హీరో విశాల్‌పై సినీ నటి వరలక్ష్మి ఫైర్ అయ్యింది. నడిగర్ సంఘం ఎన్నికల కోసం ప్రచారంలో చాలా దిగజారిపోయి మాట్లాడుతున్నావని వరలక్ష్మి మండిపడింది. 2019-2022కు గాను జరుగుతున్న నడిగర్ సంఘం ఎన్నికల సందర్భంగా సీనియర్ నటుడు, వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్‌పై అదేపనిగా హీరో విశాల్ విమర్శించడం చేస్తున్నారు.
దీనిపై ఆవేశానికి గురైన వరలక్ష్మి విశాల్‌పై మండిపడింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాల్, శరత్ కుమార్‌ను వివాదానికి లాగడం సరికాదని చెప్పింది.
పోటీలో లేని తన తండ్రిని అనవసరంగా ఎందుకు తిడుతున్నావని వరలక్ష్మి విశాల్‌ని ప్రశ్నించింది. ప్రతీసారీ చట్టం చట్టం అనే విశాల్.. మా తండ్రి తప్పే చేసి వుంటే చట్టం ప్రకారం చర్యలు తీసుకుని వుండాలిగా అంటూ ఎదురుప్రశ్న వేసింది. ఆ చట్టం ప్రకారమే నేరం రుజువుకాని వారు నిర్దోషులు. మా నాన్న తప్పు చేసి ఉంటే ఈపాటికి చట్టం చర్యలు తీసుకుని ఉండేది. అయినా ప్రస్తుత ఎన్నికలతో ఎలాంటి సంబంధంలేని తన తండ్రిని ఎందుకు విమర్శిస్తున్నావ్ అంటూ ప్రశ్నల దాడి చేసింది.
అంతేగాకుండా.. తన పదవీ కాలంలో చేసుకున్న మంచి పనులను ఎత్తిచూపుతూ ఎన్నికల ప్రచారం చేయాలి కానీ.. ఇలాంటి దిగజారుడు పనులు చేయకూడదని హితవు పలికింది. ప్రచారంలో చాలా దిగజారిపోయి ప్రవర్తించావ్. ఇన్నిరోజులు ఒక స్నేహితురాలిగా విశాల్‌కు మద్దతిచ్చారు. ఇకపై తన మద్దతు విశాల్‌కు వుండదని వరలక్ష్మి స్పష్టం చేసింది. వున్న మర్యాదను పోగొట్టుకున్నావంటూ మండిపడింది. ఇకపై వరలక్ష్మి ఓటు విశాల్‌కు లేదంటూ సోషల్ మీడియాలో పెద్ద పోస్టే పెట్టేసింది.