పద్మావత్ రివ్యూ : కామ పిశాచి చేతిలో రాణి పద్మావతి ఏమైంది?(Video)
ఇటీవలికాలంలో బాలీవుడ్‌నే కాదు, యావత్ సినీ ప్రపంచాన్నీ కుదిపేసిన పేరు.... పద్మావత్. వివాదాలు, విమర్శలతో పద్మావత్ పేరు మార్మోగిపోయింది. చిత్ర బృందాన్ని 'చంపేస్తాం' అని ఓ వర్గం బెదిరించేంత వర
చిత్రం : పద్మావత్
నటీనటులు: దీపికా పదుకొనే, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్, అదితిరావు హైదరీ తదితరులు
నిర్మాణ సంస్థలు: భన్సాలీ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్
సంగీతం: సంజయ్ లీలా భన్సాలీ
నిర్మాతలు: సంజయ్ లీలా భన్సాలీ, అజిత్ అంధారే, సుధాంశ్ వత్స్
దర్శకత్వం: సంజయ్ లీలా భన్సాలీ
ఇటీవలికాలంలో బాలీవుడ్‌నే కాదు, యావత్ సినీ ప్రపంచాన్నీ కుదిపేసిన పేరు.... పద్మావత్. వివాదాలు, విమర్శలతో పద్మావత్ పేరు మార్మోగిపోయింది. చిత్ర బృందాన్ని 'చంపేస్తాం' అని ఓ వర్గం బెదిరించేంత వరకూ వెళ్లిందంటే... ఈ చిత్రం రేపిన ప్రకంపనలేంటో అర్థం చేసుకోవచ్చు. చరిత్రని చరిత్రగానే చూపిస్తున్నాం.. కల్పితాలు లేవు.. అని దర్శకుడు నెత్తీనోరు బాదుకుని మొత్తుకున్నా ఆందోళనకారులు శాంతించలేదు.
రాజ్‌పుత్ రాణి పద్మావతి ఆత్మత్యాగానికి సంబంధించిన కథ కావడంతో సినిమా ప్రకటన చేసినప్పటి నుండి చాలా ఆసక్తి పెరిగింది. దీంతో సెన్సార్ బోర్డు సభ్యులు కూడా తన కత్తెరకు మరింత పదును పెట్టి, అణువణువూ గాలించి, విమర్శలకు తావివ్వకుండా సెన్సార్ చేసి.. విడుదలకు అనుమతులు ఇచ్చింది.
అంతకుముందు సినిమా చిత్రీకరణ సమయంలో యూనిట్‌పై దాడులు కూడా జరిగింది. తీరా విడుదల సమయంలో రాజ్‌పుత్ కర్ణిసేనలు పెద్ద ఆందోళనే చేశాయి. వీరి ఆందోళనలకు తలొగ్గిన రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చిత్ర ప్రదర్శనపై నిషేధం విధించాయి. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి ఈ చిత్రం గత యేడాది డిసెంబర్ ఒకటో తేదీనే విడుదల కావాల్సి ఉంది.
కానీ, రాజ్‌పుత్ కర్ణిసేన కార్యకర్తలు ఆందోళనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. ఆ తర్వాత సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రాన్ని చూసి ఓకే చెప్పారు. అయితే, చిత్ర కథలో ఎక్కడా ఒక్క కత్తిరింపు కూడా వేయని సెన్సార్ బోర్డు సినిమా పేరును మాత్రం పద్మావత్‌గా మార్చింది. అలాగే, సుప్రీంకోర్టు జోక్యంతో సినిమాను ఈ నెల 25న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌కు పర్మిషన్ దొరికింది. మరి అంతలా వివాదాలు చెలరేగడానికి ఈ సినిమాలో ఏముందో తెలుసుకోవాలంటే కథేంటో చూద్దాం...
కథ:
అల్లావుద్దీన్ ఖిల్జీ (రణవీర్ సింగ్) అడ్డదారుల్లో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టిస్తాడు. తనో కామ పిశాచి. ప్రపంచంలో అందమైనవీ, అద్భుతమైనవన్నీ తన దగ్గరే ఉండాలని ఆశ పడతాడు. అందుకోసం ఎంతటి దుర్మార్గమైనా చేసేస్తాడు. ఈ ప్రపంచంలోనే అత్యంత అందగత్తె 'పద్మావతి' గురించి ఖిల్జీకి తెలుస్తుంది.
