నటీనటులు: నాని, నజ్రియా ఫహద్, నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ తదితరులు
సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి, సంగీతం: వివేక్ సాగర్, ఎడిటర్: రవితేజ గిరిజాల, నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ వై, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
శ్యామ్ సింగరాయ్ తర్వాత నాని నటించిన సినిమా `అంటే సుందరానికీ`. ట్రైలర్‌లోనే సుందరానికి ఏదో ఎఫెక్ట్ వుందనేలా ఆలోచన క్రియేట్ చేసిన దర్శకుడు ఇంతకుముందు మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా తీశాడు. ఇక మైత్రీమూవీస్ నుంచి పుష్ప, సర్కారువారిపాట తర్వాత వచ్చిన చిత్రమిది. ఈరోజే విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
కథః
సుందర్ ప్రసాద్ (నాని) మడి ఆచారాలు వున్న సత్ సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. తండ్రి సీనియర్ నరేశ్, తల్లి రోహిణి. ఓ బామ్మ. ఎనిమిది మంది బాబాయ్‌లున్న పెద్ద కుటుంబం. నరేష్ ఏకైకవారసుడు. చిన్నతనంలో స్కూల్లో వేసిన డ్రామావల్ల నటుడిగా అమెరికా వెళ్ళాల్సిన అవకాశం వచ్చినట్టు వచ్చి చేజారిపోతుంది. దాంతో ఏదో జాతకం దోషం వుందని సుందర్ తండ్రి జోగారావు అనే జ్యోతిష్కుడిని ఆశ్రయిస్తాడు.
రకరకాల హోమాలపేరుతో సుందర్‌ను విసిగించేస్తాడు. ఇప్పటి ట్రెండ్ కనుక సుందర్ అబద్దాలు ఆడి ఏదోరకంగా కొన్నింటిని తప్పించుకుంటాడు. సరిగ్గా ఆ టైంలోనే తను పనిచేసే సాప్ట్‌వేర్ కంపెనీ ద్వారా అమెరికా వెల్ళాల్సిన తోటి ఉద్యోగి అనుపమ పరమేశ్వర్ ప్లేస్‌లో తను అమెరికా వెళ్ళేలా బాస్ అయిన హర్షవర్ధన్‌ను, అనుపమను అబద్దాలతో ఒప్పించేస్తాడు.
ఇక లీలా నజ్రియా ఫహద్) కూడా తనకు పెద్దలు కుదిర్చిన సంబంధాన్ని దాటవేసేందుకు చిన్నప్పటి స్నేహితుడైన సుందర్‌తో చేతులు కలిపి అబద్దాలు ఆడి అమెరికా చదువుకోసం వెళుతున్నట్లు చెబుతుంది. క్రిస్టియన్, బ్రాహ్మణ కుటుంబాల మధ్య వివాహం పెద్దలు ఒప్పుకోరనేందుకు తాము అబద్దాలు ఆడామని సమర్థించుకుని అమెరికా చెక్కేస్తారు. కానీ అక్కడ నుంచి వెంటనే తిరిగివచ్చేలా పరిస్థితులు మారతాయి. ఆ తర్వాత ఇద్దరు ఇంటికి వచ్చాక వారు ఆడిన అబద్దాలు వారి జీవితంలో అల్లకల్లోలం ఎలా సృష్టించాయనేది మిగిలిన కథ.
విశ్లేషణః
భిన్నమైన ఇరు మతాల వారు ప్రేమించుకోవడం, పెద్దలు అంగీకరించకపోవడం ఆ తర్వాత కథ సుఖాంతం కావడం వంటి కథలు చాలానే వచ్చాయి. అయితే ఇరు కుటుంబాలలో వారు అంతకుముందు జరిగిన కొన్ని సంఘటనల వల్ల తమను పెండ్లికి అంగీకరించనని భయంతో ఇరువురు భయంకరమైన అబద్దాలు ఆడడం. అవి వారి పీకకు చుట్టుకోవడం అనేది దర్శకుడు చూపించాడు.
