నటీనటులు: నిమ్మల శ్రీరామ్, దేవరాజ్ పాలమూర్, అవినాష్ చౌదరి, ఐశర్య ఉల్లింగాల, పులి సీత, విజయ, శ్రీయాంక తదితరులు
సాంకేతికత: కెమెరా: అంబటి చరణ్, సంగీత దర్శకులు: వినోద్ యాజమాన్య, అఖిలేష్ గోగు రియాన్. ఎఫెక్ట్స్: వెంకట శ్రీకాంత్, ఎడిటర్: నాగేశ్వర రెడ్డి బొంతల, మిక్సింగ్ : సంతోష్ కుమార్, నిర్మాత: ఎండీ అసిఫ్ జానీ, రచన-దర్శకత్వం : ఎన్ శివ కల్యాణ్
ప్రొడక్షన్ హెడ్: రజిని కాంత్, శివ నాగిరెడ్డి పల్లి, విడుదల : 08/09/2023
ఆమధ్య జాతిరత్నాలు వంటి సినిమా అందరిని అలరించింది. పూర్తి తెలంగాణ మూలాలున్న కథ. ఆ తరహాలో మరికొన్ని సినిమాలు వచ్చాయి. అందులో ఇటీవలే బలగం వచ్చింది. ఇక ఇప్పుడు తెలంగాణ మట్టి వాసన ఉన్న మరో కథ వచ్చింది. అదే తురుమ్ ఖాన్ లు. ఒకరిద్దరు మినహా అంతా కొత్తవారే అయినా తురుమ్ ఖాన్ లు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రియల్ హీరో బాలీవుడ్ స్టార్ సోనూ సూద్ ముఖ్య అతిథిగా రావడంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో రావాల్సినంత హైప్ వచ్చింది. పక్కా తెలంగాణ, మహబూబ్ నగర్ లోని తుపాకుల గూడెం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ ఈ చిత్రం ఎలావుందో తెలుసుకుందాం.
కథ
తుపాకుల గూడెం అనే ఊర్లో కరోనా టైములో జరిగే ముగ్గురి కథ. శంకర్ (నిమ్మల శ్రీరామ్) యూత్ లీడర్, మరదలు లలిత (ఐశర్య ఉల్లింగాల)తో పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. లలితకు ఇష్టం. కానీ ఆమె నాన్నకు ఇష్టం ఉండదు. అదే టైములో సిటీలో సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ వీరాజ్ బ్రహ్మ(దేవరాజ్ పాలమూర్) ఊరికి వస్తాడు. వయస్సు మీద పడిన పెళ్లి కాలేదు అన్న ప్రెస్టేషన్ ఒకవైపు, తనకు మగతనం లేదని హేళన చేస్తుండంతో నోటి దూలతో అందరిని తిడుతూ ఉంటాడు. బ్రహ్మం ఫ్రెండ్స్ తో తాగుడే పనిగా పెట్టుకుంటాడు. తన కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి పెళ్లి జరిగితే ఈర్ష పొందుతాడు. అలా యూత్ లీడర్ శంకర్ కు పెళ్లి కాకుండా చేస్తాడు. దాంతో రివెంజ్ కోసం వెయిట్ చేసిన శంకర్, బ్రహ్మం విడో అయిన భారతి(విజయ)తో ఎఫైర్ పెట్టుకున్న టైం చూసి ఊరి జనాలకు పట్టిస్తాడు.
ఇంకోవైపు విష్ణు(అవినాష్ చౌదరి) కాలేజ్ లో ప్రేమించిన పద్మతో చిన్న మనస్పర్థతో బ్రేకప్ అవుతుంది. అదే సమయంలో ఊర్లో లాక్ డౌన్ విధిస్తారు. దాంతో ముగ్గురి ప్రేమ కథలు గందర గోళంలో పడతాయి. అవి ఏమిటి? అసలు ఈ ముగ్గురికి ఉన్న సంబంధం ఏంటి.? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
సమీక్ష:
ఇది పక్కా తెలంగాణ గ్రామీణ కథ. మట్టి మనుషులు అలవాట్లు, వారి భాష బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేస్తుంది. తెలంగాణ నేపథ్యంలో వచ్చే పాటతో టైటిల్స్ ప్రేక్షకులను విలేజ్ మూడ్ లోకి తీసుకెళ్లారు. శంకర్ పెళ్లి హాడవిడితో కథ మొదలు అవుతుంది. విలేజ్ బ్యాగ్ డ్రాఫ్ లో కథ కాబట్టి చాలా సహజంగా తెరకెక్కించారు. మన ఊర్లో జరిగే కథను చూసిన అనుభూతి కలుగుతుంది. ఇక కరోనా సమయంలో లాక్ డౌన్ పెట్టినప్పటి రోజులను ఈ సినిమా గుర్తు చేస్తుంది.
