Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తేడా సింగ్ 'పైసా వసూల్‌'... రివ్యూ రిపోర్ట్(వీడియో)

పైసా వసూల్ నటీనటులు : నందమూరి బాలకృష్ణ, శ్రియా శరన్‌, ముస్కాన్‌, విక్రం జీత్‌; సంగీతం : అనూప్‌ రూబెన్స్‌, నిర్మాత: వి. ఆనంద్‌ ప్రసాద్‌, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌. బాలకృష్ణ సినిమా అంటేనే ఎమోషన్స్‌, పవ

తేడా సింగ్ 'పైసా వసూల్‌'... రివ్యూ రిపోర్ట్(వీడియో)
, శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (16:57 IST)
పైసా వసూల్ నటీనటులు : నందమూరి బాలకృష్ణ, శ్రియా శరన్‌, ముస్కాన్‌, విక్రం జీత్‌; సంగీతం : అనూప్‌ రూబెన్స్‌, నిర్మాత: వి. ఆనంద్‌ ప్రసాద్‌, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.
 
బాలకృష్ణ సినిమా అంటేనే ఎమోషన్స్‌, పవర్‌‌ఫుల్‌ డైలాగ్‌లు. 'సింహా', 'లెజెండ్‌'తో వయస్సుకు తగ్గ పాత్రలు వేసి కథాబలంతో మెప్పించాడు. మరి అలాంటి కథానాయకుడు పూరీ జగన్నాథ్‌తో సినిమా అనగానే ఇండస్ట్రీలో 'ఏదో తేడా కొడుతుంద'నే కామెంట్లు స్పష్టంగా విన్పించాయి. పైగా చాలా తక్కువ కాలంలో చిత్రీకరణ పూర్తయింది. 'మరకతమణి' సినిమాను తీసిన భవ్య ఆర్ట్‌ క్రియేషన్స్‌కు ఈ కాంబినేషన్‌ కుదరడంతో నిర్మాణం చేపట్టింది. సినిమా విడుదలకు ముందే 'స్టంపర్‌' అంటూ కొత్త పదాన్ని పరిచయం చేసి మినీసైజ్‌ ట్రైలర్‌ను విడుదల చేసిన దర్శకుడు సినిమాను ఇంకెంత కొత్తదనంతో తెరకెక్కించాడో అని ఆసక్తి రేకెత్తించాడు. మరి అది నిజామా కాదా! చూద్దాం.
 
కథ : 
తేడా సింగ్‌(బాలకృష్ణ) ఓ కాలనీలో దౌర్జన్యంగా లాయర్‌ ఇంటిలో మకాం వేస్తాడు. తీహార్‌ జైలు నుంచి వచ్చాడని అందరూ భయపడతారు. ఆ తర్వాత లాయర్‌ తెచ్చిన రౌడీ గ్యాంగ్‌నూ చితక్కొడతాడు. వీళ్ళంతా పోర్చుగల్‌ డాన్‌ బాబ్‌ మార్లే (విక్రం జీత్‌) మనుషులనీ, నిన్ను వదల్డనీ లాయర్‌ హెచ్చరిస్తాడు. వాడినే నేను వదల్నంటూ సవాల్‌ విసురుతాడు తేడాసింగ్‌. సరిగ్గా ఆ సమయంలోనే ఇటువంటి తేడాగాడి కోసం వెతుకుతున్న ఓ పోలీసు అధికారికి విషయం తెలిసి తన ఆపరేషన్‌ కోసం వుపయోగించుకోవాలని క్రింది అధికారులకు సూచిస్తాడు. 
 
