Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజకీయ వ్యవస్థపై మురుగదాస్ వ్యంగ్యాస్త్రమే విజయ్ "సర్కార్" (మూవీ రివ్యూ)

Advertiesment
రాజకీయ వ్యవస్థపై మురుగదాస్ వ్యంగ్యాస్త్రమే విజయ్
, మంగళవారం, 6 నవంబరు 2018 (20:41 IST)
చిత్రం: సర్కార్‌
నిర్మాణ సంస్థ : సన్ పిక్చర్స్
న‌టీన‌టులు: విజయ్‌, కీర్తి సురేశ్‌, వరలక్ష్మి శరత్‌ కుమార్‌, ప్రేమ్‌ కుమార్‌, యోగిబాబు, రాధా రవి తదితరులు..
స‌ంగీతం: ఏఆర్‌ రెహమాన్‌
నిర్మాత‌లు: కళానిధి మారన్‌
ద‌ర్శ‌క‌త్వం: ఏఆర్. మురుగదాస్‌
విడుదల: 6-11-2018
 
దర్శకుడు ఏఆర్.మురుగదాస్‌ సినిమాల్లో సమాజంలోని ఏదో ఒక అంశాన్ని తన చిత్ర కథాంశంగా ఎన్నుకుని, రాజకీయ నేతలకు చురక అంటిస్తాడు. అలాంటి చిత్రమే విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వం వహించిన చిత్రం "సర్కార్". నిజానికి విజయ్‌ సినిమా వస్తే మాస్‌కి పండగే. వీరిద్దరూ కలసి వస్తే ఎలా ఉంటుందో ఇప్పటికే చూశాం. వీరి కలయికలో వచ్చిన 'తుపాకి', 'కత్తి' బాక్సాఫీస్‌ దగ్గర అదరగొట్టాయి. 
 
ఈ కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రమే 'సర్కార్'. ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. పైగా, ఆ సినిమా రాజకీయ నేపథ్యం కావడంతో కూడినది కావడంతో ఆ అంచనాలు రెండింతలయ్యాయి. టీజర్‌, ట్రైలర్‌లో డైలాగ్‌లు, విజయ్‌ హావభావాలు వాటిని ఇంకా పెంచేశాయి. ఇంత బరువు బాధ్యతలతో దీపావళి పండుగను పురస్కరించుకుని సర్కార్ చిత్రం మంగళవారం అటు తమిళం.. ఇటు తెలుగులో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో ఓసారి పరిశీలిద్ధాం. 
 
కథ : 
సుందర్‌(విజయ్‌) అమెరికాలో ఒక పేరు మోసిన కంపెనీకి సీఈవో. సంవత్సరానికి రూ.వెయ్యి కోట్ల జీతం. ఓటు హక్కును వినియోగించుకోవడానికి భారత్‌కు వస్తాడు. అప్పటికే అతడి ఓటును ఎవరో వేసేస్తారు. తన ఓటు తనకు కావాలని కోర్టుకెక్కుతాడు. రాజ్యాంగాన్ని, హక్కులను దృష్టిలో పెట్టుకుని న్యాయస్థానం కూడా అతని ఓటును అతడికి తిరిగి ఇవ్వాలని తీర్పు ఇస్తుంది. ఆ తీర్పును అనుసరించి, దాదాపు మూడులక్షల మంది న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు. దాంతో ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాల్సిన పుణ్యమూర్తి(రాధా రవి) ప్రమాణ స్వీకారానికి ముందే ఎన్నికలు రద్దవుతాయి. మరో 15 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని కోర్టు తీర్పు చెబుతుంది. ఆ ఎన్నికల్లో సుందర్‌ సీఎం ప్రత్యర్థిగా నిలబడాలని నిర్ణయం తీసుకుంటాడు. మరి ఆ ఎన్నికల్లో సుందర్‌ గెలిచాడా? తన ఓటును తాను దక్కించుకోవడానికి వచ్చిన సుందర్‌ ఓటర్లందరికీ ఏం చెప్పాడు. వాళ్లలో చైతన్యం ఎలా తీసుకొచ్చాడన్నదే మిగిలిన చిత్ర కథ. 
 
కథ ఎలా ఉందంటే.. 
ఏఆర్.మురుగదాస్‌ కథలన్నీ ఒక సామాజిక నేపథ్యం కలిగి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ఉంటాయి. ఈ సినిమా కూడా అదే పంథాలో కొనసాగింది. విజయ్‌ అభిమానులకు ఏమేమి కావాలో అవన్నీ సినిమాలో పెట్టాడు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని సుత్తిలేకుండా సూటిగా, సగటు ప్రేక్షకుడుకి అర్థమయ్యేలాగా చెప్పేశాడు. ఒక ఓటును ఎవరైనా దొంగతనంగా వేసేస్తే ఆ హక్కును తిరిగి సంపాదించుకోవచ్చనేది చాలా మందికి తెలియదు.
webdunia
 
