Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సినిమా అవకాశాల కోసం వెంపర్లాడేవారందరూ ఇది చదవాలి..?

సినిమా అవకాశాల కోసం వెంపర్లాడేవారందరూ ఇది చదవాలి..?
, గురువారం, 31 అక్టోబరు 2019 (20:50 IST)
రంగుల ప్రపంచంలో విహరించాలనుకుంటున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త. మీ ఆసరాను అవకాశంగా చేసుకుని మీ దగ్గర డబ్బులు దండుకునే ఎన్నో సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. సినిమాలో ఛాన్సులు ఇప్పిస్తామని, సాంకేతిక నిపుణులుగా తయారుచేస్తామని మభ్యపెట్టి లక్షల రూపాయలు వసూలు చేసే సంస్థలు రెండు తెలుగు రాష్ట్రాల్లోను వందలాదిగా ఉన్నాయి. నవ్యాంధ్ర ఫిలిం ఛాంబర్ పేరుతో యువతీయువకుల జీవితాలలో ఆడుకున్న ఎస్వీఎన్ రావు గుట్టు రట్టు చేసింది.
 
ఒకే ఒక్క ఛాన్స్.. ఈ డైలాగ్ వింటే వెంటనే గుర్తుకు వచ్చేది ఖడ్గం సినిమా. ఆ డైలాగ్ చెప్పిన సంగీత క్యారెక్టర్. సినిమా అవకాశాల కోసం పల్లెటూరి నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఎన్ని బాధలు పడిందో.. ఆ తరువాత అవకాశాలు ఏవిధంగా వచ్చాయో ఆ సినిమా చూసిన వారందరికీ తెలుసు. అయితే సినిమా అవకాశాల కోసం ఎంతోమంది యువతీయువకులు సొంత వాళ్ళను వదిలి వచ్చేస్తున్నారు. యువకులైతే అవకాశాలు దొరక్క తిరిగి వెళ్ళిపోతుంటే, యువతులు మాత్రం అవకాశాలు వచ్చేంత వరకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 
 
వెండితెరపై వెలిగిపోవాలని కొన్ని సంస్థలను నమ్మి మోసపోతున్నారు. అలాంటి సంస్థే నవ్యాంధ్ర ఫిలిం ఛాంబర్. 2015 సంవత్సరం గుంటూరు జిల్లాలో నవ్యాంధ్ర ఫిలిం ఛాంబర్‌ను ప్రారంభించాడు ఎస్వీఎన్ రావు. ఎంతోమంది సినీ ప్రముఖుల చేత ఫోటోలు తీయించుకుని వారందరూ తనకు బాగా తెలుసునని.. సినిమాలు తీయాలన్నా.. మిమ్మల్ని పైకి తీసుకురావాలన్నా తనవల్లే సాధ్యమని అవకాశాల కోసం వచ్చేవారందరినీ మభ్య పెట్టాడు. నవ్యాంధ్ర ఫిలిం ఛాంబర్ పేరుతో ఏకంగా ఒక ఖాతా తెరిచాడు. పత్రికల్లో యాడ్స్ ఇచ్చాడు. స్నేహితుల పరిచయాలతో ఎంతోమందిని ఫిలిం ఛాంబర్‌కు రప్పించుకున్నాడు.
 
ఇలా వచ్చిన వారందరికీ సినిమా అవకాశాలు ఇప్పిస్తానంటూ వారి వద్ద కనీస ఫీజును వసూలు చేయడం ప్రారంభించాడు. ఎవరి ఆర్థిక స్థోమతకు తగ్గట్లు ఒక్కొక్కరి వద్ద 30 నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేశాడు. ఇలా గుంటూరులో తన సంస్ధను ప్రారంభించి విజయవాడ, హైదరాబాద్, తిరుపతిలలో విస్తరించాడు. మొత్తం నాలుగు ప్రాంతాల్లో 1600 మంది యువతీయువకుల వద్ద డబ్బులు వసూలు చేశాడు. సినిమాల్లో అవకాశాలు మాత్రమే కాదని.. సాంకేతిక నిపుణులుగా తయారుచేసి మంచి జీతం వచ్చేలా చేస్తానని చెప్పుకొచ్చాడు. 
 
ఇలా వచ్చిన వారందరికీ నవ్యాంధ్ర ఫిలిం ఛాంబర్ పేరుతో ఐడి కార్డులను అందజేశాడు. అందరినీ నమ్మించేందుకు కోడెనాగు అనే సినిమాను తీస్తున్నట్లు ప్రకటించాడు. అయితే ఆ సినిమాను మాత్రం మధ్యలోనే ఆపేశాడు. ఎస్వీఎన్ రావు బాగోతం ఒక్కొక్కటిగా తెలుసుకున్న బాధితులు కొంతమంది పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా మరికొంతమంది మిన్నకుండి పోయారు. ఎస్వీఎన్ రావుపై తిరుపతి, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్‌లలో పలు కేసులున్నాయి. 
 
గత 8 నెలల నుంచి ఇతనిపైన కేసులున్నా పోలీసులకు కనిపించకుండా తప్పించుకుని తిరిగాడు. ఎస్వీఎన్ రావును అరెస్ట్ చేసిన వెస్ట్ పోలీసులు అతని కారును సీజ్ చేశారు. కోర్టులో ఎస్వీఎన్ రావును హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌ను కూడా విధించారు. నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు తమకు రావాల్సిన మొత్తం డబ్బులను పోలీసులు తిరిగి ఇప్పించాలని, అప్పులు చేసి మరీ ఎస్వీఎన్ రావుకు లక్షల రూపాయల డబ్బులను ఇచ్చామంటున్నారు బాధితులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ర‌వితేజ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవ‌రో తెలుసా?