తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సినీ కథా రచయిత కీర్తీ సాగర్ (50) అనుమానాస్పదంగా మృతి చెందారు. వందలాది సినిమా కథలను రాసిన ఆయనకు గత కొంతకాలంగా ఒక్కటంటే ఒక్క సినీ కథ రాసే అవకాశం రాకపోవడంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యారు. దీంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. అదేసమయంలో ఈ విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం.
కర్నూలు జిల్లాకు చెందిన కీర్తి సాగర్ చాలా కాలం క్రితమే హైదరాబాద్ నగరానికి వచ్చి తన స్నేహితులతో కలిసి షేక్‌పేట పరిధిలో ఉంటున్నారు. అనేక చిత్రాలకు ఎన్నో కథలు రాసిన ఆయనకు గత కొంతకాలంగా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అవకాశాల కోసం శతవిధాలా ప్రయత్నించారు. కానీ, ఒక్క అవకాశం కూడా రాలేదు. ఈ క్రమంలో ఆయన తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు.
ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున టెర్రస్‌పై విగతజీవిగా కనిపించాడు. ఉదయాన్నే లేచిన స్నేహితుడు కీర్తి సాగర్ చనిపోయివుండటాన్ని చూసి స్థానిక పోలీసులకు సమాచారం చేరవేశాడు. దీంతో పోలీసులు అక్కడకు వచ్చి సాగర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.