రైల్వే పోలీస్ రౌడీ పోలీస్ అయితే రైల్వేలో ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్ జోన్ లుండవు వున్నది వార్ జోనే... ఈ పాయింట్ తో రాసిన కథతో మాస్ జతర చిత్రం రూపొందింది. ఈ చిత్ర ట్రైలర్ ను సోషల్ మీడియాలో చిత్ర టీమ్ విడుదల చేసింది. ఇందులో రవితేజ, శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, యాక్షన్ తో మాస్ జతర ట్రైలర్ కనిపిస్తుంది. పంచ్ డైలాగ్‌లతో మాస్ మహారాజా అభిమానులు కోరుకునే మాస్ విందులా ఈ ట్రైలర్ ను మలిచారు. 
  
 			
 
 			
					
			        							
								
																	
	 
	కథానాయకుడు, ప్రతినాయకుడు మధ్య ఉత్కంఠభరితమైన సంఘర్షణ నేపథ్యంలో ట్రైలర్ ను రూపొందిన తీరు ఆకట్టుకుంది. వాణిజ్య అంశాలతో నిండిన పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రానికి హామీ ఇచ్చేలా 'మాస్ జతర' ట్రైలర్ ఉంది. నవీన్ చంద్ర మరోసారి శక్తివంతమైన ప్రతినాయక పాత్రలో మెరిసి, రవితేజను ఢీకొట్టే పాత్రలో మెప్పించారు.
	 
	ట్రైలర్ కు మరింత ఆకర్షణ మరియు తాజాదనాన్ని జోడిస్తూ, కథానాయిక శ్రీలీల తెరపై ఎంతో అందంగా కనిపించారు. ఆమె మొదటిసారి శ్రీకాకుళం యాసలో మాట్లాడినప్పటికీ, ఆ యాసను పూర్తిగా ఆస్వాదిస్తూ అద్భుతంగా పలికిన తీరు ఆశ్చర్యపరిచింది. రవితేజ-శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ఈ ట్రైలర్ కు మరింత అందాన్ని తీసుకొచ్చింది.
	 
	ఇప్పటికే పాటలతో ప్రేక్షకుల మనసు దోచుకున్న సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, తన నేపథ్య సంగీతంతో ట్రైలర్ ను మరో స్థాయికి తీసుకెళ్ళారు. రవితేజ వింటేజ్ మాస్ ఆరాకు సరిగ్గా సరిపోయేలా ఆయన సంగీతం ఉంది. భారీ పోరాట సన్నివేశాలు, కడుపుబ్బా నవ్వించే హాస్యం, అద్భుతమైన పాటలతో విందు భోజనం లాంటి చిత్రానికి 'మాస్ జాతర' హామీ ఇస్తోంది.
	 
	తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు, 'మాస్ జాతర' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 31న 'మాస్ జాతర' చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగుపెట్టనుంది.