Sai Pallavi, Rana Daggubati
విడుదల తేది : జూన్ 17, 2022
నటీనటులు : సాయి పల్లవి, రానా దగ్గుబాటి, సాయిచంద్, ప్రియమణి, నందితాదాస్, జరీనా వాహబ్, ఈశ్వరీరావు, నవీన్ చంద్ర తదితరులు
సాంకేతికత- సినిమాటోగ్రఫీ : దివాకర్‌మణి, డానీ సాంచెజ్ లోపెజ్, ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్, నిర్మాణ సంస్థ : శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్స్, నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి, డి. సురేశ్ బాబు, సంగీతం : సురేశ్ బొబ్బిలి, దర్శకత్వం : వేణు ఊడుగుల.
నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ కథా చిత్రం విరాటపర్వం అంటూ ముందునుంచీ ప్రచారంచేస్తున్న చిత్రం రానేవచ్చేసింది. శుక్రవారమే విడుదలైంది. ఓవర్‌సీస్‌లో గురువారంనాడే విడుదలైంది. గతంలో నక్సలిజం నేపథ్యంలో పలు చిత్రాలు వచ్చినా అందులో సామాజిక అంశాలు, పోరాటాలు, విప్లవాలతో ముగింపు వుండేది. మరి ఈ విరాటపర్వం అనేది తెలంగాణ కరీంనగర్‌లో జరిగిన సరళ అనే యువతి కథను కొంత వాస్తవం, కొంత కల్పితంగా దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కించారు. సాయిపల్లవి తెంగాణ అమ్మాయిగా నటించిన ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం.
కథ-
1975 ప్రాంతంలో కరీంనగర్‌లోని ములుగు జిల్లాలో ఒగ్గు కథలు చెబుతూ జీవనం సాగించే సాయిచంద్ కుటుంబం తన భార్య ఈశ్వరీరాయ్ కడుపుతుంటే ట్రాక్టర్‌పై తీసుకెళుతుంటాడు. మార్గమధ్యంలో నగ్జటై్లకు, పోలీసులకు మధ్య తుపాకీ కాల్పులు జరుగుతాయి. ఆ సమయంలో ఓ మహిళా నగ్జలైట్ పురిటికాన్పు చేస్తే పుట్టిన అమ్మాయే వెన్నెల (సాయిపల్లవి). చిన్నతనం నుంచి మొండి మనిషి. తననుకుంది చేయాలనుకుంటుంది. 1990 దశకంలో పెరిగి పెద్దదై యుక్తవయసుకు వచ్చిన వెన్నెలకు స్నేహితుల ద్వారా విప్లవ సాహిత్యం అంటే ఎనలేని ఇష్టం ఏర్పడుతుంది. అరణ్య పేరుతో విప్లవగీతాలు రాసే రవన్న (రానా దగ్గుబాటి) నగ్జల్స్ దళ నాయకుడు అంటే ప్రేమ ఏర్పడుతుంది. కానీ ఆమె తల్లిదండ్రులు స్వంత బావ అయిన రాహుల్ రామకృష్ణతో పెళ్లి ఫిక్స్ చేస్తారు. విషయాన్ని నేరుగా బావకే చెప్పి ఆ తర్వాత ఓ రాత్రిపూట రవన్న జాడకోసం ఇంటినుంచి బయటకు వచ్చేస్తుంది. అలా అడ్రెస్ కోసం అష్టకష్టాలు పడి రవన్నను కలుసుకుంటుంది. ఆ తర్వాత రవన్న ఆమెను తిరస్కరిస్తాడు. అయినాసరే మొండిగా అక్కడే వుండి కష్టాలను ఎదుర్కొంటానంటుంది. ఆ తర్వాత ఏమయింది? అనేది మిగిలిన సినిమా.
