మళ్ళీమళ్లీ రమ్మనే 'మళ్ళీ రావా'... రివ్యూ రిపోర్ట్
మళ్లీ రావా చిత్రంలో నటీనటులు : సుమంత్, ఆకాంక్ష సింగ్ తదితరులు, సంగీతం : శ్రవణ్ భరద్వాజ్, నిర్మాత : రాహుల్ యాదవ్ నక్క, దర్శకత్వం : గౌతమ్ తిన్ననూరి సుమంత్ సినిమాలనగానే 'సత్యం', 'గోదావరి' చిత్రాలు స్పురిస్తాయి. తర్వాత కొన్ని సినిమాలు చేసినా ఏమా
మళ్లీ రావా చిత్రంలో నటీనటులు : సుమంత్, ఆకాంక్ష సింగ్ తదితరులు, సంగీతం : శ్రవణ్ భరద్వాజ్, నిర్మాత : రాహుల్ యాదవ్ నక్క, దర్శకత్వం : గౌతమ్ తిన్ననూరి
సుమంత్ సినిమాలనగానే 'సత్యం', 'గోదావరి' చిత్రాలు స్పురిస్తాయి. తర్వాత కొన్ని సినిమాలు చేసినా ఏమాత్రం వుపయోగంలేకుండా పోయాయి. ఆమధ్య సరోగసీ అనే కాన్సెప్ట్‌తో 'నరుడా డోనరుడా' చేశాడు. అదీ పెద్దగా లాభం లేకపోయింది. అందుకే ఈసారి క్యూట్ లవ్‌స్టోరీతో ముందుకు వస్తున్నట్లు చెప్పాడు. కొన్ని షార్ట్ ఫిలింస్ చేసిన గౌతమ్ తిన్ననూరి కథ నచ్చి చేసిన ఈ చిత్రం ఈ శుక్రవారమే విడుదలైంది. అదెలా ఉందో చూద్దాం.
కథ :
కార్తిక్ (సుమంత్), అంజలి (ఆకాంక్ష సింగ్) 9వ తరగతి విద్యార్థులు. ఇద్దరిలో తెలీని ఆకర్షణతో ఒకరినొకరు ప్రేమించుకుంటారు. పెద్దలకు విషయం తెలిసి కొట్టడం, తిట్టడం జరిగిపోతాయి. ఇక అంజలి తల్లిదండ్రులు ఆ ఊరి నుండే వెళ్ళిపోతారు. అలా 13 ఏళ్ల పాటు దూరమైన ఆ ఇద్దరూ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో కలుస్తారు. కార్తీక్ చేసే కంపెనీకే అంజలి వస్తుంది. అప్పటికే ఆమెకు పెళ్లి నిశ్చయం అవుతుంది. ఒకరినొకరు కలిసినప్పుడల్లా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. పైకి ఇద్దరూ ఒకరంటే ఒకరిపై ప్రేమ వున్నా.. బయటకు చెప్పుకోలేని స్థితి. ఓ దశలో తనంటే ఇష్టమని కార్తీక్ చెబుతుండగా ఏదో గుర్తుకువచ్చి మానేస్తుంది. తర్వాత తిరిగి వెళ్ళిపోతుంది. మళ్ళీ అనుకోకుండా కార్తీక్ దగ్గరకే రావాల్సి వచ్చింది. ఇక లాభంలేదని ఆమె ఓసారి తన మనస్సులో మాటను వ్యక్తం చేస్తుంది. అప్పుడు కార్తీక్ పరిస్థితి ఏమిటనేది అనేది కథ.
విశ్లేషణ:
ప్రేమకథలు కొత్త పుంతలు తొక్కుతున్న దశ ఇది. హైస్కూల్ లవ్‌స్టోరీతో మొదలై పెళ్లీడు వయస్సు వచ్చేవరకు కథను చెప్పడం ఇందులోని ప్రత్యేకత. దర్శకుడు దీనిపై బాగానే కసరత్తు చేశాడు. శేఖర్ కమ్ముల ఫార్మెట్ తరహాలో క్యూట్ లవ్‌స్టోరీగా చెప్పే ప్రయత్నం చేశాడు. ముందు వర్తమానం తర్వాత గతం, ఇలా ఇద్దరూ కలిసినప్పుడల్లా గుర్తుకు వచ్చే సన్నివేశాలను అటూఇటూ చూపిస్తున్న విధానం కొత్తగా వుంది. ఆ విధానమే ఈ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్. హీరో, హీరోయిన్‌ను ప్రేమించే విధానమే చాలా కొత్తగా ఉంటుంది సినిమాలో.
ఒక రకంగా చెప్పాలంటే హీరో గుండెల్లో ఆకాశమంత ప్రేమున్నా, హీరోయిన్ ఎప్పటికప్పుడు తనను వదిలి వెళ్లిపోతున్నా ఆమెను కనీసం కారణం కూడా అడగనంత ప్రేమ అతనిది. ఇక హీరోయిన్ కోణం నుండి చూస్తే చిన్నతనంలోనే హీరోని ప్రేమించిన తాను పెరిగిన కుటుంబ వాతావరణం వలన హీరోకి దగ్గరవడానికి వెనక్కి తగ్గుతూ ఎప్పటికప్పుడు అతన్ని దూరం చేసుకుంటూనే ఉంటుంది.
