Ankit Koyya, Neelakhi Patra
నటీనటులు : అంకిత్ కొయ్య, నీలఖి పాత్రా, విజయ నరేష్ కృష్ణ, వాసుకి ఆనంద్, ప్రసాద్ బెహరా తదితరులు
సాంకేతికత: సినిమాటోగ్రాఫర్ : శ్రీ సాయికుమార్ దారా, సంగీత దర్శకుడు : విజయ్ బుల్గానిన్, నిర్మాత : ఆడిదల విజయపాల్ రెడ్డి, దర్శకుడు : జె ఎస్ ఎస్ వర్ధన్. ఎడిటర్ : ఎస్ బి ఉద్ధవ్
కథ:
పెల్లయిన పదేళ్ళకు పుట్టిన అలేఖ్య (నిలఖి పాత్రా)ను గారాబంగా పెంచుతాడు క్యాబ్ డ్రైవర్ నారాయణ (నరేష్). భార్య (వాసుకి) కి కుమార్తెను కొన్ని విషయాల్లో మందలించినా నారాయణ పట్టించుకోడు. ఇక కాలేజీ చదివే అలేఖ్య.. కు స్నేహితురాలు స్కూటీ తీసుకురావడంతో తనకూ అలాంటిదే కావాలని తండ్రిని పీడిస్తుంది. ఎట్టకేలకు ఆమె ఫేస్ లో ఆనందం చూడ్డంకోసం తల్లిదండ్రులు అప్పుచేసి మరీ కొనిస్తారు. ఆ తర్వాత కాలేజీకి వెళుతూ బయట ఓ కుర్రాడు అర్జున్ (అంకిత్ కొయ్య)ను చేష్టలకు ఆకర్షితురాలవుతుంది.
ఆ తర్వాత అది ప్రేమగా మారుతుంది. ఇది తెలిసిన తల్లి కూతురుమీద చేయిచేసుకుని తీవ్రంగా మందలించి ఆమె ఫోన్ ను లాగేసుకుంటుంది. అమ్మ మీద కోపంతో ఎలాగో ఇంటినుంచి వెళ్ళిపోతుంది. అలా అర్జున్ తో లేచిపోయి హైదరాబాద్ చేరుకుంటుంది. విషయం తెలిసిన తండ్రి ఏమి చేశాడు? తల్లి ఎంత ఆవేదన చెందింది? తన కుమార్తెను తండ్రి కలుసుకున్నాడా? లేదా? అనేది మిగిలిన సినిమా.
సమీక్ష:
ఈ చిత్ర కథను బేరీజువేస్తే గతంలో వచ్చిన బుట్టబొమ్మ కథకు సరిపోతుంది. అంతకుముందు వచ్చిన ఉయ్యాలా జంపాలా వంటి చిత్రాల నూ గుర్తు చేస్తుంది. అయితే వాటిల్లో ఎంతో కొంత ఎమోషన్ వుంటుంది. కానీ బ్యూటీలో అదే లోపించింది. సినిమా ఆరంభం నుంచి ఇప్పటి కాలం అమ్మాయిలు పరిచయం లేని అబ్బాయిలతో ఎంత ఈజీగా ప్రేమలో పడుతున్నారు? అనేది తాము చెప్పదలిచామని దర్శక నిర్మాతలు తెలియజేశారు. అలా చేయడంలో ప్రేక్షకుడిని కనెక్ట్ చేయలేకకపోయాడు దర్శకుడు.
పెద్దలు, పిల్లలు అందరూ చూడాల్సిన సినిమా. అయితే ఆ కథను ఎంత బాగా చెప్పగలిగాడనేది దర్శకుడి పని. ఆ దర్శకుడి వెనుక మారుతీ వంటి మరో దర్శకుడూ వున్నాడు. మారుతీ టీమ్ కూడా వెనుక వుంది. పెద్ద నిర్మాణ సంస్థలు వున్నాయి. కానీ వారంతా మరచిన ప్రధాన అంశం లాజిక్. అది ఇందులో బాగా లోపించింది.
పిల్లలను కంటికిరెప్పలా తల్లిదండ్రులు కాపాడుకుంటారు. స్కూల్, కాలేజీకి వెల్ళినా ఆమెను ఒదిలిపెట్టి రావడం అనేది మధ్యతరగతి కుటుంబాలు చేసేవి. అలాంటిది ఓ ఆటోలో కాలేజీకిా పంపడం బాగానే వుంది. కానీ ఆటోవాడికి ఇవ్వాల్సిన డబ్బులు కూతురుకు ఇవ్వడం అది మిస్ యూజ్ చేయడంలో కొంత లాజిక్ మిస్ అయింది. అప్పటికే ఆమెకు ఫోన్ కొనివ్వడం, పుట్టినరోజు నాడు కొత్త బట్టలు కొనిచ్చినా ఇష్టంలేదని విసిరిపారేయడం వంటివి కామన్. కానీ తాహతుకుమించి స్కూటర్ కొని ఇవ్వడం కథలో లోపం.
