తిరుమల శ్రీవారి ముందున్న పరదాలు చూడండి (వీడియో)
తెరతీయరా స్వామి.. అంటూ తిరుమల వెంకన్నపై వచ్చే పాటలు భక్తి భావంలోకి తీసుకెళుతుంటాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడికి భక్తులకు కొదవలేదు. మహారాజైన తొండమాన్ చక్రవర్తి నుంచి నిరుపేద అయిన కుమ్మరదాసు వరకు ఎందరో ఆయన సేవలో తరించిన వారే... ఈనాటికి తరిస్తున్న వ
తెరతీయరా స్వామి.. అంటూ తిరుమల వెంకన్నపై వచ్చే పాటలు భక్తి భావంలోకి తీసుకెళుతుంటాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడికి భక్తులకు కొదవలేదు. మహారాజైన తొండమాన్ చక్రవర్తి నుంచి నిరుపేద అయిన కుమ్మరదాసు వరకు ఎందరో ఆయన సేవలో తరించిన వారే... ఈనాటికి తరిస్తున్న వారే. ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్వామివారికి సేవ చేస్తుంటే తిరుపతికి చెందిన ఒక వ్యక్తి మాత్రం స్వామివారికి ఎన్నో యేళ్ళుగా పరదాలను కానుకగా సమర్పించి ఆయన సేవలో తరిస్తున్నారు. త్వరలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కూడా పరదాలను సిద్ధం చేశారు. ఇంతకీ ఎవరా వ్యక్తి.. ఏమా కథ.. చూడండి.
తన వృత్తినే ఇంటి పేరుగా మార్చుకున్నారు తిరుపతికి చెందిన మణి. సాధారణ టైలర్‌గా జీవితాన్ని ప్రారంభించి అనుకోకుండా తిరుమల వెంకన్నకే పరదాలను సమర్పించే మహద్భాగ్యాన్ని సంపాదించాడు. ఎన్నో సంవత్సరాలుగా స్వామివారికి జరిగే కార్యక్రమాల్లో యేడాదికి నాలుగుసార్లు పరదాలను ఉచితంగా అందిస్తూ వస్తున్నారు పరదాల మణి. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఆణివారం ఆస్థానం, ఉగాది ఆస్థానం, బ్రహ్మోత్సవం ఇలా యేడాదికి నాలుగుసార్లు పరదాలను సిద్థం చేసి అందిస్తున్నాడు. మణి అందించే పరదాలే ఆలయంలోని గర్భగుడిలో స్వామి వారి ముందు ఉపయోగిస్తున్నారు. ఈ యేడాది జరిగే బ్రహ్మోత్సవాల్లో కూడా పరదాల మణి ఐదు పరదాలను సిద్థం చేశారు.
బంగారు వాకిలి వద్ద మహాలక్ష్మి ప్రతిమతో ఉన్న పరదా తయారుచేశారు. ఆ పరదా మొత్తం స్వామివారి ఆభరణాలు, శంఖు, చక్రాలు, వడ్డానం, తిరునామాలు ఉండేలా తయారుచేశారు. అలాగే మరో పరదా పద్మావతి దేవి, పచ్చలు, మామిడి తోరణాలతో తయారుచేశారు. ఇక ఏకాంత సేవ కోసం మరో పరదా, రాముల మేడ పరదా, కులశేఖరపడి వద్ద మరో పరదా ఇలా మొత్తం ఐదు పరదాలను సిద్ధం చేసి ఉంచారు పరదాల మణి.
ఈ నె 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పరదాల మణి తయారుచేసిన పరదాలనే ఉపయోగించనున్నారు. ఎప్పుడూ శ్రీవారిపై ఉన్న భక్తితో మణి ఎంతో నియమనిష్టలతో ఈ పరదాలను తయారుచేస్తున్నారు. గత కొన్నేళ్ళుగా పరదాలను సొంత ఖర్చుతో తయారుచేసి ఉచితంగా టిటిడికి అందిస్తున్నారు. స్వామివారికి సేవ చేయడమే మహద్భాగ్యంగా భావిస్తున్నానని, ఇలాంటి అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందంటున్నారు పరదాల మణి. వీడియో చూడండి...