Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాస్తవాన్ని ఆవిష్కరించిన 'బిలాల్‌ పూర్‌ పోలీస్‌ స్టేషన్‌'

వాస్తవాన్ని ఆవిష్కరించిన 'బిలాల్‌ పూర్‌ పోలీస్‌ స్టేషన్‌'
, గురువారం, 14 మార్చి 2019 (19:31 IST)
బిలాల్‌ పూర్‌ పోలీస్‌ స్టేషన్ నటీనటులు - మాగంటి శ్రీనాథ్‌, శాన్వీ మేఘన, గోరటి వెంకన్న, ప్రణవి, ఆర్‌ ఎస్‌ నందా, వెంకట్‌ గోవాడ, మల్లేష్‌, వైభవ్‌ తదితరులు, సాంకేతిక వర్గం - సినిమాటోగ్రఫీ - తోట వి రమణ, ఎడిటింగ్‌ - ఎస్‌ బీ ఉద్ధవ్‌, సంగీతం - సాబూ వర్గీస్‌, రీ రికార్డింగ్‌ - జీబూ, డీటీఎస్‌ - రాజశేఖర్‌, పాటలు - గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్‌ తేజ, రామాంజనేయులు, మౌనశ్రీ మల్లిక్‌, నీల నర్సింహా, కథా, నిర్మాత - మహంకాళి శ్రీనివాస్‌, రచన, దర్శకత్వం - నాగసాయి మాకం.  
 
ఇప్పుడు గ్రామాల నేపధ్యంలో కథల్ని ఎంచుకోవడం ట్రెండ్‌ అయింది. కేరాఫ్‌ కంచెరపాలెం, రంగస్థలం.. ఇలా పలు చిత్రాలు అక్కడ జరిగిన వాస్తవికతను కళ్ళకు కట్టినట్టు చూపెట్టాయి. అలాంటి ప్రయత్నమే 'బిలాల్‌‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌' చిత్రం గురించి దర్శక నిర్మాతలు కృషి చేశారు. గ్రామాల్లో వుండే వాస్తవికతను కళ్ళకు కట్టినట్లు చూపించడమే కాకుండా పోలీసు బాధ్యతను తెలియజెప్పే ప్రయత్నం చేశారు. శుక్రవారం విడుదలకానున్న ఈ చిత్రాన్ని గురువారంనాడు ప్రముఖులకు ప్రదర్శించారు. అదెలావుందో చూద్దాం.
 
కథ:
బిలాల్‌ పూర్‌ అనే ఊరికి కొత్తగా పోలీసు అధికారి సూర్య (మాగంటి శ్రీనాథ్‌) వస్తాడు. అక్కడ స్థానికంగా జరిగే గొడవలు చికాకు కలిగిస్తుంటాయి. కోడి పోయిందని, విందులో మాంసం వడ్డించలేదని, దూడ పొడిచిందనే కేసులు స్టేషన్‌కు వస్తుంటాయి. అలాంటి స్థితిలో ఊరి బ్యాంక్‌ దగ్గర దోపిడీ, ఊరిలో ఓ యువతి మిస్సింగ్‌, పెట్రోల్‌ బంకులో పనిచేసే వ్యక్తి హత్య.. సంఘటనలు సూర్యకు పజిల్‌లా అనిపిస్తాయి. ఒకదానికొకటి లింకు వుందనే కోణంలో దర్యాప్తు చేస్తాడు. మరోవైపు, స్టేషన్‌లోనే పనిచేసే హెడ్‌కానిస్టేబుల్‌ (గోరటి వెంకన్న) కూతురు శ్రీలత (శాన్వీ మేఘన)ని సూర్య ప్రేమిస్తాడు. అతడి ప్రేమ ఫలించిందా! లేదా! అనేది కూడా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
విశ్లేషణ:
నటీనటుల పరంగా, సాంకేతికపరంగా నూతనత్వం ఈ చిత్రంలో కన్పించింది. కథ ప్లాట్‌గా చూస్తే తమిళ చిత్రాల్లో వుండే నాచురాలిటీ కన్పించింది. తెలుగులోనూ ఇలాంటి ప్రయోగం చేయవచ్చని దర్శకనిర్మాతలు నిరూపించిన చిత్రమిది. ఇది గ్రామీణ ప్రజా జీవనానికి అద్దంపట్టే సినిమా. అక్కడి సమస్యలు, మనుషుల ప్రవర్తన ఎలా వుంటుందనేది గ్రామ ప్రజలద్వారా చూపించారు. పోలీసు స్టేషన్‌లో ఎటువంటి కేసులు వస్తాయనేవి ఆసక్తికరంగా అనిపించింది. కథలకోసం ఎక్కడికో వెళ్ళకుండా బిలాల్‌పూర్‌ అనే గ్రామంలోనే షూటింగ్‌ చేసి అక్కడ పరిస్థితుల్ని బాగా చూపించాడు దర్శకుడు. యువత చిన్న విషయానికి పెడదోవపట్టి దొంగతనాలు, హత్యలు ఎలా చేస్తారనే విషయంలో చాలా క్లారిటీ చూపించాడు. తెలంగాణ నేపథ్యంలో సాగిన మరో మంచి చిత్రమిది.
 
నటీనటుల పరంగా పోలీసు అధికారి సూర్యగా మాగంటి శ్రీనాథ్‌ పాత్రోచితంగా నటించారు. చిత్రానికి మూల స్తంభంలా హెడ్‌‌కానిస్టేబుల్‌ సురేందర్‌ పాత్రలో గాయకుడు గోరటి వెంకన్న నిలిచాడు. ఆయన పాత్ర ఆకట్టుకుంటుంది. మన ఊరిలో చూసే పోలీసు బాబాయ్‌‌లా సహజంగా నటించారు వెంకన్న. యూట్యూబ్‌లో ఫేమస్‌ అయిన ఆర్‌ఎస్‌ నందా ఉన్న సన్నివేశాలన్నీ నవ్వులు పూయించాయి. వినోద సన్నివేశాల్లో వెంకన్న నటన ఎంతగా నవ్విస్తుందో... పోలీసు వృత్తిలో బాధలను వివరించే క్రమంలో అంత భావోద్వేగాలతో సాగుతుంది. శాన్వీ మేఘన అందంలోనే కాదు అభినయంతోనూ ఆకట్టుకుంది.  
 
ఇక టెక్నికల్‌ పరంగా దర్శకుడు నాగసాయి మాకం తను చెప్పాల్సిన పాయింట్‌ను సుత్తిలేకుండా నేరుగా చెప్పేశాడు. మన చుట్టూ జరుగుతున్న కథలాగే వుంటుంది. తోట వి రమణ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ఆకర్షణగా నిలిచింది. డైలాగ్స్‌ పరంగా పోలీసు అంటే రెస్ట్‌లేని వాడంటూ సన్నివేశపరంగా సాగే సంభాషణలు, సుద్దాల అశోక్‌ తేజ రాసిన 'నిద్దుర లేని కళ్లకు అడ్రస్‌, అలసట లేని కాళ్లకు సిలబస్‌ అనే పాట' ఆయన సాహిత్య స్థాయిని చూపించింది. నిర్మాత మహంకాళీ శ్రీనివాస్‌‌కు తొలి చిత్రమైనా మంచి సినిమా చేయాలనుకునే తన అభిరుచి చూపించారు.
 
రేటింగ్‌: 3/5
- పెండ్యాల మురళీకృష్ణ

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వను.. దయచేసి ఓటు వేయండి: అమీర్ ఖాన్