నటీనటులు : తమన్నా భాటియా, హెబా పటేల్, వశిష్ట ఎన్. సింహ
సాంకేతికత: సినిమాటోగ్రాఫర్ : సౌందరరాజన్, సంగీత దర్శకుడు : బి. అజనీష్ లోక్‌నాథ్, నిర్మాత : డి. మధు, దర్శకుడు : అశోక్ తేజ, కథ, కథనం, పర్యవేక్షణ : సంపత్ నంది.
సంపత్ నంది దర్శకత్వంలో 2022 OTT లో విడుదలయిన ఓదేల రైల్వేస్టేషన్ కు సీక్వెల్ గా ఓదెల 2 నేడు విడుదలైంది. అశోక్ తేజ దర్శకత్వంలో సంపత్ నంది రచన, పర్యవేక్షణలో తీశారు. నాగసాధుగా తమన్నా భాటియా నటించిన సూపర్ నాచురల్ థ్రిల్లర్ ఓదేల 2. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
కథ:
స్కూల్ చదివే పిల్ల ఓ వ్యక్తి తలను నరికి పోలీస్ స్టేషన్ కు వస్తుంది. కట్ చేస్తే, ఆరునెలల వెనక్కి వెళితే, ఓదెల గ్రామంలో పెళ్లైన ఆడపిల్లను శోభనం రాత్రే కిడ్నాప్ చేసి వారిని అనుభవించి చంపేస్తూ ఉంటాడు తిరుపతి (వశిష్ఠ ఎన్ సింహా). అతని భార్య రాధ (హెబ్బా పటేల్) భర్త గురించి తెలుసుకుని కసితో అతని తల నరికి చంపేస్తోంది. దీంతో ఆమె జైలుకు వెళుతుంది. ఇక ఊరిలో తిరుపతి పీడ వదిలిందని గ్రామస్తులను చిత్రహింసలకు గురిచేసిన తిరుపతి చావు తర్వాత ఆత్మ క్షోభ పడాలని ఆ ఊరి వాళ్లు తగలపెట్టకుండా సమాధి శిక్ష పేరుతో కూర్చోపెట్టి పూడ్చిపెడతారు. ఆ తర్వాత ఆత్మ క్షోభపడుతూనే ఊరిని నాశనం చేస్తానని శపిస్తుంది. వాడి ఆత్మ బయటకు రావాలంటే ఏదో ఒకటి జరగాలి. అలా కొన్ని సంఘటనలు జరిగి తన సమాధిదగ్గరకు వచ్చిన వారిలో ప్రవేశించి ఊరిని వళ్లకాడుగా మార్చేలా భయపెడుతుంది.
తిరుపతి ఆత్మకు శాంతిచేకూరాలంటే జైలులో వున్న భార్య ఒక్కటే పరిష్కారమని ఊరి ఎం.పి.టి.సి, కొంతమంది పెద్దలు వెళ్లి వేడుకుంటారు. అలా చేయడం తన అక్కవల్లే అవుతుందని కాశీలో వుండే నాగసాధు (తమన్నా) వల్లే అవుతుందని చెప్పడం, ఆ తర్వాత కొన్ని సంఘటనలతో నాగ సాధు ఊరిలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఏమి జరిగింది? తిరుపతి ఆత్మను దగ్భందించి ఆ ఊరును కాపాడిందా లేదా అనేదే మిగిలిన కథ.
సమీక్ష:
కథలోని పాయింట్ బాగున్నా దాన్ని సరియైనవిధంగా ఆవిష్కరించడంలో దర్శకుడు తడబడ్డాడు. 2025లో వున్నా ఇంకా ఆత్మలు, క్షోభలు అంటూ ఈ మూఢనమ్మకాలు ఏమిటని పోలీసు ఆఫీసర్ ఊరివారితో సీరియస్ గా చెప్పి మీ నమ్మకంనిజంకాదని నిరూపిస్తానని సమాధి దగ్గరే రాత్రిపూట ఒక్కడే వుండి ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది సిల్లీగా వుంటుంది. అంత పెద్ద అధికారి చనిపోతే ప్రభుత్వపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం చిత్రమే. ఎక్కువగా శోభనం అయిన రోజునే పెళ్లికూతురిని అనుభవించి చంపేయడం వంటి సీన్లుపై దర్శకుడు ఎక్కువ కేర్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఆ క్రమంలో హింసకూడా అంతేలా వుంటుంది.
ఇక శివుడికే జీవితాన్ని అంకితం ఇచ్చి పంచాక్షరిని శతకోటిసార్లు జపించిన నాగసాదుకు ఎంత పవర్ వుంటుందో ఊహించలేం. కానీ ప్రమదగళాల శక్తిముందు శివుని శక్తికూడా నిర్వీర్యం అయ్యేలా కథనం వుండడం చాలామందికి మింగుడుపడదు. తిరుపతి పాత్రలో అరుంధతి ఛాయలు కనిపిస్తాయి. కానీ అందులో అనుష్క సామాన్యురాలు. అవసరమైతే శక్తి పుంజుకుని సీరియస్ గా బాగా నటించింది. ఇక్క అలా చేయడంలో బరువైన పాత్రను తమన్నా పోషించలేకపోయిందనే చెప్పాలి. మరో విశేషయం ఏమంటే, కానీ ఇక్కడ శివశక్తి అధికంగా వున్న తమన్నానే మారుతీ అనుభవించాలనుకోవడం, ఆమె అందుకు అంగీకరించడం వంటివి ఒక్కసారిగా కథను కిందకి నెట్టేసేలా వున్నాయి. ఇక క్లయిమాక్స్ లో నాగసాధు పాత్రను చూపించిన తీరు మరీ క్రుతంగా వుంటుంది. ఇలా చెప్పుకుపోతే చాలానే లోపాలున్నాయి.
