Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బింబిసార రివ్యూ రిపోర్ట్ : భల్లాలదేవుడు బాహుబలైతే.. ఎలా వుంటుంది.?

bimbisara-Kalyan ram
, శుక్రవారం, 5 ఆగస్టు 2022 (19:50 IST)
భల్లాలదేవుడు బాహుబలైతే ఎలా వుంటుందో.. బింబిసార కూడా అలాగే వుంటుంది. 
 
టైటిల్: బింబిసార
తారాగణం: నందమూరి కళ్యాణ్‌ రామ్‌, కేథ‌రిన్ థ్రెసా, సంయుక్త మీనన్, వారిన హుస్సేన్, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, బ్రహ్మాజి, ప్రకాశ్ రాజ్, అయ్యప్ప శర్మ తదితరులు
సంగీతం (బ్యాక్ గ్రౌండ్): ఎం.ఎం. కీరవాణి
సంగీతం (పాటలు): చిరంతన్ భట్, వరికుప్పల యాదగిరి, కీరవాణి
విడుదల తేదీ: 5 ఆగస్టు 2022
నిర్మాత: ఎన్.టి.ఆర్ ఆర్ట్స్
దర్శకత్వం: మల్లిడి వశిష్ట్
కెమెరా: చోటా కె నాయుడు
ఎడిటింగ్: తమ్మి రాజు
 
బింబిసారుడనగానే క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం నాటి మగథసామ్రాజ్యాధినేత గుర్తొస్తాడు. హిందీలో వైజయంతిమాల నటించిన "ఆమ్రపాలి"లో సునీల్ దత్ పోషించింది అజాతశత్రు పాత్ర. ఆ అజాతశత్రు తండ్రే బింబిసారుడు. అది చరిత్ర.
 
టైటిల్ చూసి ఇది ఆ చారిత్రాత్మక చిత్రమేమో అనుకుంటే పప్పులో కాలిసినట్లే. దానికి, ఈ సినిమాకి ఏ సంబంధమూ లేదు. సౌండింగ్ బాగుందనో, హిస్టారికల్ పేరైతే క్యాచీగా ఉంటుందనో ఈ టైటిల్ పెట్టారు తప్ప ఇంకేం కాదు.  
 
ట్రైలర్ చూస్తే మగధీరని, బాహుబలిని చూసి అనుకరించినట్టుందని చాలామందికి అనిపించింది. అయినా కూడా కళ్యాణ్ రామ్‌ కష్టానికి తగిన ప్రతిఫలం రావాలని కోరుకున్న వారూ లేకపోలేదు.
 
క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో అత్యంత క్రూరుడైన త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడు. ఆక్రమణలతో రాజ్యాన్ని విస్తరించుకోవడం, ఎదురు తిరిగిన వాళ్లని హింసించడం, నచ్చకపోతే చిన్నకారణాలకే అమాయకుల్ని చంపేయడం అతని నైజం. మద్యం మరియు మగువలతో కాలం గడపడం అతని దినచర్య.
 
ఇదిలా ఉంటే మాయాదర్పణం అనే ఒక నిలువుటద్దం కథలోకొస్తుంది. దానికి కాలాలను కలిపే శక్తుంటుంది. ఆ సంగతి బింబిసారుడికి తెలియదు.
 
ఒక సందర్భంలో నరరూపరాక్షసుడు లాంటి ఈ బింబిసారుడు దైవాన్ని కూడా ధిక్కరిస్తాడు. తనని లొంగదీయగలిగే శక్తి సృష్టిలోనే లేదంటాడు. ఒక చిన్న పిల్లని మదమెక్కి చంపేస్తాడు.
 
ఆ తర్వాత ఒకడు ఆ బింబిసారుడిని ఒక్క తన్ను తంతే ఆ మాయాదర్పణంలో పడి మన కాలాంలోకొచ్చి పడతాడు. అక్కడి నుంచి ఈ కొత్త కాలంలో అతను పడే కష్టాలు, అతనిలో చోటు చేసుకున్న మార్పు మిగిలిన కథ.
 
ఈ కథలో పాయింట్ కొత్తగా అనిపిస్తుంది కానీ, అ పాయింటుకి, కథనానికి అన్నింటికీ రకరకాల సినిమాల నుంచి స్ఫూర్తి ఉంది. రాజులకాలం, ప్రస్తుతకాలం మధ్యన కథనగానే "మగధీర" గుర్తొస్తుంది. అందులో రావురమేష్ పాత్రలాగ ఇందులో అయ్యప్పశర్మ పాత్రుంది. అక్కడ విలన్ లాగానే ఇక్కడా ప్రస్తుత కాలంలో విలనుంటాడు. అయితే మగధీర పునర్జన్మల కాన్సెప్ట్. ఇది అలా కాదు.
webdunia
Bimbisara song
 
ఉన్నపళంగా ఒకానొక కాలానికి చెందిన వ్యక్తి వేరే కాలంలోకి వెళ్లడమనే కాన్సెప్ట్. బాహుబలి స్ఫూర్తి అడుగడుగునా కనిపిస్తుంది ఇందులో. చాలా ఘట్టాలు బాహుబలిని గుర్తుచేస్తాయి. అయితే భళ్లాలదేవుడి పాత్రలాగ మొదలయ్యి చివరికి అమరేంద్ర బాహుబలిగా ముగుస్తుంది కళ్యాణ్ రామ్‌ క్యారెక్టర్. ఆచార్య, సీన్సు కూడా ఇందులో అక్కడక్కడా చూడొచ్చు.  
 
అలాగే "యమగోల", "యమలీల" సినిమాల్లో యముడు, చిత్రగుప్తుడు భూలోకానికి వచ్చినట్టు ఇందులో కూడా అలాంటి సీన్స్ రిపీటైనట్టు అనిపించాయి.
  
రొటీన్ రొట్టకొట్టుడు కాకుండా కొత్తగా ఆలోచించి మల్టిపుల్ జానర్ సినిమా తీయాలనుకున్న ఐడియాని మెచ్చుకోవాలి. కానీ సన్నివేశాల రూపకల్పనలోనూ, డైలాగ్స్ విషయంలోనూ ఇంకా ఫోకస్ పెట్టుంటే గొప్ప సినిమా అయ్యుండేది.
 
కళ్యాణ్ రామ్‌ కష్టాన్ని మెచ్చుకోవచ్చు. ద్విపాత్రాభినయంలో చక్కని వైవిధ్యం కూడా చూపించాడు. క్యాథరీన్ మాత్రం లావుగా ఉన్నా ఆ పాత్ర వరకు సరిపోయింది. అయ్యప్ప శర్మ ఓకే. మిగిలిన వాళ్లంతా తమతమ పాత్రల్లో మమ అనిపించారు. 
webdunia
Bimbisara
 
ఎలా చూసుకున్నా పలు సన్నివేశాల్లో ఒరిజినాలిటీ లోపించడమే ప్రధానమైన మైనస్. అద్భుతం కాదు.. అలాగని విసిగించదు. సోషియో ఫ్యాంటసీ సినిమాలు నచ్చే వాళ్లకు ఈ వీకెండ్ బింబిసార మంచి ట్రీటేనని చెప్పాలి.
 
రేటింగ్: 2.5/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శంకర్ అతిధిగా శివకార్తికేయన్ హీరోగా మహావీరుడు ప్రారంభం