Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలువనున్న "ఎవరు" (మూవీ రివ్యూ)

బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలువనున్న
, గురువారం, 15 ఆగస్టు 2019 (16:06 IST)
అడవి శేష్ మరో ఇన్నోవేటివ్ మూవీ ఎవరు. ఈ చిత్రం గురువారం విడుదలైంది. గతంలో క్షణం, గూఢచారి వంటి అభిరుచి గల కథాంశాల్నిఎంచుకొని చక్కటి విజయాల్ని అందుకున్నారు. ఇపుడు ఎవరు పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 
 
నిజానికి ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో థ్రిల్లర్ చిత్రాల హవా నడుస్తోంది. మంచి కథాబలంతో పాటు కావాల్సినంత ఉత్కంఠను పంచే థ్రిల్లర్ చిత్రాల్ని ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. విదేశీ చిత్రాల్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ ఇతివృత్తాల్నిమన నేటివిటీకి అనుగుణంగా తీర్చిదిద్ది థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కించడం ఓ ట్రెండ్‌గా మారిపోయింది. ఈ నేపథ్యంలో వచ్చిన చిత్రమే ఎవరు. ఈ చిత్రం అంచనాల్ని ఏ మేరకు అందుకుంది? అడవి శేష్ మరో ప్రయోగం ఫలించిందా? అనేది ఈ చిత్ర కథను పరిశీలిస్ధాం. 
 
కథ : 
జీవితంపై ఎన్నో ఆశలతో బ్రతికే యువతి సమీర(రెజీనా) ఓ హోటల్లో రిసెప్షనిస్టుగా పని చేస్తూ ఉంటుంది. అదే హోటల్ యజమాని అయిన పారిశ్రామికవేత్త రాహుల్ని పెళ్లాడుతుంది. ఓరోజు అనుకోకుండా తమిళనాడు కూనూర్ హిల్ స్టేషన్ డిఎస్పీ అశోక్ (నవీన్ చంద్ర)ను సమీర హత్య చేస్తుంది. అత్యాచారం చేయబోతే ఆత్మరక్షణార్థం చంపానని పోలీసులకు వాంగ్మూలం ఇస్తుంది. 
 
ఈ కేసును పరిశోధించడానికి పోలీస్ అధికారి విక్రమ్ వాసుదేవ్ (అడివి శేష్) రంగంలోకి దిగుతాడు. సమీరను విచారించే సమయంలో అతనికి విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. తాను మధ్యలో ఇన్వెస్టిగేషన్ ఆపేసిన ఓ మిస్సింగ్ కేసుకు, సమీర ఉదంతానికి మధ్య సంబంధం ఉందని అతనికి అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో సమీరను రక్షించే నెపంతో ఆమె దగ్గర లంచం కూడా తీసుకుంటాడు. అయితే విచారణ చివరలో సమీర కేసు అనూహ్యమైన మలుపులు తిరుగుతుంది. 
 
అసలు ఆ రెండు కేసుల మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అశోక్‌ను హత్య చేసింది సమీరాయేనా? మిస్సింగ్ కేసుగా నమోదుగా చేసిన వినయ్ వర్మను (మురళీశర్మ) హత్య చేసింది ఎవరు? ఈ చిక్కుముడి ఏ విధంగా విడిపడుతుంది? ఈ క్రమంలో తెలుసుకున్న నిజాలేమిటి? అన్నదే ఈ చిత్ర కథ. 
 
విశ్లేషణ : 
నిజాన్ని బయటకు తీసుకురావడానికి అబద్దాన్ని సహాయం తీసుకుంటా అంటూ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌ను ఇదే పాయింట్ మీదే నడిపించారు. ఏదేని ఒక సంఘటన గురించి ఎవరైనా ఇచ్చేది సమాచారమే. అది నిజమో కాదో రూఢీ కావాలంటే మాత్రం అందుకు సాక్ష్యం కావాలి. అనుమానితులు అబద్దాల్ని నిజమని నమ్మించే ప్రయత్నం ఎప్పుడూ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో సత్యమేమిటో నిరూపించాలంటే అబద్దాన్ని ఆశ్రయించిన తప్పులేదు. 
 
