Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శాలువా నాకేందుకురా? అరటి పళ్ళు ఇస్తే ఒక పూట గడిచేదిగా? టంగుటూరి

Advertiesment
Tanguturi Prakasam pantulu
, శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (14:24 IST)
అన్న మాజీ ముఖ్యమంత్రి. నాలుగో క్లాస్ చదువుతున్న ఓ కుర్రాడు తన పరీక్ష ఫీజుకు మూడు రూపాయలు లేక, వాటికోసం తన ఊరుకు 25 మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళ బావగారింటికి కాలినడకన బయల్దేరాడు. తీరా చేసి బావగారింటికి వెడితే 'నాదగ్గర మాత్రం ఎక్కుడున్నాయిరా' అన్నాడా బావ గారు. చేసేదేముందనుకుంటూ కాళ్ళీడ్చుకుంటూ 25 మైళ్ళు తిరిగి నడుచుకుంటూ ఇంటికొచ్చేశాడు ఆ కుర్రాడు. 
 
ఆ పరిస్థితికి తల్లడిల్లిపోయిన ఆతని తల్లి తన పెళ్ళినాటి పట్టుచీరను అమ్మి ఆ మూడురూపాయల ఫీజు కట్టింది. ఆ తరువాత ఎన్నో ఎన్నెన్నో ఢక్కామొక్కీలు తిని తనకిష్టమైన ప్లీడరీ పరీక్షలో నెగ్గి, అక్కడితో తృప్తి పడక ఇంగ్లండ్ పోయి బారిష్టరయ్యి మద్రాస్ మైలాపూర్ అరవ మేధావులతో పోటీపడి ఆ రోజులలోనే (1917-18 నాటికే) రోజుకు వెయ్యి రూపాయల ఫీజు తీసుకునే స్థాయిలో, కోస్తా జిల్లాలన్నిటిలో భూములు బంగళాలు కొనుగోలు చేసేటంతగా ఎదిగిన మన కాలపు మేరునగధీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు.
 
గాంధీజీ పిలుపుతో తన ప్లీడరు వృత్తిని వదిలి జాతీయోద్యమంలోకి ఉరికాడు. తన సర్వస్వాన్ని ప్రజాసేవకే అంకితం చేశాడు. లాయర్‌గా ఎంతోమందిని జైళ్ళనుంచి బైటకు తెచ్చిన ఆయన ప్రజలకోసం తాను స్వచ్చంధంగా జైలుశిక్షను అనుభవించాడు. గాంధీజీ ఆశయాల ప్రచారం కోసం 'స్వరాజ్య' పత్రికను స్థాపించి గాంధీజీ నిజమైన అనుచరునిగా ఆయన మెప్పును పొందాడు. 
 
అదే గాంధీజీ కొందరి చెప్పుడు మాటలు విని ఆయనను తప్పు పట్టుకుంటే గాంధీజీని సైతం నిలదీశాడు. సైమన్ కమీషన్‌కు వ్యతిరేకంగా మద్రాస్ నగరంలో హర్తాళ్ జరిగినప్పుడు తెల్లవాడి తుపాకీకి తన గుండెనే ఎదురు పెట్టాడు.
 
 ఆనాటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి రెవిన్యూ మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేశాడు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు(1953)తొలి తెలుగు ముఖ్యమంత్రి అయ్యాడు.
 
 
దురాశాపరుల మూలంగానూ, శాసన సభ స్పీకర్ తెలివి తక్కువ తనం మూలంగానూ ఒకే ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పతనమైనప్పుడు , వ్యతిరేకంగా ఓటువేసిన వారు తమ తప్పు తెలుసుకుని మళ్ళీ ఓటింగ్‌కు వెడదామని బ్రతిమాలుకున్నా వినకుండా శాసనసభ నుండి తిన్నగా గవర్నర్ వద్దకు వెళ్ళి తన రాజీనామాను సమర్పించాడు. 
 
కేవలం 13 నెలల తన ప్రభుత్వ కాలంలో ఆ రోజుల్లోనే 14 నీటి పారుదల ప్రాజెక్టులు స్థాపించాడు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించాడు. తెలుగు వారికి ఓ హైకోర్టు స్థాపించాడు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణకు కావలసిన మార్పులకు శాసనబద్దత కల్పించాడు. సహకార రంగంలో తెలుగు రాష్ట్రాన్ని ప్రధమ స్థానంలో నిలిపాడు. 
 
బెజవాడలో కాటన్ దొర కట్టిన బరాజ్ కొట్టుకుపోయే పరిస్థితి వస్తే ఆనాటి కేంద్ర ప్రభుత్వం పైసా కూడ ఇవ్వలేమని స్పష్టం చేస్తే, రాష్ట్ర నిధులనన్నీ మళ్ళించి యుద్ధ ప్రాతిపదికన బరాజ్‌ను బాగుచేయించి నిలబెట్టాడు. ఆ భారాన్ని పన్నుల రూపంలో ప్రజలమీద వెయ్యకుండా ఆ లోటును సరిదిద్దాడు. అందుకే ప్రజలందరూ ఆ బ్యారాజ్‌ను ఆయన పేరునే ప్రకాశం బ్యారేజ్‌గా పిలుచుకుంటున్నారు. 
 
రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా దేశంలోనే తొలిసారిగా ఖైదీలందరినీ విడుదల చేశాడు. అంతటి మహనీయుడు తన చరమ దశలో కటిక దారిద్ర్యాన్ని అనుభవించాడు. తనను శాలువతో సత్కరిస్తే 'ఈ శాలువ నాకెందుకురా! ఆ డబ్బుతో అరటిపళ్ళు కొనితెస్తే ఓ పూట గడిచేది కదురా!!' అని తన అనుచరునితో అన్నారంటే ఆయన పరిస్థితి అర్థంచేసుకోవచ్చు. 
webdunia
 
ఆయన మూలంగా అధికారంలోకి వచ్చిన మహానాయకులందరూ అధికారం కోసం ఆయనకు వెన్నుపోటు పొడిచినా అధికారం కోసం ప్రాకులాడలేదు. 85 సంవత్సరాల వయస్సులో రోహిణీ కార్తె మండుటెండలో వడదెబ్బకు మరణించిన ఇద్దరు ముదుసలుల కుటుంబ పరామర్శ కోసం వెళ్ళి తాను వడదెబ్బ తిని తెలుగు పౌరుషాన్ని పైలోకాలకు తీసుకుపోయిన "ఆంధ్రకేసరి" టంగుటూరి ప్రకాశం పంతులు గారి 148వ జన్మదినోత్సవం సందర్భంగా వారి దివ్యస్మృతికి సజలనయనాలతో సహృదయ నివాళులు...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్యాన్సర్‌, కొలెస్ట్రాల్‌లను తగ్గించే "ఇరానీ దమ్ టీ"