యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగశౌర్య, కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించిన ఎంటర్‌టైనర్ రంగబలి. జులై 7న నేడే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రంలో యుక్తి తరేజ కథానాయిక. ఈ సినిమా టీజర్, థియేట్రికల్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్ వచ్చింది. మరి సినిమా ఎలావుందో చూద్దాం.
కథ:
నాగశౌర్య రంగబలి అనే ఊరిలో ఆవారాగా తిరిగుతూ ఓ గ్యాంగ్‌ను మెయిన్‌టైన్ చేస్తాడు. లోకల్ ఎం.ఎల్.ఎ.కు అనుచరుడిగా వుంటూ ఊరిలో కొట్టాటలు చేస్తుంటాడు. తండ్రి ఆ ఊరిలో మెడికల్ షాప్ నడుపుతుంటాడు. బాధ్యతతెలీని కొడుకును నాగశౌర్య తండ్రి వైజాగ్ వెళ్ళి ఏదైనా పనిచేసుకో అని పంపించేస్తాడు. అక్కడ నాగశౌర్య తండ్రి స్నేహితుడు ఫార్మా కాలేజీకి డీన్. అక్కడ మెడికల్ మందుల గురించి తెలుసుకునే క్రమంలో ఫార్మా స్టూడెంట్ యుక్తితరేజను ప్రేమిస్తాడు. ఆమె తండ్రి నాగశౌర్య ఊరిపేరు చెప్పగానే ఈ పెండ్లికి ఒప్పుకోనంటాడు. అందుకు కారణం ఏమంటే. తనతండ్రిని చంపిన ఊరు కనుక ఆ ఊరిని వదిలి వైజాగ్ వచ్చేయని కండిషన్ పెడతాడు. పుట్టిన ఊరును వదిలిరాననీ, మా ప్రేమ కోసం రంగబలి ఊరిపేరును మార్చేస్తానని ఛాలెంజ్ చేస్తాడు. మరి చెప్పినట్లు నాగశౌర్య చేశాడా? లేదా? అసలు రంగబలి అనే పేరు వెనుక కథ ఏమిటి? అనేది మిగిలిన సినిమా.
సమీక్ష:
ఈ సినిమా కథను ఎంటర్‌టైన్‌మెంట్‌గా చెప్పాలని దర్శకుడు డిసైడ్ అయ్యాడు. ఆ కోవలో పాత చింతకాయపచ్చడిలా తయారు చేశాడు. ఎక్కడా లాజిక్క్ జోలికి పోలేదు. ఇష్టం వచ్చినట్లు కథ రాసుకున్నట్లు కనిపిస్తుంది. ఆవారాగా ఎం.ఎల్.ఎ. చెప్పినట్లు చేసే నాగశౌర్య బిల్డప్‌షార్ట్స్ అన్నీ మాస్ హీరో చేసేవిగా వున్నాయి. మొదటిభాగమంతా ఎంటర్ టైన్‌లో సాగుతూ సెకండాఫ్‌లో చివరి 20 నిముషాలముందే సీరియస్‌గా కనిపించినా అది కూడా సరదాగా చేసే ప్రయత్నం దర్శకుడు చేశాడు.
ఎక్కడైనా ఒక ఊరు పేరు మార్చాలంటే అక్కడ ప్రభుత్వానికి చెందిన అధికారులు, మున్సిపాలిటీలు చొరవ తీసుకుని అందుకు ఎం.ఎల్.ఎ. సపోర్ట్‌తో మారుస్తారు. కానీ ఇది సినిమా కనుక కనీసం ఎం.ఎల్.ఎ.కు కానీ, అధికారులకు కానీ తెలీయకుండా హీరో రంగబలి ఊరి సర్కిల్ పేరు మార్చడానికి చేసే ప్రయత్నాలు మరీ చెత్తగా అనిపిస్తాయి. ఇక రంగబలి సర్కిల్‌లో బాంబ్ బ్లాస్ట్ జరపడం అనేది సిల్లీగా వుంటుంది. ముగింపు కూడా సందేశం ఇవ్వాలని సీన్స్ రాసినట్లుంది. ఇదే కథను ఇంకాస్త ఆసక్తికరంగానూ తీయవచ్చు.
నాగశౌర్య ఎప్పటినుంచో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ మధ్య సిక్స్‌పాక్‌లో చేసిన మాస్ సినిమా పెద్దగా లాభంలేకపోయింది. కొన్ని పొరపాట్లు నావల్ల దర్శకుల వల్ల జరిగాయి. ఈసారి గట్టిగా చేసిన సినిమా అని విడుదలకు ముందు చెప్పాడు. కానీ సినిమా చూశాక తనేమి మారలేదు అనిపిస్తుంది. ఇందులోనూ తన బాడీని చూపిస్తూ యాక్షన్‌లోనూ, పాటల్లోనూ తన ఫార్ములా చూపించాడు. ఇప్పటి ట్రెండ్ ఎంతో పరిణితితో కూడిన కథలతో లాజిక్ సన్నివేశాలతో ట్విస్ట్ లతో సినిమాలు తీస్తుంటేనే ఆడడం గగనమైన తరుణంలో రొటీన్ ఫార్ములాతో సినిమా తీయడం సాహసం అనే చెప్పాలి.
దర్శకుడు సినిమా ఫార్మెట్ ఇలానే వుండాలని ఫిక్స్ అయి చేసినట్లుంది. మంచి పాయింట్‌ను ప్రజలకు చెప్పాలనే తాపత్రయం మినహా అందులో ఇప్పటి జనరేషన్‌కు ఎలా చెప్పాలనేది పెద్దగా చెప్పలేకపోయాడు. నటనాపరంగా నాగశౌర్యను వేలెత్తిచూపించలేం. బాగా చేశాడు. హీరోయిన్ కథకు వుండాలి కాబట్టి వుంది. అతని స్నేహితుడిగా సత్య పాత్ర చాలా టిపికల్. ఎదుటివాడు ఏడిస్తుంటే నవ్వే రకం. ఇలాంటివి సమాజంలో చాలా చోట్ల కనిపించేవి. ఇక మిగిలిన పాత్రలు మురళీ శర్మ, బ్రహ్మాజీ, సప్తగిరి పాత్రలు పరిధిమేరకు నటించారు.
టెక్నికల్‌గా కెమెరా పనితనం బాగుంది. సంగీతం పర్వాలేదు. బిగ్‌బాస్ దివి పాటతో అలరించే ప్రయత్నం చేసింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనేది ఎంత ఫేమస్ అయిందో ఇందులోనూ తమ్ముడిలా భావించే ఎం.ఎల్.ఎ.ను నాగశౌర్య ఎందుకు పొడిచాడు? అనే పాయింట్‌ను క్లయిమాక్స్‌లో మీడియాతో రుద్దిరుద్ది వదిలారు. ప్రజల ఎటెన్షన్ ఎలా వుందో చెప్పే ప్రయత్నం చేశాడు. ప్రజలకు తెలీకుండా మంచి చేస్తే చాలదు. కళ్ళకు కనిపించే మేకవన్నె పులిలాంటివారు ఏదో చేశామని చెప్పగానే నమ్మేసే సమాజంలో వున్నాం కాబట్టి వారికి కనువిప్పు కలిగించే ప్రయత్నం చేశాడు. ప్రేక్షకుడు బలి కాకుండా తీయాల్సింది. ఈ పాయింట్ బాగానే వుంది. ఈ సినిమాను మరింత ఆసక్తిగా తీస్తే బాగుండేది.