ఇలా అబద్దం-నిజం అనే చట్రంలో ఆద్యంతం అనేక చిక్కుముడులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టూ అండ్ ఫ్రో కథనం టెక్నిక్ కథాగమనంలోని ఉత్కంఠను మరింతగా పెంచింది. సాధారణంగా మర్డర్ మిస్టరీ చిత్రాలు హత్య ఎవరు చేశారనే శోధనలో సాగుతాయి. కానీ అందుకు భిన్నంగా ఈ కథలో హత్య చేసిన వారెవరో తొలి సన్నివేశంలో రివీల్ చేశారు. అందుకు దారితీసిన పరిస్థితులేమిటి? అశోక్ హత్య, వినయ్ వర్మ మిస్సింగ్ కేసు, విక్రమ్ పరిశోధన నేపథ్యం...ఈ ముగ్గురి మధ్య పొరలుపొరలుగా అల్లుకుపోయిన సంఘటనలు గ్రిప్పింగ్‌గా సాగుతాయి. 
 
ముఖ్యంగా, సమీర, పోలీస్ ఆఫీసర్ మధ్య సాగే సంభాషణలు, నాటకీయత ఓ మైండ్ గేమ్‌గా ఆసక్తిని పంచుతుంది. సమీర నుంచి నిజాల్ని రాబట్టడానికి విక్రమ్ వేసే ఎత్తుగడలు..ఈ క్రమంలో కథలో చోటుచేసుకునే మలుపులు థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. సమీర, విక్రమ్ మధ్య అర్థగంటకుపైగా డ్రామా నడిచినా ప్రేక్షకులు ఎక్కడా బోర్‌గా ఫీలవరంటే వారిమధ్య ఎపిసోడ్‌ను ఎంత పకడ్బందీగా రూపకల్పన చేశారో అర్థం చేసుకోవచ్చు. 
 
కథలో చివరగా ఒక్కో ట్విస్ట్ విడిపోతూ క్లైమాక్స్ ఘట్టాల్లో అనూహ్య మలుపుతీసుకుంటుంది. సమీర్..అశోక్‌ల మధ్య సంబంధం.. వారి భావోద్వేగ ప్రయాణం ద్వితీయార్థంలో ఆసక్తిని పంచుతుంది. మిస్టరీతో పాటు అదే మోతాదులో భావోద్వేగాల్ని పండించడంతో ఓ ఎమోషనల్ డ్రామాగా కథాగమనం నడుస్తుంది. కథను ఎక్కువ భాగం హిల్ స్టేషన్ నేపథ్యంలో నడిపించడంతో మర్డర్ మిస్టరీలో కూడా ఓ నిగూఢమైన గాంభీర్యత చోటుచేసుకుంటున్నట్లు అనిపిస్తుంది. అయితే కథలోని మలుపుల్ని పట్టుకోవడం ఒక్కోసారి ప్రేక్షకులు అయోమయానికి గురవుతారు. ఓ తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు చివరకు ఎలా విషాదానికి దారితీస్తాయి? మనుషుల్ని ఎంతలా దిగజారేలా చేస్తాయనే ఫిలాసఫీని అంతర్లీనంగా ఆవిష్కరించడం సందేశాత్మకంగా అనిపిస్తుంది.
 
ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా అడివి శేష్ అద్భుతంగా నటించాడు. మంచి ఇంటెలిజెన్స్ అధికారిగా ఆకట్టుకున్నాడు. సినిమా ఆద్యంతం సెటిల్డ్ నటనతో ఆకట్టుకుంటారాయన. పతాక ఘట్టాల్లో ఆయన నటన మరింత గొప్పగా అనిపించింది. ఇక రెజీనా పాత్ర సినిమాకు ఆయువుపట్టుగా చెప్పాలి. నిత్యం అపరాధభావంతో సతమతమయ్యే యువతిగా చక్కటి భావోద్వేగాల్ని పండించింది. కథ మొత్తాన్ని ఆమె చుట్టే సాగుతోంది. 
 
నవీన్ చంద్రకు మంచి పాత్ర దక్కింది. ఎమోషనల్ కంట్రోల్ లేని పోలీస్ ఆఫీసర్‌గా ఆయన నటన బాగుంది. మురళీశర్మ, పవిత్రాలోకేష్ తమ పాత్రలకు న్యాయం చేశారు. కొత్త నటుడు ఆదర్శ్ వర్మ ఆకట్టుకున్నాడు. ఎక్కడా బిగి సడలకుండా థ్రిల్లింగ్ అంశాలు, భావోద్వేగాల కలబోతగా దర్శకుడు రాంజీ కథను అద్బుతంగా నడిపించాడు. అబ్బూరి రవి సంభాషణలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాల్లోని మూడ్‌ను బాగా ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా అనిపిస్తాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రష్మిక మందన్నాకు తేరుకోలేని షాకిచ్చిన కియారా అద్వానీ