Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రామబాణం తో గోపీచంద్, శ్రీవాస్ హ్యాట్రిక్ అందుకోనున్నారా !

Gopichand,   Dimple Hayati,   MP Margani Bharat, ali
, శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (16:34 IST)
Gopichand, Dimple Hayati, MP Margani Bharat, ali
గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ కాంబినేషన్ లో గతంలో 'లక్ష్యం', 'లౌక్యం' వంటి సూపర్ హిట్లు వచ్చాయి. ఇప్పుడు వారి కలయికలో 'రామబాణం' రాబోతోంది. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇందులో గోపీచంద్ సరసన నాయికగా డింపుల్ హయతి నటిస్తుండగా, జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిక్కీ జె. మేయర్ స్వరకర్త. మే 5న ఈ సినిమా థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని, సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఇక తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.
 
 'రామబాణం' ట్రైలర్ విడుదల వేడుక గురువారం రాజమండ్రిలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ గారి చేతుల మీదుగా ట్రైలర్ విడుదలైంది. రామబాణం ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. "ఈ క్షణం, ఈ ప్రయాణం.. నేను ఊహించింది కాదు, ప్లాన్ చేసింది కాదు" అంటూ గోపీచంద్ వాయిస్ తో ట్రైలర్ ఆసక్తికరంగా మొదలైంది. రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ ఫుల్ మీల్స్ లా ఉంది. "స్వచ్ఛమైన ఆహారం, మంచి బంధాలు.. ఈ రెండే మనిషిని కాపాడతాయి", "ప్రపంచం మారిపోయింది. ఒకప్పుడు తల దించినోడికి మర్యాద.. ఇప్పుడు చెయ్యెత్తినోడికే మర్యాద", "ఈట్ ఫుడ్.. నాట్ కెమికల్స్", "ప్రతివాడు గెలుపుకోసమే బ్రతుకుతాడు.. కానీ పదిమందికి మంచి జరగాలనే ఆశయం కోసం బ్రతికేవాడు చాలా అరుదుగా ఉంటాడు" వంటి సంభాషణలు కట్టిపడేశాయి. ట్రైలర్ లో గోపీచంద్ మేకోవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. "వాడు తమ్ముడులా లేడు.. టెర్మినేటర్ లా ఉన్నాడు" అనే ఒక్క మాటతో ఆయన పాత్ర ఎంత పవర్ ఫుల్ ఉండబోతుందో చూపించారు. చివరిలో గోపీచంద్ పంచెకట్టుతో గద పట్టుకొని కనిపించడం ట్రైలర్ కే హైలైట్ అని చెప్పాలి.
 
ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. "మన రాజమండ్రిలో ఏ సినిమా వేడుక చేసినా, అది విజయం సాధిస్తుంది. ఇదొక సెంటిమెంట్. గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్ లో లక్ష్యం, లౌక్యం అనే రెండు హిట్లు వచ్చాయి. ఈ సినిమాతో హ్యాట్రిక్ అందుకోవాలని కోరుకుంటున్నాను. రాజమండ్రిలో ఈ వేడుక జరగడం సంతోషంగా ఉంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎన్నో సినిమాల షూటింగ్ లు జరుగుతుంటాయి. అలీ అన్నయ్యతో కలిసి వెళ్లి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రాజమండ్రిలో మంచి స్టూడియో తీసుకొచ్చే విధంగా ప్రయత్నిస్తాము. రాజమండ్రితో సినీ పరిశ్రమ అనుబంధం ఇలాగే కొనసాగుతుందని కోరుకుంటూ.. రామబాణం టీం అందరికీ ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నాను" అన్నారు.
 
గోపీచంద్ మాట్లాడుతూ.. "నేను నటించిన చాలా సినిమాలు రాజమండ్రిలో షూటింగ్ జరుపుకున్నాయి. రెండేళ్ల క్రితం సీటీమార్ షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. ఆ సమయంలో భరత్ గారు ఎంతో హెల్ప్ చేశారు. అలాగే ఈరోజు ఇక్కడ ఈ వేడుక జరుపుకోవడానికి అవకాశమిచ్చినందుకు కూడా ఆయనకు ప్రత్యేక కృతఙ్ఞతలు. ఆయన మంచి రాజకీయ నాయకుడిగా ఎదిగారు.. అలాగే మంచి హీరోగా కూడా ఎదగాలని కోరుకుంటున్నాను. రామబాణం గురించి చెప్పాలంటే.. వాసుతో ఇది నా మూడో సినిమా. లక్ష్యం, లౌక్యం సినిమాలు ఎలా ఉన్నాయో.. ఇది కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. సినిమా చూసేటప్పుడు ఇది మన ఇంట్లో జరుగుతున్న కథలా అనిపిస్తుంది. అంతగా లీనమై ఈ సినిమా చూస్తారు.  అలీ గారు, నా కాంబినేషన్ చాలా బాగుంటుంది.   మిక్కీ జె.మేయర్ చాలా మంచి పాటలు ఇచ్చాడు.  ఈ సినిమాకి రామబాణం అనే టైటిల్ పెట్టినందుకు బాలకృష్ణ గారికి ప్రత్యేక కృతఙ్ఞతలు" అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండో నేపాల్ ఫిలిం ఎక్స్చేంజి - 2023 సదస్సు కు వీస్.వర్మ, చైతన్య జంగా