అమితాబ్, విజయ్, బాలకృష్ణ, పవన్ గురించి పలు విశేషాలు తెలియజేసారు నటి ఖుష్బూ. ఇప్పడు గొలిపిచంద్ తల్లిగా రామబాణం సినిమాలో నటించారు. ఆ సినిమా గురించి చెపుతూ.. రామబాణం సినిమా ప్రధానంగా కుటుంబ బంధాల గురించి ఉంటుంది. మనం ఎంత డబ్బు సంపాదించినా, ఉన్నత స్థాయికి చేరినా.. కుటుంబ బంధం అనేది చాలా ముఖ్యం. అలాంటి కథతో ఈ చిత్రం రూపొందింది. అందుకే రామబాణం నాకు అంత దగ్గరైంది. ఇందులో నా పాత్ర మనం మరిచిపోతున్న సంప్రదాయాలు, ఆహార వ్యవహారాలను గుర్తు చేసేలా ఉంటుంది. ప్రస్తుతం మనం తింటున్న ఫాస్ట్ ఫుడ్ వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. సంప్రదాయ ఆహారం విలువని తెలిపేలా నా పాత్ర ఉంటుంది. నా పాత్ర పేరు భువనేశ్వరి. ఆ పాత్రను దర్శకులు మలచిన తీరు చాలా బాగుంది అని నటి ఖుష్బూ అన్నారు.
హీరో గోపీచంద్ తల్లిగా నటించారు. లక్ష్యం', 'లౌక్యం' తర్వాత డైరెక్టర్ శ్రీవాస్ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాయికగా డింపుల్ హయతి నటిస్తుండగా, జగపతి బాబు, ఖుష్బూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మే 5న ఈ చిత్రం భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటి ఖుష్బూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
తమిళ్ లో వచ్చినంత పేరు తెలుగులో రాకపోవడానికి కారణం?
మొదట్లో తెలుగు సినీ పరిశ్రమ కూడా చెన్నైలోనే ఉండేది. కానీ తెలుగు పరిశ్రమ ఇక్కడికి తరలి వచ్చాక, నేను నా కుటుంబం కోసం అక్కడే ఉండిపోయాను. తమిళ్ లో ఎక్కువ అవకాశాలు వచ్చాయి. డేట్స్ సర్దుబాటు గాక తెలుగులో చంటి వంటి సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది. ఆ విషయంలో ఇప్పటికీ కొంచెం బాధ ఉంది.
గోపీచంద్, జగపతి బాబు తో కలిసి నటించడం ఎలా ఉంది?
గోపీచంద్ తో కలిసి మొదటిసారి నటించాను. సెట్స్ లో గోపీచంద్ చాలా సైలెంట్ గా ఉంటారు. ఆయన పనేదో ఆయన చేసుకొని వెళ్లిపోతుంటారు. కారవాన్ లో కంటే ఎక్కువగా లొకేషన్ లో కుర్చీలో కూర్చోడానికే ఇష్టపడతారు. ఆయన ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటారు. ఇక జగపతిబాబు గారంటే ఆయన నటుడు కాకముందు నుంచే నాకు తెలుసు. బాల నటిగా వారి బ్యానర్ జగపతి ఆర్ట్స్ లో రెండు సినిమాలు చేశాను. ఆయన మంచి మనసున్న వ్యక్తి. నేను చౌ మామ అని పిలుస్తాను.
వారసుడులో ఉన్నారా ?
వారిసు(వారసుడు)లో 18 నిమిషాల నిడివి గల బలమైన పాత్రను పోషించాను.. కానీ సినిమా నిడివి ఎక్కువ కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నా పాత్రను తొలగించారు. తెలుగులో ఇంకా మంచి మంచి పాత్రలు చేయాలని ఉంది. పాత్రకి ప్రాధాన్యత ఉంటే నిడివి తక్కువ అయినా నటించడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం మనసుకి నచ్చిన పాత్రలను మాత్రమే ఎంచుకుంటున్నాను. అందుకే సినిమాలు తక్కువ చేస్తున్నాను.
సీనియర్ నటిగా హీరోయిన్ డింపుల్ కి ఏమైనా సలహాలు ఇచ్చారా?
అప్పటికి, ఇప్పటికీ మేకింగ్ పరంగా, నటన పరంగా ఎన్నో మార్పులు వచ్చాయి. నేనే ఇంకా ఇప్పటి తరం నుంచి కొన్ని నేర్చుకోవాలి. డింపుల్ మేకప్, హెయిర్ స్టైల్ చేసుకునే విధానం నన్ను ఆకట్టుకుంది. నటనలోనూ అప్పటికి ఇప్పటికీ మార్పు కనిపిస్తుంది. ఇప్పుడు సెటిల్డ్ గా పెర్ఫార్మ్ చేస్తున్నారు. అయితే అప్పుడు మాకు ఏదైనా లొకేషన్ లో సరైన వసతులు లేకపోయినా ఎలా మేకప్ వేసుకోవాలి, ఎలా కాస్ట్యూమ్ మార్చుకోవాలి అనే ట్రిక్స్ తెలుసు. ఈ తరానికి అలాంటివి తెలీదు.
కెరీర్ ప్రారంభంలో మీరు చేసిన సినిమాలు ఇప్పుడు చూసుకుంటే ఏమనిపిస్తుంది?
ఎప్పటికీ గర్వంగానే ఉంటుంది. కాలేజ్ చదువు పూర్తయ్యాక కూడా మనకి స్కూల్ జ్ఞాపకాలు గొప్పగా అనిపిస్తాయి. అది నాకు స్కూల్ లాంటిది. నా నటనకి అదే కదా పునాది. అప్పుడు రాఘవేంద్రరావు గారు, పి వాసు గారు, భారతీరాజా గారు, బాలచందర్ గారు, జంధ్యాల గారు, గోపాల్ రెడ్డి గారు ఇలా ఎందరో గొప్ప దర్శకులతో పని చేశాను. నా పనిని నేను ఆరాధిస్తాను.. అదే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది అనుకుంటున్నాను.
ఫలానా పాత్ర చేయలేకపోయాను అని ఎప్పుడైనా అనుకున్నారా?
అమితాబ్ బచ్చన్ తో కలిసి చీని కం లో టబు నటించింది. ఆ ఛాన్స్ టబు కొట్టేసినందుకు ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను అమితాబ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ ని. నా బెడ్ రూమ్ లో ఆయన పోస్టర్స్ కూడా ఉంటాయి. అమితాబ్ గారితో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను కానీ ఆయనకు జోడీగా చేయలేదనే బాధ ఉంది.
తెలుగులో ఇంకా ఎవరితో సినిమాలు చేయాలని ఉంది?
ఇప్పటిదాకా బాలకృష్ణ గారితో సినిమా చేయలేదు. ఆయన తో సినిమా చేయాలని ఉంది.