బాహుబలి-2 అంత సక్సెస్ మాకు ఎలా వస్తుంది? అంత సీన్ మాకు లేదన్న సల్మాన్ ఖాన్
హిందీ చిత్రాలను మించి దక్షిణాది సినిమా అయిన ‘బాహుబలి-2’ అంతస్థాయిలో విజయం సాధించడానికి కారణం హిందీ ప్రేక్షకులే అని తేల్చిచెప్పేశాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఒక తెలుగు సినిమా బాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కు నెట్టి అత్యధిక కలెక్షన్లతో భారత చల
హిందీ చిత్రాలను మించి దక్షిణాది సినిమా అయిన ‘బాహుబలి-2’ అంతస్థాయిలో విజయం సాధించడానికి కారణం హిందీ ప్రేక్షకులే అని తేల్చిచెప్పేశాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఒక తెలుగు సినిమా బాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కు నెట్టి అత్యధిక కలెక్షన్లతో భారత చలనచిత్ర రంగ రికార్డులను తిరగరాయడానికి కారణం హిందీ ప్రేక్షకులు విరగబడి చూడటమే అనేశాడు సల్మాన్.
తన తాజా చిత్రం ట్యూబ్‌లైట్ చిత్రం ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ పనిలో పనిగా బాహుబలి-2 అద్భుత విజయంపై కూడా తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ‘‘బాహుబలి-2’ విజయం వెనుక హిందీ ప్రేక్షకుల పాత్ర ఉంది. వాళ్లకు దక్షిణాదిలో ముగ్గురు.. నలుగురు కథానాయకులు మించి ఎవరూ తెలియదు. అయినప్పటికీ ఈ సినిమాని వాళ్లు ఆదరించారు. ఓ తెలుగు సినిమాకు అంతపెద్ద విజయాన్ని అందించారు.
అదే దక్షిణాది ప్రేక్షకులకు మేం తెలిసినా మా సినిమాలు ఈ రేంజ్‌లో అక్కడ బిజినెస్ చేయలేకపోతున్నాయి. ఎందుకంటే అక్కడి హీరోలను దక్షిణాది ప్రేక్షకులు అమితంగా అభిమానిస్తారు. కమల్‌హాసన్ ఫ్యాన్ అంటే అతను ఎప్పటికీ కమల్ అభిమానిగానే ఉంటాడు. రజనీకాంత్ అభిమాని అయితే ఎప్పటికీ రజనీనే అభిమానిస్తాడు. వాళ్లతో పోల్చినపుడు మమ్మల్ని దక్షిణాది ప్రేక్షకులు అంతగా అభిమానించరు’’ అని చెప్పుకొచ్చాడు సల్మాన్.
దక్షిణాది ప్రేక్షకులు తన నటీనటులను ఎందుకు అంత స్థాయిలో ఆరాధిస్తారో మాత్రం సల్మాన్ చెప్పలేకపోయాడు. మీడియా నిపుణుల కంటే బాహుబలి 2 సినిమాను చూసి ఉద్వేగంతో థియేటర్లలోనే కన్నీళ్లు పెట్టుకుంటున్న సగటు హిందీ చిత్రాల ప్రేక్షకులు కానీ, ఉత్తర భారత నెటిజన్లు కానీ పనిలోపనిగా బాలీవుడ్ హీరోలను, కథలను తిట్టిపోస్తున్నారు. నలభై రోజులుగా బాహుబలి సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్న ఉత్తరాది ప్రేక్షకులు, నెటిజన్లు హాలీవుడ్ చెత్తను కాపీ కొట్టి భారతీయ సంస్కృతికి దూరమైపోయిన బాలీవుడ్ చిత్రాలను, వాటి హీరో, హీరోయిన్లను తిట్టిపోస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
ఎన్ని కొత్త పోకడలు, క్లబ్ సంస్కృతిని అడపాదడపా ప్రతిబింబించినప్పటికీ దక్షిణాది సినిమాలు తమ సామాజిక వాస్తవికతకు దూరం జరగలేదని, తమ చుట్టూ ఉన్న పరిస్థితులను, సమస్యలను అవి విడిచిపెట్టలేదని అందుకే దక్షిణాది సినిమాలు బాలీవుడ్‌ను కూడా అధిగమిస్తున్నాయని హిందీ ప్రేక్షకులు, నెటిజన్లు దక్షిణాది చిత్రరంగాన్ని ఒక రేంజిలో పొగిడేస్తున్నారు. దీంతోపోలిస్తే బాలీవుడ్ దేశంలోని ఏప్రాంతానికి ప్రతిబింబమో కూడా తెలీనంతగా విదేశీమయమైపోయిందని, హాలీవుడ్ సంస్కృతిని కాపీ కొట్టడమే అది పనిగా పెట్టుకుని తన మూలాలను మర్చిపోయిందని నెటిజన్లు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు.
బాహుబలి-2 హిందీ ప్రాంతంలో ఎందుకు అంత సూపర్ సక్సెస్ సాధించిందో వింటున్నావా సల్మాన్. భారతీయ ప్రజాజీవితంలోని మానవీయ స్పర్శను, భావోద్వేగపు తడిని బాహుబలి-2 ఉత్తరాది ప్రేక్షకులకు మళ్లీ రుచి చూపించింది. దక్షిణాదికి మించి ఉత్తరాది ప్రేక్షకులు బాహుబలి-2 సినిమాకు దాసోహమవుతున్నారంటే అదే కారణం.
హిందూ మత సంస్కృతిని, దాని వైభవాన్ని భారీస్థాయిలో చూపించింది కాబట్టి బాహుబలి-2 అంత విజయం పొందలేదు. వెయ్యేళ్లకు ముందు కాలానికి సంబంధించిన కథే అయినప్పటికీ మన మట్టి వాసనలను, మన ప్రజల అభిప్రాయాలను అది సినిమాలో ప్రతి ఫ్రేమ్‌లో ప్రతిబింబించింది. అదే దాని విజయానికి మూలకారణం. బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ వాస్తవాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే వారికీ, హిందీ చిత్రపరిశ్రమకీ అంత మంచిది.