హైస్కూల్ విద్యార్థి విద్యార్థులుగా మాస్టర్ రోహిత్, హాసిని చక్కగా నటించారు. వారి పాత్రల్లోనూ స్నేహితుల పాత్రల్లోనూ ఎంటర్‌టైన్‌మెంట్ వుంది. దర్శకుడు గౌతమ్ ఈ రెండు అంశాలని చక్కగా మిక్స్ చేసి సెకండాఫ్‌లో మంచి స్క్రీన్ ప్లేను రాసుకుని సినిమాను రూపొందించిన విధానం బాగుంది. ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది ప్రేమికుల మధ్య వుండే హావభావాలు, ఎమోషన్స్‌ను చూపిస్తూ వాటికి తగిన సంజాయిషీ చెప్పుకునే సందర్భాలు టచ్ చేస్తాయి.
చాలాకాలం తర్వాత సుమంత్ నటనకు మంచి మార్కులే పడతాయి. హీరోయిన్ ఆకాంక్ష సింగ్, హీరో స్నేహితుడిగా చేసిన అభినవ్ నటన బాగున్నాయి. హీరో ఆఫీస్ వాతావరణంలో నడిచే సన్నివేశాలు రిలీఫ్‌గా వుంటాయి. ప్రత్యేకంగా కామెడీ ఆర్టిస్టులు లేకుండా వారితోనే సన్నివేశపరంగా చేయించడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనమే.
అయితే ఇలాంటి ప్రేమకథ చెప్పేటప్పుడు విశదీకరించే విధానం నెమ్మదిగా సాగుతుంది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో డ్రామా మరీ ఎక్కువైంది. ఆరంభం నుండి చివరివరకు ప్రేమ పరంగా సినిమాను పైకి లేపే సన్నివేశాలు రెండు మాత్రమే ఉంటాయి. అలాకాకుండా ఇంకొన్ని సన్నివేశాలని రూపొందించి వుండివుంటే... అంటే హీరో తాలూకు బాధను ఇంకాస్త ప్రభావితంగా చూపించి ఉంటే బాగుండేది. ఇక దర్శకుడు గౌతమ్ రాసుకున్న కొత్త తరహా స్క్రీన్ ప్లే రెండవ అర్థభాగంలో బాగుంది. అయితే 1999, 2012, 2017 వంటి మూడు కాలాల మధ్య నడిపించే విధానం సామాన్యుడికి కన్‌ఫ్యూజ్ కల్గిస్తుంది. స్వచ్చమైన ప్రేమ కోసం ఎంతదూరమైనా ఎంతకాలమైనా వెయిట్ చేయడానికి సిద్ధమన్న దర్శకుడు టైటిల్ జస్టిఫికేషన్ బాగుంది.
సాంకేతిక విభాగం :
దర్శకుడిగా గౌతమ్ తిన్ననూరి ప్రేమ కథను కొత్త కోణంలో చూపించే క్రమంలో కొద్దిగా తికమక పెట్టే ఫస్టాఫ్ స్క్రీన్ ప్లే, ఎక్కువైనట్టు అనిపించే కొంత డ్రామా వంటి లోపాల మినహా మిగతా సినిమా మొత్తాన్ని బాగా హ్యాండిల్ చేశారాయన.
భార్యాభర్తల మధ్య వుండే హెచ్చుతగ్గులు, ఒకరంటే ఒకరికి పడకపోవడం, పిల్లల ముందే కొట్టుకోవడం వంటి సన్నివేశాలు రియలిస్టుగా వారి తల్లిదండ్రుల పాత్రల్లో చెప్పాడు. ఆ తర్వాత తమ తప్పును తెలుసుకునే సన్నివేశం కూడా బాగుంది. శ్రవణ్ భరద్వాజ్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగా కుదిరాయి. నరేష్ సినిమాటోగ్రఫీ కూడా హడావుడి లేకుండా బాగుంది. సత్య తన ఎడిటింగ్ ద్వారా ఫస్టాఫ్ డ్రామా లెంగ్త్‌ను కొద్దిగా తగ్గించి ఉంటే బాగుండేది. రాహుల్ యాదవ్ నక్క పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ముందునుంచీ చెబుతున్నట్లు 'గోదావరి' సినిమా తరహాలో సాగుతుంది. డ్యూయెట్లు వంటివి లేకుండా కథను నడిపే పాట వుండటం ప్రత్యేకత. చక్కటి లవ్‌స్టోరీ కథలు చూసేవారికి నచ్చే చిత్రమిది. అయితే ఈ కథకు సీక్వెల్ వుండేలా ముగింపు ఇవ్వడం మరో విశేషం.