ఇక తండ్రి నైట్ డ్యూటీలతో క్యాబ్ డ్రైవర్ చేయడంతో కూతురు రాత్రి పూట ఇంటిలోవుందా లేదా అనేది తెలీయకపోవచ్చు. కానీ కన్న తల్లి కూతురు గురించి పట్టించుకోకపోవడంతో రాత్రుళ్ళు అర్జున్ ను కలవడం అతనికి మరింత దగ్గరవడంతో కథ కోసం సీన్ రాసుకున్నట్లుంది. అదేవిధంగా తన ప్రియుడు అలిగాడని అలేఖ్య తలుపులువేసి వీడియోకాల్ లో ఒళ్ళు చూపించే ప్రయత్నం చేస్తుంది. సరిగ్గా ఆ టైంలో తల్లి డోర్ తీసుకుని రావడం జరగడంతో కథ మొత్తం టర్న్ అవుతుంది. అసలు తలుపు ఎలా తెరుచుకుంది? అనేది అర్థం కాదు. ఇలా పలు సీన్స్ కథ సాగడం కోసం రాసుకున్నట్లుగా వున్నాయి. ఇవన్నీ ఎడిటర్ పట్టించుకోకపోవడం, దర్శక నిర్మాతలు కూడా వారు ఆలోచించేలా ప్రేక్షకులు ఆలోచిస్తారనుకోవడం కూడా తప్పిదమే.
దానికి తోడు బ్యూటీకి తగినట్లుగా అలేఖ్య బాగుంది. కానీ తన ప్రియుడిని కన్నా.. అంటూ పలుమార్లు పిలుచుకోవడంతో చికాకు పుట్టిస్తుంది. ఉయ్యాల జంపాలలో తింగరి అమ్మాయిగా, కోడినెత్తురితో ప్రేమలేఖ రాస్తే పడిపోవడం చూశాం. కానీ బ్యూటీలో కేవలం కుక్కపిల్లలతో ఎట్రాక్ట్ చేసే కుర్రాడితో ఈజీగా ప్రేమలో పడిపోతుంది. అయితే ఇప్పటి యువతులకు సరిగ్గా ఆలోచించే విధానం తెలీదు. కేవలం రెడీమేడ్ పుడ్ లా అప్పటికప్పుడు వారు అనుకుంది జరిగిపోవాలి. దానికి వాడే ఒకే ఒక పదం నా లైఫ్ లో ఇంకేమి అడగను. దాన్ని బేస్ చేసుకుని కథను రాసినట్లుగా వుంది.
విశాఖపట్నం బీచ్ లో ఇలాంటి ప్రేమికులు కథలు బోలెడు వున్నాయి. అందులోంచి ఓ రియల్ సంఘటనను బేస్ చేసుకుని జర్నలిస్టు అయిన సుబ్రహ్మణ్యం కథను రాశారని చెప్పారు. కానీ దాని లోతుల్లోకి మరింత వెళ్లి కథనాన్ని నడిపిస్తే బాగుండేదవి.
పాత్రలపరంగా నారాయణ పాత్రలో సీనియర్ నరేష్ జీవించాడనే చెప్పాలి. తల్లిగా వాసుకీ నటించింది. పిల్లలని సరిగ్గా పట్టించుకోని తల్లిదండ్రులుగా వారు నటించారు. ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సింది కథానాయకుడిగా నటించిన అంకిత్ కొయ్య. తన పాత్ర ఇందులో పెద్ద ట్విస్ట్. అది సినిమాలో చూస్తేనే బాగుంటుంది. మాయమాటలు చెప్పితే అమ్మాయిలు ఎలా పడిపోతారనేది ఇందులో చూపించారు. మిగిలిన పాత్రలు బాగానే వున్నాయి. ఒరిస్సాకు చెందిన నటి నీలఖి టైటిల్ కూ, పాత్రపరంగా హావభావాలు బాగా చూపించి మంచి మార్కులు కొట్టేసింది. ఒరిస్సాలో ఆమె నటించిన టెన్త్ క్లాస్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.
సాంకేతికంగా సినిమాటోగ్రపీ, సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ముఖ్యంగా ఫస్టాఫ్ ని బాగా సాగదీసి వదిలారు. అనవసర బోరింగ్ సీన్స్ తో కథనాన్ని పేలవంగా మార్చేశారు. లవ్ ట్రాక్ చాలా సిల్లీ గా ఉంటుంది. వారి లవ్ ట్రాక్ ఏదో ఇమ్మెచ్యూర్ గా చిన్న పిల్లల ప్రేమ కథలా కనిపిస్తాయి. స్క్రీన్ ప్లే పరంగా మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సింది. కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ వరకు ఓకే కానీ లీడ్ జంట నడుమ సన్నివేశాలు, వారి ట్రాక్ ని బెటర్ గా డిజైన్ చేసుకుని ఉంటే బాగుండేది. అందరికీ కనెక్ట్ అయ్యే లైన్ ని దర్శకుడు మెప్పించే విధంగా తెరకెక్కించలేకపోయారు. కోర్ట్ సినిమాతో దర్శక నిర్మాతలు పోల్చుకున్నా అంతటి ఎమోషన్స్ ఇందులో చూపించలేకపోయారు.