సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తన తాజా చిత్రం పెదకాపు-1 ప్రధాన పాత్రలో యంగ్ స్టర్ విరాట్ కర్ణను నటింపజేయాలని ధైర్యమైన, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇది సాధారణ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కాదు. పెదకాపు-1 న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ కాబట్టి.. ఇది యంగ్ స్టర్ కి కూడా సవాల్. అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. స్టార్ డైరెక్టర్ వివి వినాయక్, నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ట్రైలర్ లాంచ్ చేయగా, మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు.
ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీని అందించారు. కథనాన్ని నేచురల్ గా, స్ట్రాంగ్ గా చేయడానికి డార్క్ థీమ్‌ను ఎంచుకున్నారు. మిక్కీ జె మేయర్ తన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో విజువల్స్‌కు మరింత బలం చేకూర్చారు. ద్వారకా క్రియేషన్స్ ప్రొడక్షన్ డిజైన్ టాప్ క్లాస్ లో వుంది. ట్రైలర్ సినిమాపై అంచనాలని పెంచింది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో వివి వినాయక్ మాట్లాడుతూ.. ఒక కొత్త హీరో సినిమాకి ఇన్ని కోట్లు ఖర్చు చేయడం మామూలు విషయం కాదు. నా దర్శకత్వంలో అల్లుడు శీను సినిమాకి బెల్లం కొండ సురేష్ గారు అలా ఖర్చు చేశారు. దీని తర్వాత అంత తెగింపుతో ఎలాంటి లెక్కలు లేకుండా తీసిన సినిమా పెదకాపు1. ఇది కూడా అఖండ అంత హిట్ కావాలని, విరాట్ కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. తెలిపారు.
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ..పెదకాపు కులానికి సంబంధించింది కాదు. విరాట్ కర్ణ కొత్తకుర్రాడని మనం అనుకుంటాం కానీ సినిమా మాత్రం చాలా పెద్దది. అందులో ఒక ముఖ్యమైన పాత్రగానే విరాట్ కర్ణ ని ట్రీట్ చేశాను. విరాట్ చాలా కష్టపడ్డాడు, రిస్కీ షాట్స్ చేశాడు. పాపం ..యాక్షన్ సీక్వెన్స్ లో చాలా దెబ్బలు కూడా తిన్నాడు ( నవ్వుతూ) చాలా అద్భుతంగా నటించాడు. అనసూయ, ఈశ్వరి, రావు రమేష్. రాజీవ్ కనకాల గారు.. ఇలా నటీనటులందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ సినిమా ఒక మరపురాని చిత్రంగా నిలిచి పెదకాపు 2 కి ప్రస్థానం కావాలని, అందరూ ఆదరిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు
విరాట్ కర్ణ మాట్లాడుతూ.. ఇంతమంచి కథ ఇచ్చిన మా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గారికి, ఈ సినిమా నిర్మించిన మా బావగారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఛోటా గారు నన్ను చాలా బాగా చూపించారు. హీరోయిన్ గా చేసిన ప్రగతి చక్కగా నటించారు. ఇందులో పని చేసిన అందరికీ థాంక్స్ చెప్పారు.
మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ వేడుకకు వచ్చిన వినాయక్ గారికి, రవిగారికి ప్రసాద్ గారికి అందరికీ ధన్యవాదాలు. నేను సినిమా గురించి ఎక్కువ మాట్లాడతానని మా ఇంట్లో చెబుతుంటారు. ఈ సినిమా విషయంలో ఒకటి నిర్ణయించుకున్నాను. సినిమా మాట్లాడిన తర్వాతే నేను మాట్లాడతాను అన్నారు