విశ్లేషణః
1992లో సరళ అనే మహిళ కథ ఇది. అప్పట్లో పేపర్లో హాట్‌టాపిక్‌గా మారిన ఆమె జీవితాన్ని దర్శకుడు ఆవిష్కరించాడు. ఆ క్రమంలో దర్శకుడు పెట్టిన శ్రద్ధ అభినందనీయం. అసలు మావోయిస్టుల జీవన విధానం ఎలా వుంటుంది. కేడర్ ఎంపిక ఏవిధంగా తయారవుతుంది? పోలీసులు ఎందుకు వారిని టార్గెట్ చేస్తారు? అనే విషయాలను కూలంకశంగా దర్శకుడు చర్చించాడు. కేడర్‌లో నాయకుడు ఏ కులంవాడు వుంటాడు? తక్కువ కులంవాడు కేడర్‌గానే ఎందుకు వుంటాడనే విషయాలను కూడా సున్నితంగా చూపాడు.
- ఈమధ్య మారుమూల ప్రాంతంలోని ఒరిజినల్ కథలు వెండితెరపై రావడం ఆరంభించాయి. కంచెరపాలెం.. వంటి సినిమాలకుముందు కొన్ని వచ్చినా ఆ తర్వాత మరిన్ని పెరిగాయి. దాంతో తెలుగు మూలాలు ఏమిటో ఇప్పటి జనరేషన్‌కు తెలిసినట్లవుతుంది.
- ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది.. కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది.. నేను వెన్నెల.. ఇది నా కథ అంటూ సినిమా స్టార్టింగ్ నుంచే ప్రేక్షకులను వెన్నెల లవ్‌స్టోరీలోకి తీసుకెళ్లాడు. ఫస్టాఫ్‌లో ఎక్కువ భాగం వెన్నెల చుట్టే తిరుగుతుంది. నగ్జలైట్ల పోరాటం కళ్ళకు కట్టినట్లు చూపించి ప్రేక్షకులను ఇన్‌వాల్వ్ చేశాడు.
- బుద్ధుడికి పెండ్లి తర్వాత జ్ఞానోదయం అయినట్లు, మీరాబాయి కృష్ణుడికోసం కన్నవారిని వదిలేసి ఎలా వెళ్ళిందో అంటూ వెన్నెల వెళ్ళీతీరు లాజిక్‌గా దర్శకుడు చెప్పాడు. ఇందుకోసం సరళ కుటుంబీకులను కూడా కలిసివారినుంచి తీసుకున్న ఫీడ్‌బేక్‌తో దర్శకుడు సినిమాను తీశాడు. మొదటి భాగం ఎంతో ఇన్‌వాల్వ్‌మెంట్‌తో పోలీసులు, ప్రజలు, కోవర్ట్ వ్యవస్థ ఏవిధంగా పనిచేస్తుందో చూపించాడు.
- సెకండాఫ్‌లో వెన్నెల నగ్జలైట్‌గా మారి నగ్జల్ సిద్దాంతాలు మావో సిద్ధాంతాలకు అనుకూలంగా లేవంటూ ఇచ్చిన స్పీచ్‌తో కథ మలుపు తిరుగుతుంది. అప్పటివరకు తాము చేస్తున్న కొన్ని హత్యలు తప్పని తెలుసుకుంటారు. ఈ సంఘటనకు దారితీసిన వెన్నెలను పైకమిటీ అభినందిస్తుంది. అప్పటికే ఈర్షతో రగిలిపోతున్న తోటి నగ్జలైట్ నవీన్‌చంద్ర, వెన్నెలపై చేసిన ఆరోపణ ఏస్థాయికి తీసుకెళ్ళిందనేది ముగింపు. ఆ తర్వాత వాస్తవం తెలిసి పశ్చాత్తాపడిన లాభంలేదు. ముగింపే వెన్నెల సినిమాకు ప్రాణం. ఈ సంఘటన ప్రేక్షకుడిని కదిలిస్తుంది.
