హైదరాబాద్ నగరంలో ఓ భూవివాదం కేసులో టాలీవుడ్ నిర్మాత, వైకాపా నేత పీవీపీ వరప్రసాద్‌ను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఓ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి, సామాన్లు ధ్వంసం చేయడంతోపాటు యజమానిపై దాడికి యత్నించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబరు 14లో ప్రేమ్ పర్వత్ విల్లాస్ పేరిట పీవీపీ నిర్మాణాలు చేశారు. ఇందులో ఓ విల్లాను నాలుగు నెలల క్రితం విక్రమ్ కైలాస్ కొనుగోలు చేశారు. ఆ విల్లాను మరింత ఆధునికీకరించేందుకు విక్రమ్ పనులు చేయించుకుంటున్నారు.
ఈ క్రమంలో అనుచరులతో కలిసి వచ్చిన పీవీపీ అక్కడ నిర్మాణ సామాగ్రిని దించుతున్న వారిని అడ్డుకున్నారు. విల్లను ఎలా అమ్మానో అలానే ఉంచాలని ఆధునీకరించడానికి వీల్లేదని ఒత్తిడి చేశారు. అంతేకాక విక్రమ్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి సామాగ్రిని ధ్వంసం చేశారు. చంపేస్తానని బెదిరించారు. దీనిపై బాధితుడు వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చినప్పటికీ పీవీపీ ఆగలేదు. దీంతో బంజారాహిల్స్ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. తనను చంపేస్తానని బెదిరించాడని పీవీపీ వల్ల తనకు ప్రాణ హాని ఉందని, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
బాధితుడి ఫిర్యాదుతో పీవీపీపై ఐపీసీ 447,427, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణకు పిలిపించారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆ తర్వాత పీవీపీని అరెస్ట్ చేశారు. మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరో తొమ్మిది మందిని నిందితులను గుర్తించగా, వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.