చిన్న పాయింట్ దాన్ని అటు తిప్పి ఇటుతిప్పి రివర్స్ స్క్రీన్‌ప్లేతో రెండుగంటలు పైగా కూర్చెపెట్టే ప్రయత్నం చేశాడు. కానీ మొదటి భాగం అంత ఎఫెక్ట్‌గా లేకపోవడంతో ఇంటర్‌వెల్ ఎప్పుడవుతుందా అని ప్రేక్షకుడు భావించడం విశేషం. ఇక సెకండాఫ్‌లో కథ చెప్పాలి కాబట్టి ఆ కేరెక్టర్లను మరోసారి అబద్దాన్ని నిజం చేసే క్రమంలో ఇరు కుటుంబాల వారి మధ్య సాగే సన్నివేశాలు ఎంటర్‌టైన్ చేస్తాయి. ఇలాంటి చిన్న చిన్న విషయాలతో వినోదంగా మలిచేందుకు దర్శకుడిలో పట్టు కనిపించింది. బ్రోచేవారెవరులా లో సరిగ్గా ఇటువంటిదో కనిపిస్తుంది.
- అయితే సుందర్, లీలా చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందు మరో తప్పు చేస్తూ ఎలా డీలా పడిపోతారో వాటిని ఎదుర్కొనే క్రమంలో సాంప్రదాయాలు, నమ్మకాలు, జ్యోతిష్యాన్ని కూడా ఓ దశలో తేలిగ్గా చూపించే ప్రయత్నం చేశాడు. అదే క్రమంలో మతం కంటే మానవత్వం గొప్పదనే పాయింట్‌ను ఇరు కుటుంబాలు కలిసినప్పుడు జరిగిన ఓ ఘటనతో ఎలివేట్ చేశాడు. కానీ చిన్న సమస్యను అటుతిప్పి ఇటు తిప్పి చెప్పే క్రమంలో నిడివి ఎక్కువ కావడంతో మూడుగంటల భారీ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అయినా చక్కటి పాటలుంటే బాగుండేది. అవి లేవు. వివేక్ సాగర్ సంగీతం పర్వాలేదు అనిపిస్తుంది. నికిత్ బొమ్మి సినిమాటోగ్రఫీ ఓకే.
నటీనటులపరంగా.. అందరూ బాగానే నటించారు. నాని జీవిస్తే నజియా బిహేవ్ చేసిందనే చెప్పాలి. ఇక అనుపమ సోలో హీరోయిన్‌గా చేసే తరుణంలో సహాయ పాత్రగా చేయడం విశేషమేమరి. కేరాఫ్ కంచెరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా ఓ పాత్రలో కనిపిస్తాడు. ఇప్పటి జనరేషన్‌కు ప్రతినిధిలా అనిపించాడు.
ఇక సినిమాలో దర్శకుడు చెప్పాలనుకున్నవి ఏమంటే.. తనదాకా సమస్య వస్తే ఆలోచన వేరుగా వుంటుంది. పక్కవాడికి సమస్య వస్తే మరోలా వుంటుంది. దీన్ని ఇందులో రోహిణి పాత్ర ద్వారా వెల్లడించాడు. కులాలు మతాలు ప్రేమకు అడ్డుకాదనే పాయింట్‌ను చెప్పడానికి తిమ్మిని బమ్మిని చేస్తూ ఇలా చెప్పడం ఎందుకంటూ.. రచయిత నటుడు హర్షవర్ధన్ క్లయిమాక్స్‌లో నానిని అడుగుతాడు. కథంతా సుఖాంతం అయిందని తన బాస్‌కూ, అనుపమకు చెప్పే సీన్‌లో..
కంగ్రాట్స్..అంటూ అనుపమ అంటోంది.
ఏమయ్యా! అంతా హ్యాపీగా వుంటే ఆ మాట ముందు చెబితే టెన్షన్ కాకుండా వేరేలా వినేవాళ్లంకదా.. కిందికి పైకి పైకి కిందికి ఇలా నాచ్చుడు ఎందుకు? అంటాడు. నాని వెంటనే.. ముందు చెబితే స్ట్రగుల్‌కు వాల్యూ ఏముండదుసార్. .అంటాడు. నీ స్గ్రగుల్ నాకెందుకయ్యా.. అంటూ వెళ్ఙపోతాడు. ఆ కొద్దిసేపటికే శుభం కార్డు పడుతుంది. ఈ సినిమా యూత్ ఓకే అనిపించినా. ఫ్యామిలీ మెచ్చే సినిమా అని చెప్పొచ్చు.