అలా పోలీసు మనిషిగా బాబ్‌మార్లే బ్యాచ్‌లో చేరి అతని కదలికలను పరిశీలించే పనిలో వుంటాడు. మరోవైపు పోర్చుగల్‌కు వెళ్ళిన తన సోదరి శ్రియా కన్పించడం లేదంటూ పోలీసు స్టేషన్‌లో హారిక ఫిర్యాదు చేస్తుంది. ఆ సమయంలో కేంద్రమంత్రి ఈమెను చూసి కంగారుపడి, శ్రియా ఈమెకు ఏదైనా రహస్యం చెప్పిందేమోనని తన రౌడీ గ్యాంగ్‌ను పంపించి.. వినకపోతే చంపేయమంటాడు. ఆ ఇంటిపై డేగ కన్నేసిన తేడాసింగ్‌ రౌడీల భరతం పట్టి మీ డాన్‌ బాబ్‌మార్లేను చంపడానికే వచ్చానంటాడు. విషయం తెలిసిన డాన్‌కు ఆయన పరిశోధనలో... తేడాసింగ్‌ తనింతకాలం వెతుకున్న శత్రువు బాల అనే నిర్ధారణకు వస్తాడు. డాన్‌కు ఎందుకని బాల శత్రువయ్యాడు? అతని గతం ఏమిటి? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
 
విశ్లేషణ:
సినిమా అంతా బాలకృష్ణ వన్‌ మ్యాన్‌ షో. వయస్సు యాభై దాటినా డాన్స్‌, ఫైట్స్‌ పరంగా హుషారుగా చేయడం ఆయనకే చెల్లింది. ఇందులో ఓ పాట కూడా పాడటం విశేషం. ఇక శ్రియా శరన్‌ పాత్ర ఇన్వెస్టిగేషన్‌ జర్నలిస్టు. విలన్‌గా నటించిన విక్రంజీత్‌ చూడటానికి బాగానే ఉన్నాడు కానీ అతని తమ్ముడు కోరిన అమ్మాయిలను సప్లయ్‌ చేసే బ్రోకర్‌లానే కనిపించాడు తప్పితే అంతర్జాతీయ పోర్చుగల్‌ మాఫియా డాన్‌లా ఎక్కడా అనిపించడు. అలాగే మిగిలిన హీరోయిన్లలో ముస్కాన్‌ సేథి, కైరా దత్‌ పాత్రలు పెద్దగా ఆకట్టుకోవు.
 
ఇక కథపరంగా చూస్తే.. పోర్చుగల్‌ డాన్‌ను 'రా' ఏజెంట్‌ ఎలా తుదముట్టించాడన్నది పాయింట్‌. ఈ విషయం ప్రేక్షకులు గ్రహించాలంటే చివరి 20 నిముషాల వరకు ఆగాల్సిందే. అప్పటివరకు కథ, కథనం అంతా తేడాగా వుంటుంది. ఎక్కడా ఆసక్తి కన్పించదు. ప్రేక్షకుడు ఫీలయ్యే ఏ అంశమూ వెతికినా దొరకదు. హీరో ఇంట్రడక్షన్‌లో బాలకృష్ణ చెప్పే డైలాగ్‌తో పసలేదని తేలిపోతుంది. తను చెప్పే వాయిస్‌ లోపంతో బొంగురు గొంతు వచ్చేసింది. అన్ని సన్నివేశాల్లోనూ ఒకేలా మాడ్యులేషన్‌ ఇవ్వడం ప్రధాన లోపం. ఇదంతా దర్శకుడి ప్రతిభే అని చెప్పాలి. 
 
టెర్రరిజం నేపథ్యంలో కథను చూపించినా అంతా గందరగోళంగా అనిపిస్తుంది. రవితేజ చేయాల్సిన పాత్రను బాలకృష్ణ చేత చేయించినట్లు వుండటంతో పాత్ర ఔచిత్యం గాల్లో కలిసింది. ఎప్పటినుంచో బాలకృష్ణతో చేయాలకున్న పూరీ సరైన విధంగా వుపయోగించుకోలేకపోయాడు. ఒకరకంగా చెప్పాలంటే మాఫియా కథని ఎంచుకొని అడ్డదిడ్డమైన స్క్రీన్‌ ప్లేతో ఓ ఆట ఆడుకున్నాడు. యాదృశ్చికమో ఏమోకానీ తేడాసింగ్‌ అనే పేరు సినిమాకు సరిపోయినట్లుగా అనిపిస్తుంది. 'పైసా వసూల్‌' అనే టైటిల్‌కు ఎక్కడా సింక్‌ కాదు. ఇంతోటి కథను పోర్చుగల్‌ వరకు తీసుకెళ్ళిన నిర్మాతను భుజం తట్టాల్సిందే.
 