దైవశక్తిముందు క్షుద్రశక్తి నిలబడదు. కానీ దర్శకుడు ఆ పాయింట్ ను కరెక్ట్ గా చూపించలేక మారుతీచేత క్షుద్రశక్తులు ఎక్కువ వచ్చేలా చేసే సన్నివేశాలు చూపించి ఊరిని దిగ్బంధనం చేయడం అనేదికూడా ప్రేక్షకుడికి కనెక్ట్ కాదు. మొత్తంగా భయపెట్టి ప్రేక్షకులను థ్రిల్ కలిగించేలా చేయాలనుకున్నారు. కానీ మొదటి నుంచి ఎక్కడా సినిమాలో ఫీల్ పెద్దగా అనిపించదు. మారుతీకి, నాగసాధుకు మధ్య జరిగే సంవాదం ఎక్కువగా అనిపిస్తుంది. మొత్తంగా మారుతీ పాత్రకు కపాల మోక్షంతో ఆత్మ శాంతించేలా చూపించినా, మరలా అది బయటకు రావడం చూపించి దైవశక్తికంటే క్షుద్రశక్తి పవర్ ఫుల్ అనేలా చెప్పే ప్రయత్నంచేసి మూడో పార్ట్ గా ట్విస్ట్ ఇచ్చాడు.
ఇక నటీనటుల పరవంగా.. వసిష్ట తిరుపతి పాత్రలో అతని ఆహార్యం, గాత్రం ఫర్ ఫెక్ట్ గా కుదిరాయి. నాగసాధుగా పవర్ ఫుల్ పాత్రను ఆమెపోషించింది. కానీ ఆమెను డిజైన్ చేసే విధానంలో కొన్నిచోట్ల పేలవంగా వుంటాయి. క్రోధంవస్తే కాళికాదేవిలా మారాలి. అలా చేయడంలో కొంచెం లోపం కనిపించింది. ఆమె పాత్ర యొక్క భావోద్వేగాలు, భక్తి పొరలు తక్కువగా చూపించినట్లు అనిపిస్తాయి. మిగిలినదంతా ఆమె బాగానే పండించింది. ఇక మిగిలిన పాత్రలు ఎవరిపరిధి వారు చేశారు. హెబ్బా పటేల్ పాత్ర పరిమితమే అయినా ఓకే అనిపిస్తుంది.
ఈ సినిమా కథాంశం అంచనా వేయడంలో చాలా ఇబ్బందికరంగా ఉంది. తెలుగు సినిమాలో మంచి వర్సెస్ చెడు అనే ఆలోచన కాలపరీక్షకు గురైనప్పటికీ, ఇక్కడ అమలులో భావోద్వేగ లోతు, కొత్తదనం రెండూ లేవు. స్క్రీన్‌ప్లే నిజమైన ఉత్కంఠను కలిగించడంలో విఫలమైంది. అందుకే సినిమాలో ఏదో మిస్ అయిన ఫీల్ చూసినవారికి కలుగుతుంది. ఈ సినిమాలో అష్టాదశ పురాణాల్లో శివ పురాణం సహా ఇతర పురాణాల గురించి ఉన్నాయి. ఎక్కడా శవ పురాణం గురించి లేదు. ఎక్కడా లేని కొత్త కాన్సెప్ట్ ను ఎలా తీసుకువచ్చాడో దర్శకుడికే తెలియాలి. క్రియేటివిటి ఫ్రీడమ్ అనుకోని ఒదిలేయాలేమో. మరోవైపు సమాధి శిక్ష అంటూ కొత్త కాన్సెప్ట్ ను తీసుకొచ్చాడు. ఊరి వాళ్లను క్షోభ పెట్టిన వాడిని నిలువునా పాతి పెట్టి ఆ శవంపై కోడి నెత్తురుతో అభిషేకం చేసి నువ్వులతో పాటు ఆ ఊరి వాళ్ల పాదదూళితో పాటు ఓ బట్టలో చుట్టి అతన్ని సమాధి శిక్ష విధించడం అనేది సినిమాటిక్ గా అనిపిస్తుంది.
సాంకేతికంగా చూస్తే, రచయిత సంపత్ నంది స్క్రిప్ట్ బాగుంది, కానీ దర్శకుడు అశోక్ తేజ దానిని ఇంకా బాగా రూపొందించి వుండాల్సింది. ఎక్కువ భాగం వి.ఎఫ్.ఎక్స్., సీజి వర్క్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అది కూడా సినిమా కథకు అంత వరసరంలేదనిపిస్తుంది. జనీష్ లోక్‌నాథ్ సంగీతంలో కొంత నేపథ్య వాతావరణాన్ని కలిగిస్తుంది. కానీ కీలకమైన క్షణాల్లో అంతగా ప్రభావం చూపదు. సౌందరరాజన్ సినిమాటోగ్రఫీ క్రియాత్మకంగా ఉంది, అవినాష్ ఎడిటింగ్ ఇంకాస్త గట్టిగా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు తగినంతగా ఉన్నప్పటికీ అవి ప్రత్యేకంగా నిలబడవు.
సూపర్ నేచురల్ థ్రిల్లర్, కానీ ఊహించదగిన కథాంశం మే అయినా,ఓడెలా రైల్వే స్టేషన్ కంటే ఇది స్వల్ప మెరుగుదల అయినప్పటికీ, ఇది చిరస్మరణీయమైన సినిమాటిక్ అనుభవాన్ని ఇచ్చేలాచేయాలంటే మరింత బాగా తీస్తే మరో లెవల్లో వుండేది.