ప్రతి డైలాగ్ సన్నివేశపరంగా ఉన్నాయి. దర్శకుడు చాలా జాగ్రత్త తీసుకున్నాడు. నటీనటులు చేసే పనులు ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వుకునేలా చేస్తాయి. బ్రహ్మం పాత్ర సినిమాకు హైలెట్. శంకర్, బ్రహ్మం ఇద్దరు టామ్ అండ్ జెర్రిలా ఎత్తులు, పై ఎత్తులతో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తారు. ఇంటర్వెల్ బ్లాక్ బాగుంది. సెకండ్ హాఫ్ లో జరిగే సంగటనలు మరింత నవ్విస్తాయి. ఊరిలో ఆంటీలు నేనంతే ఎగబడతారని చెప్పే పాత్ర చాలా అలరిస్తుంది. ఇలా పూర్తి వినోదంగా తీసిన ఈ సినిమాలో చిన్నపాటి లోపాలున్నా అవేవి గుర్తు రాకుండా చేయడం విశేషం.
133 నిముషాలు నిడివి ఉన్న ఈ సినిమా క్లైమాక్స్ వరకు హాపీగా అనిపించేలా ఫీలింగ్ కలుగజేస్తుంది. నటీనటులు అందరూ కొత్తవాళ్లే అయినా సినిమా చూస్తున్నంత సేపు వాళ్లతో ట్రావెల్ అవుతుంటాము. సినిమాలో శంకర్ పాత్ర చేసిన శ్రీరామ్ నిమ్మల చాలా మెచ్చూడ్ గా నటించారు. అలాగే జబర్దస్థ్ ఐశర్య తన అందం, అభినయంతో కట్టిపడేసింది విష్ణుగా అవినాశ్ చౌదరి బాగా చేశారు. తన పాత్రకు న్యాయం చేశారు. పద్మ పాత్రలో పులి సీత ఉన్నంతలో బాగా చేసింది. ఇక షేట్ క్యారెక్టర్, బుగ్గ, ట్రాక్టర్ డ్రైవర్, అలాగే బ్రహ్మం తండ్రి పాత్ర చేసిన వారు కూడా మంచి నటనను కనబరిచారు.
చిత్ర దర్శకుడు ఎన్ శివ కళ్యాణ్ అనుభవం ఉన్న డైరెక్టర్ ల కథను హ్యాండిల్ చేసిన విధానం ఆకట్టుకుంది. తాను రాసుకున్న కథను ప్రేక్షకుడు ఆధ్యాంతం ఎంటర్టైన్ అయ్యేలా తీర్చిదిద్దగలిగారు. నటీనటులు కొత్తవాళ్లు అయినప్పటికీ వారి నుండి తనకు కథకు తగ్గట్టుగా నటింపజేయగలడం డైరెక్టర్ ప్రతిభ. నేపధ్య సంగీతం. సిచువేషన్ కు తగ్గట్టుగానే పాటలు అద్భుతంగా ఉన్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. అంబటి చరణ్ సినిమాటోగ్రాఫర్ బాగుంది. ఇది పేరుకు చిన్న సినిమా అయినా చూసాక అలా అనిపించదు. మారుమూల గ్రామం తీసుకుని అక్కడే సినిమా అంతా ఎంటర్టైన్ చేయడం మామూలు విషయం కాదు. పేరుకు తగ్గట్లు వీరు తురుమ్ ఖాన్ లే. ఇక ఆడవారిని గెలవాలంటే ప్రేమతోనే అనే నీతి ఇందులో చెప్పారు. ఇది అందరూ చూడతగ్గ సినిమా.