బాలకృష్ణ పోషించిన 'రా' అధికారి పాత్ర ఒకప్పుడు ముంబై మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీంను పట్టుకునేందుకు నియమితులైన స్పెషల్‌ ఆఫీసర్‌ పాత్ర గుర్తుకు వస్తుంది. తను రిటైర్‌ అయ్యాక రాసిన పుస్తకంలో దావూద్‌ తన చేతికి చిక్కాక.. ఓ కేంద్రమంత్రి చేసిన ఫోన్‌ కాల్‌తో వదలాల్సి వచ్చిందనీ.. అప్పుడు ఎంతో బాధపడ్డానని పేర్కొన్నారు. సరిగ్గా ఈ పాయింట్‌తోనే పూరీ కథను అల్లినట్లు కన్పిస్తోంది. కానీ దాన్ని సరైన ప్రణాళిక లేకుండా చేయడంతో అభాసుపాలైంది. 
 
కొత్త దర్శకులు వినూత్నమైన అంశాలతో, కథనాలతో ఆకట్టుకుంటున్న ఈ కాలంలో పాతచింతకాయ పచ్చడి తరహాలో ఏవో పంచ్‌ డైలాగ్‌లు రాసేసి, డాన్స్‌లు వేయించేస్తే సరిపోతుందనుకోవడం అవివేకం. ఇక పాటల్లో అలనాటి ఎన్‌టిఆర్‌ నటించిన చిత్రంలోని పాటను దింపేశాడు. అదే చిత్రంలో ప్రత్యేకత. బాలయ్య పలికే డైలాగ్‌లు, పాటలు ఇలా వున్నాయి. 
 
డైలాగ్‌లు: నన్ను నమ్ముకో ఉన్నదంతా పెట్టుకో.. పైసా వసూల్‌, ఫాలోయింగ్‌ ఉన్నోడిని, ఫాలో అయ్యేరకం కాదు. పదిమందికి పెట్టినా మనమే... నలుగురిని కొట్టినా మనమే. రేయ్‌... నా గుండెల్లో కాల్చే హక్కు ఇద్దరికే వుంది. ఫ్యాన్స్‌ అండ్‌ ఫ్యామిలీ. ఔటర్స్‌ నాట్‌ ఎలౌడ్‌. నేనంతే.. కసి తీరకపోతే శవాన్ని లేపి మళ్లీ.. చంపుతా..( చచ్చిన శవాన్ని లేపి చంపడమేమిటో పూరీకే తెలియాలి మరి) - ఇవన్నీ సన్నివేశానికి ఏమాత్రం అతకవు.
 
ఇక పాటల పరంగా చూస్తే: మామ ఏక్‌ పెగ్‌ లా.. పాటకు ఫ్యాన్స్‌ నుంచే స్పందన.. పాట కూడా డైలాగ్‌లా వుంది. సరైన రీరికార్డింగ్‌ లేదు. అనూప్‌ బాణీలు పెద్దగా ఆకట్టుకోలేదు.
 
- అప్పట్లో బెల్‌బాటమ్‌ ఫ్యాంట్స్‌ ఫ్యాషన్‌. ఆ వస్త్రధారణతో ఎన్‌టిఆర్‌ నటించిన సినిమాలోని.. 'కంటి చూపు చెబుతోంది.. గుండె మనసు చెబుతోంది.. ఓ రాజా. వస్తావా.. ఇస్తావా..! అనే పాటను అనుకరించేశాడు. ఇదొక్కటే కాస్త ఆటవిడుపు. ఇంతకుమించి ఆశించి వచ్చారా! నాట్‌ ఎలౌడే.. బీ కేర్‌ఫుల్
 
- పెండ్యాల మురళీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమలో షాలిని పాండే... అభిమాని అడిగితే అదేనందట...