- రవన్న కోసం దాచుకున్న బొమ్మను పోలీసులు లాక్కునే ప్రయత్నం చేస్తే.. దానిని కాపాడుకునేందుకు వెన్నెల చేసే పని అందరిని ఆకట్టుకుంటుంది. రవన్నపై ఆమెకు ఎంత ప్రేమ ఉందో ఆ ఒక్క సీన్ తెలియజేస్తుంది. పోలీసుల నుంచి రవన్న దళాన్ని తప్పించేందుకు వెన్నెల చేసిన సాహసం ఫస్టాఫ్‌కే హైలెట్
- ఇక ప్రొఫెసర్ శకుంతల (నందితా దాస్) అండతో వెన్నెల దళంలో చేరడం అక్కడ భారతక్క (ప్రియమణి), రఘన్న (నవీన్ చంద్ర)లతో కలిసి వెన్నెల చేసే శిక్షణ, పోరాటాలు ఆకట్టుకుంటాయి. రవన్న తన తల్లిని కలిసి క్రమంలో వెన్నెల పాత్ర, అదే సమయంలో కోవర్ట్‌వల్ల పోలీసుల దాడి. అక్కడనుంచి తప్పించుకునేవిధానం ఆసక్తికరంగా వుంటుంది.
- దర్శకుడు చెప్పాల్సింది సూటిగా చెప్పాడు. మా ఊళ్ళల్ల ఆడవాళ్లపై అత్యాచారాలు, మానభంగాలు జరిగినప్పుడు ఏ పార్టీ వాళ్ళు వచ్చారు సార్.. అన్నలు వచ్చారు సార్.. నోరు లేని సమాజానికి నోరు అందించారు సార్అని రాహుల్ రామకృష్ణతో దర్శకుడు చెప్పిస్తాడు. తుపాకీ గొట్టంలో శాంతి లేదు... ఆడపిల్ల ప్రేమలో ఉంది, 'చిన్న ఎవడు పెద్ద ఎవడు రాజ్యమేలే రాజు ఎవ్వడు.. సామ్యవాద పాలన స్థాపించగ ఎళ్లినాడు లాంటి శ్రీశ్రీతరహా డైలాగ్‌లు ఉత్సాహపరుస్తాయి.
ఎవరెలా చేశారంటే..
ఇందులో ఫలానా వారు బాగాచేశారు. చేయలేదు అని చెప్పలేం. అందరూ తమతమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. రవన్న, వెన్నెల పాత్రలలో జీవించేశారు.
- సాంకేతికపరంగా చూస్తే చిన్న చిన్న సినిమాలు చేసే సురేశ్ బొబ్బిలి సంగీతం. పాటలు ఈ చిత్రానికి ఆకర్షణగా నిలిచాయి. ఇందులో ఓ పాటరూపంలో వచ్చే కవిత్వాన్ని రానా పాడాడు. దివాకర్‌మణి, డానీ సాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది.శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.
దర్శకుడు ఏం చెప్పదలిచాడు
ఇందులో ఎక్కడా రాజకీయ నాయకుల ప్రస్తావన వుండదు. ఊరిలో పెత్తందారుల దాష్టీకానికి బలైపోయిన ఆడవాళ్ళకు న్యాయంకోసం వెళితే పోలీసులు రాజీకోసం ప్రయత్నించేవిధానం ఇప్పటికీ కొనసాగుతూనే వుంది. సమస్యల మూలాలను పరిష్కరించాల్సిన పోలీసులు పాలకుల ఎంగిలితినే వారిగానే చూపించాడు. తక్కువ కులంవాడివి అంటూ పోలీసుకు ఎదురువచ్చినా కాలితో తన్నే వ్యవస్థ ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో పేపర్లలో చూస్తూనే వున్నాం. హైటెక్ అంటూ రాకెట్‌స్పీడ్‌లో ప్రపంచం ముందుకు పోతుంటే ఇంకా రేప్‌లు, హత్యలు, కులాల వ్యవస్థ, దళంలో నమ్మక ద్రోహం ఇంకా కొనసాగుతూనే వున్నాయి. అందుకే నగ్జలైట్ వ్యవస్థ ఈరోజుల్లో పెద్దగా లేదు.. ఇవన్నీ చూసే ప్రేక్షకుడిని ఆలోజింపచేస్తాయి.