రాజ్యాంగ పరిభాషలో ఆ చట్టాలన్నీ సామాన్యులకు అర్థంకావు. అయితే, వాటిని కూడా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లు ఈజీగా చెప్పగలిగాడు. అసలు ఇవన్నీ బయట ప్రపంచంలో జరుగుతాయా? లేదా? ఒక బలమైన రాజకీయ ప్రత్యర్థి.. 50 ఏళ్లుగా రాష్ట్రాన్ని ఏలుతున్న సీఎంను ఒక కార్పొరేట్‌ మేధావి ఎదిరించగలడా? ఎదిరించి నిలవగలడా? అన్నది మన ఊహకు కూడా అందదు. అవి బయట కూడా జరిగే అవకాశం ఉండదు. అయితే, వాటిని నమ్మేట్టు తన తెలివి తేటలతో చూపించగలిగాడు.
 
కథ మొదటి సన్నివేశం నుంచి దర్శకుడు కథలోకి వెళ్లిపోయాడు. కాబట్టి, ప్రేక్షకులు సులభంగా సినిమాలో లీనమవుతారు. తన ఓటు కోసం విజయ్‌ చేసే ప్రయత్నాలన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. పాట, ఫైట్‌ అనే కమర్షియల్‌ సూత్రాన్ని ఎక్కడా విస్మరించలేదు. విజయ్‌ సినిమాల్లో ఉండే వాణిజ్య హంగులను ఎక్కడికక్కడ జాగ్రత్తగా పేర్చుకుంటూ వెళ్లాడు. ద్వితీయార్ధం మొత్తం రాజకీయాల చుట్టూనే తిరుగుతుంది. సుందర్‌ ఏం చేస్తాడా? ఎలా గెలుస్తాడా? అని ఉత్కంఠభరింతంగా చూపించాడు. 
 
పాప (వరలక్ష్మి) పాత్ర ఎంట్రీతో కథ మరింత మలుపు తిరుగుతుంది. బలమైన ప్రత్యర్థి ఉండటంతో కథానాయకుడు ప్రతినాయిక మధ్య సన్నివేశాలు రసవత్తరంగా సాగుతాయి. కానీ, లాజిక్‌కి అందని విషయాలు చాలానే ఉన్నాయి. తన టేకింగ్‌తో అవన్నీ మర్చిపోయేలా ఒక సంక్లిష్టమైన సినిమాను ఒక పక్కా కమర్షియల్‌ సినిమాగా తీర్చిదిద్దాడు. ఈ చిత్రంలోని పలు సన్నివేశాలు తమిళ రాజకీయాలకు చాలా దగ్గరగా ఉంటాయి. ఓట్లను అమ్ముకోవడం, ఉచిత పథకాలకు లొంగిపోవడం వంటి అంశాలపై దర్శకుడు సెటైర్లు వేయగలిగాడు. ఆస్పత్రి రాజకీయాలు కూడా తెరపై కనిపిస్తాయి.
 
విశ్లేషణ : 
విజయ్‌కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. తన అభిమానులను మరోసారి మెస్మరైజ్‌ చేయగలిగాడు. పొలిటికల్‌ డైలాగ్‌లు చెప్పేటప్పుడు విజయ్‌ హావభావాలు ఆకట్టుకుంటాయి. కీర్తి సురేష్‌ది అతిథి పాత్రలా ఉంది. ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం లేదు. సీఎంగా కనిపించిన పాత్రలో తెలుగు నటుడిని ఎంచుకుంటే బాగుండేది. తెరపై ప్రతినాయికగా వరలక్ష్మి బాగా రాణించింది. ఏఆర్.రెహమాన్‌ సంగీతం విషయానికొస్తే పాటలు ఆకట్టుకోవు.
webdunia
 
నేపథ్య సంగీతంలో రెహమాన్‌ మార్కు కనిపిస్తుంది. విజువల్‌గా సినిమా బాగుంది. పోరాట సన్నివేశాల్లో కెమెరా పనితనం చక్కగా ఉంది. మురుగదాస్‌ మరోసారి తన శైలికి తగిన కథను ఎంచుకున్నాడు. ప్రస్తుత రాజకీయాలపై ఒక వ్యంగ్యాస్త్రాన్ని సంధించగలిగాడు. అయితే, కమర్షియల్‌ అంశాల జోడింపులో నూటికి నూరుపాళ్లు విజయం సాధించాడు. 
 
ఈ చిత్రం బలాలను పరిశీలిస్తే, కథాంశంతో పాటు.. ప్రస్తుత రాజకీయ నేపథ్యం, హీరో విజయ్ నటన ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుంది. అలాగే, చిత్రంలో ఆకట్టుకునేలా పాటలు లేకపోవడం, కొన్ని సన్నివేశాల్లో లాజిక్ లేకపోవడం వంటివి చిన్నపాటి మైనస్ పాయింట్లుగా చెప్పుకోవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాత్ర కోసం రక్తం చిందించారు... ముక్కు చెవులు కుట్టించుకున్న హీరో...