అయితే, కామాంధుడైన అల్లావుద్ధీన్‌ను ఎవరూ ఎదిరించలేరు. చాలా మంది హిందూ రాజులు అతనికి సామంతులుగా మారుతారు. అదేసమయంలో మేవాడ్ రాజు రావల్ రతన్ సింగ్ (షాహిద్ కపూర్), సింహళ యువరాణి పద్మావతి (దీపికా పదుకొనే)ని పెళ్లి చేసుకుని తన రాజ్యానికి తీసుకుని వస్తాడు. మేవాడ్ రాజ గురువు రాఘవ చింతనుడు చేసిన అపరాధం వల్ల రతన్ సింగ్ అతన్ని దేశ బహిష్కరణ చేస్తాడు.
రాఘవ్ కక్షతో అల్లావుద్ధీన్ వద్దకు చేరి.. పద్మావతి అందం గురించి వివరిస్తారు. తనో రాజ్‌పుత్ వంశానికి చెందిన వీరనారి. దీంతో ఆమెను ఎలాగైనా తన వశం చేసుకోవాలన్న ప్రతినబూనుతాడు. అల్లావుద్ధీన్ తన సైన్యంతో మేవాడ్‌పై దండెత్తుతాడు. మరి అల్లావుద్ధీన్ యుద్ధంలో గెలుస్తాడా? పద్మావతిని దక్కించుకున్నాడా? అసలు పద్మావతి ఆత్మ త్యాగం ఎందుకు చేసింది? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
బాలీవుడ్ దర్శక దిగ్గజంగా పేరుగాంచిన సంజయ్ లీలా భన్సాలీ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. గతంలో జోథా అక్బర్, బాజీరావ్ మస్తానీ వంటి సినిమాలను తెరకెక్కించిన అనుభవం ఉండటంతో ఈ చిత్రం టేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక సినిమాలో వివాదం రేగేంతగా సన్నివేశాలు ఎక్కడా కనిపించవు. మరి వివాదంలో ఎందుకు చిక్కుకుందే ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరికీ అంతుచిక్కదు.
పైగా, ఎవరి మనోభావాలనూ దెబ్బ తీయకుండా సినిమాను దర్శకుడు తెరకెక్కించాడు. పుసక్తాల్లో ఉన్న, చరిత్రలో ముఖ్యమైన అంశాలను మాత్రమే తీసుకుని తెరకెక్కించడం కష్ట సాధ్యమైన విషయమే అయినా దర్శకుడు చేసిన ప్రయత్నం అభినందనీయం. అయితే బలమైన ఎమోషన్స్‌తో కూడిన కథ సినిమాలో కనపించదు. రాజ్‌పుత్‌ల వేషధారణ, అల్లావుద్ధీన్ లుక్ అన్నీ బాగున్నాయి.
ఇక దీనికి తగ్గట్లు మంచి నటీనట వర్గం కూడా దొరికింది. దీపికా పదుకొనే హుందాగా రాణి పద్మావతిగా కనిపించింది. రతన్ సింగ్‌గా షాహిద్ నటన మెచ్చుకోవాల్సిందే. ఇక ఖిల్జీ పాత్రలో నటించిన రణవీర్ సింగ్ నటన మిగతా వారందరినీ డామినేట్ చేసింది. ఇక సంజయ్ లీలా సంగీతం, నేపథ్య సంగీతం ప్రేక్షకులను మెప్పిస్తాయి. సుదీప్ ఛటర్జీ రాజ్‌పుత్ కోటలను, సన్నివేశాలను తన కెమెరాలో చక్కగా చూపించారు. నిర్మాణ విలువలు చాలా గొప్పగా అనిపిస్తాయి.
ప్లస్ పాయింట్స్ : సంజయ్ లీలా భన్సాలీ టేకింగ్, నటీనటులు, నిర్మాణ విలువలు, ఆర్ట్ వర్క్, గ్రాండ్ విజువల్స్, సంగీతం, నేపథ్య సంగీతం సూపర్బ్‌గా ఉండగా, సినిమాలో సన్నివేశాలు పాత్రల మధ్య ఎమోషన్స్ పెద్దగా కనిపించవు. అలాగే, సన్నివేశాల్లో డెప్త్ ఉండదు. యుద్ధ సన్నివేశాలు భారీగా ఉంటాయనుకుంటే.. అలాంటి సన్నివేశాలు కనపడవు. చిత్రం స్లో నెరేషన్‌లో సాగడం కాస్తంత నిరాశ కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు.
ఫినిషింగ్ పాయింట్ : పద్మావత్.... వివాదాలు, భావోద్వేగాలను పక్కన పెట్టి గ్రాండ్‌నెస్ కోసం ఒకసారైనా సినిమా చూడొచ్చు
రేటింగ్ : 3.5/5
వీడియో చూడండి