి కనువిప్పులా ఓ ఐఏఎస్ అధికారి పదోతరగతి మార్కుల జాబితాను ట్విట్టర్లో పోస్ట్ చేసారు.
ఆయన పేరు తుషార్. ఆయనకు పదో తరగతిలో ఇంగ్లీషులో జస్ట్ స్టాంప్ మార్కులు, అంటే 35. మ్యాథ్స్‌లో 36 మార్కులు, విజ్ఞానశాస్త్రంలో 38 మార్కులు. ఇంత తక్కువ మార్కులు వచ్చినప్పటికీ ఆయన కుంగిపోలేదు. ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేసిన యూపీఎస్సీలో ర్యాంకు సాధించారు. ఐఏఎస్ అధికారిగా 2012లో ఆయన ఎంపికయ్యారు.
పదో తరగతి మార్కులు అంత తక్కువ వచ్చాయని ఆయన కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో మరింత ముందుకు వెళ్లారు. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలోని భరుచ్ జిల్లా కలెక్టరుగా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు సంబంధించిన మార్కులను మరో ఐఏఎస్ అధికారి అవినీశ్ శరణ్ ట్విట్టర్లో పంచుకున్నారు.