Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బిగ్‌బాస్‌ శ్రీహాన్‌ సినిమా మా ఆవారా జిందగీ చిత్రం ఎలా వుందంటే! రివ్యూ

maa awara zindagi poster
, శుక్రవారం, 23 జూన్ 2023 (17:55 IST)
maa awara zindagi poster
బిగ్‌ బాస్‌ నుంచి వచ్చిన వారు హీరోలుగా మారుతున్నారు. సోహైల్‌ ఆమధ్య హీరోగా చేశాడు. ఈసారి శ్రీహాన్‌ నటించిన చిత్రం మా ఆవారా జిందగీ. ఆయనతోపాటు జబర్‌దస్త్‌ లో కొన్ని ప్రోగ్రామ్‌లు నటించిన ముక్కు అజయ్‌, ఢీ చెర్రీ, జస్వంత్‌ నటించారు. షాయాజీ షిండే పోలీసు ఆఫీసర్‌గా నటించిన ఈ చిత్రం ఈరోజే థియేటర్‌లో విడుదలైంది. తెలంగాణా యాసతో కూడిన ఈ సినిమాను దర్శకత్వకశాఖలో పనిచేసిన శ్రీకాంత్‌ రెడ్డి దర్శకత్వం వహించగా, నంద్యాల మధుసూదన్ రెడ్డి నిర్మించారు. మరి ఈ చిత్రం ఎలావుందో చూద్దాం.
 
కథ:
బిటెక్‌ చాలా కష్టపడి చదివినా ఉద్యోగం దొరక్క ఆవారాగా తిరుగుతూ తాగుతూ బిందాస్‌గా జీవితాన్ని గడిపే నలుగురు కుర్రాళ్ళు శ్రీహాన్‌, అజయ్‌, చెర్రీ, జస్వంత్‌. నలుగురికీ అన్నింటిలో తొందరెక్కువే. అందుకే అమ్మాయిలను టీజ్‌ కేసులో పోలీసుస్టేషన్‌కు వెళ్ళి వస్తారు. ఓసారి అజయ్‌కు పగలు నిద్రాభంగం కలిగించిన ఒక ఫకీర్‌ను తిట్టి అవమానిస్తాడు. దాంతో అతను అజయ్‌ను శపించి అతనికి మగతనంలేకుండా చేస్తాడు. ఆ తర్వాత తన తప్పును తెలుసుకుని ఫకీర్‌ను వెతుక్కుంటూ వెళ్ళి క్షమించమని వేడుకుని మామూలు మనిషి అవుతాడు. ఇక ఆ తర్వాత ఆ నలుగురికి స్నేహితుడైన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి పెండ్లికి వెళతాడు. అక్కడ వారికి ఫేక్‌ కిడ్నాప్‌ కథను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి చెప్పడంతో అది నిజం అనుకోని తగిన మత్తులో ఓ ఇంటికి వెళ్ళి రాద్దాంతం చేస్తారు. చివరికి తాము బలయ్యామని బావించి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని బంధించి అతని కారు, అతని క్రెడిట్‌ కార్డ్‌ తీసుకుని ఎంజాయ్‌ చేయడానికి నలుగురు బయలుదేరతారు. అలా ఎంజాయ్‌ చేసే క్రమంలో అనుకోకుండా ఓ గ్యాంగ్‌ కిడ్నాప్‌ కేసులో ఇరుక్కుంటారు. అక్కడ వారికి ఓ షాకింగ్‌ న్యూస్‌ తెలుస్తుంది. దాన్ని ఎలా ఛేదించారు అనేది మిగిలిన కథ.
 
విశ్లేషణ:
తెలంగాణ బేస్డ్‌ సినిమాలంటే దావత్‌ అనేది కామన్‌గా మారిపోయింది. నాని నటించిన దసరా నుంచి దాదాపు అన్నీ అలాంటివే. అది ఒక పక్క రన్‌ అవుతూనే ఏదో ఒక ఆసక్తికర పాయింట్‌ కనిపిస్తుంది. తెలంగాణ యాసతోపాటు యూత్‌ చేసే విన్యాసాలు ఎంటర్‌టైన్‌ చేస్తాయి. ఇందులో అటువంటివి చాలానే వున్నాయి. యూత్‌ అనగానే తెలీని తొందరపాటు తనంతో ఆకర్షణకు లోనై అమ్మాయిలతో ఎంజాయ్‌ చేయాలనే కోరిక సహజంగా వుంటుంది. ఇందులో ఆ పాయింట్‌ చుట్టూనే కథ తిరుగుతుంది. ముఖ్యంగా కోటి, ఓల్డ్‌సిటీ ఆ పరిసర ప్రాంతాల్లో హిజ్రాలనుంచి యూత్‌ ఎదుర్కొనే సన్నివేశాలు ఇందులో దర్శకుడు చూపించాడు. వాటిని ఎంటర్‌టైన్‌ చేస్తూ జాగ్రత్త అనే కన్‌క్యూజ్‌ ఇస్తూ కథనం నడిపాడు. బోల్డ్‌ కంటెంట్‌తోపాటు యూత్‌ను నవ్వించే ప్రయత్నం చేశాడు.
 
ఇందులో నలుగురూ బాగానే నవ్వించే ప్రయత్నం చేశారు. అందరూ తమపరిధిమేరకు నటించారు. ప్రత్యేకంగా షియాజీ షిండే పోలీసు అధికారిగా అలరించాడు. కెమెరాతోపాటు ప్రతీక్‌ నాగ్‌  నేపథ్య సంగీతం కూడా బాగుంది. ఎక్కడా డ్యూయెట్లు అనేవి లేకుండా కేవలం యూత్‌ సినిమాకు ఏమి కావాలో ఆ అంశాలతో కాస్త బోల్డ్‌గా ధైర్యంగా దర్శకుడు శ్రీకాంత్‌ రెడ్డి చూపించాడు.
 
ఎంత బాగా ఎంటర్‌టైన్‌ చేసినా యూత్‌ అంటేనే ఇలా వుంటారనే రొటీన్‌ ఫార్మెట్‌ చూపించారు. ఇంకాస్త వారి జీవితంలో ఎయిమ్‌ అనేది చూపించి దాన్నుంచి కథనం నడిపితే ఈ చిత్రం మరింతగా బాగుండేది. ఏదిఏమైనా తాను చెప్పాల్సిన పాయింట్‌ను చాలా బోల్డ్‌గా చెప్పినందుకు దర్శకుడిని అభినందించాలి. యూత్‌కు కనెక్ట్‌ అయ్యేవిధంగా సినిమా వుంటుంది. సన్నివేశపరంగా చిన్నపాటి లోపాలున్నా ఓటీటీకి మంచి కంటెంట్‌ మూవీ. థియేటర్‌లో ఒకసారి ఈ సినిమాను చూడొచ్చు.
రేటింగ్‌: 2.5/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెగాస్టార్ట్, పవన్ అభిమానులు అందరూ మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్ చిత్రాన్నిహిట్ చెయ్యాలి : సుమన్