నేను 8వ తరగతి నుంచే మా బంధువుల ఇంటిలో ఎడిటింగ్ నేర్చుకున్నా. అప్పుడే చిన్న చిన్న రీల్స్ లా చేసేవాడిని. అలా ఎడిటింగ్ లొో పట్టు వచ్చాక రచయితగా, దర్శకుడిగా గ్రిప్ వచ్చింది. అలా.. నేను రైటర్, డైరెక్టర్ అవుదామనే ఇండస్ట్రీకి వచ్చాను. బీటెక్ చదువుతూనే షార్ట్ ఫిలింస్ చేసేవాళ్లం. ఆ తర్వాత సోషల్ మీడియా కంటెంట్ చేస్తూ మా షార్ట్ ఫిలింస్ ను ప్రమోట్ చేసుకున్నాం. ఈ ప్రాసెస్ లో స్క్రిప్ట్స్ మీద అవగాహన తెచ్చుకున్నాను. ఇండస్ట్రీకి వచ్చాక నటుడిగా అవకాశం వచ్చింది. అలా "90s మిడిల్ క్లాస్ బయోపిక్"తో మీ అందరిలో గుర్తింపు తెచ్చుకున్నా.. అని మౌళి తనుజ్ అన్నారు.
శివానీ నాగరం తో కలిసి నటించిన మూవీ లిటిల్ హార్ట్స్. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు హీరో మౌళి తనుజ్.
- "లిటిల్ హార్ట్స్" కథ విన్నప్పుడే ఇది థియేట్రికల్ గా బాగుంటుందని నిర్ణయించుకున్నాం. ఈటీవీ విన్ వాళ్లు కూడా మా నిర్ణయాన్ని సపోర్ట్ చేశారు. వంశీ నందిపాటి, బన్నీ వాస్ గారు జాయిన్ కావడంతో మా మూవీకి గ్రాండ్ రిలీజ్ దొరికింది. ఇప్పుడు మా ప్రయత్నమంతా థియేటర్స్ కు ప్రేక్షకుల్ని రప్పించాలి. మా ప్రమోషనల్ కంటెంట్ తో బాగుంటుందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలిగింది. ఈ బ్యాచ్ మనల్ని థియేటర్స్ లో నవ్విస్తారు అనే నమ్మకం ప్రేక్షకుల్లో కలుగుతోంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం.
- ప్రమోషనల్ యాక్టివిటీస్ కోసం స్క్రిప్ట్ సైడ్ నేనే వర్క్ చేశా. కొత్తగా ఉండేలా ప్లాన్ చేశా. మనం సినిమాలో అయినా, సోషల్ మీడియాలో అయినా కంటెంట్ తో క్రెడిబిలిటీ సంపాదించుకుంటే ప్రేక్షకుల్లో మనపై నమ్మకం ఏర్పడుతుంది. ఆ ప్రయత్నం చేస్తున్నాం.
- ఆరేళ్ల నుంచి అరవై ఏళ్ల వరకు అన్ని ఏజ్ గ్రూప్ ఆడియెన్స్ ను ఆకట్టుకునేలా లిటిల్ హార్ట్స్ ఉంటుంది. ఒక్క యూత్ కోసమే చేసిన సినిమా కాదు. థియేటర్స్ లో సినిమా సస్టెయిన్ అవ్వాలంటే యూత్ తో పాటు మిగతా అందరు ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఉండాలి. "లిటిల్ హార్ట్స్"లో అలాంటి కంటెంట్ ఉంది.
- వీలైనన్ని మంచి చిత్రాల్లో నటించాలని ఉంది. ఓ పదేళ్ల తర్వాత నేను ఎన్ని సినిమాలు చేశాననేది ఎవరికీ గుర్తుండదు కానీ నేను చేసిన మంచి చిత్రాలు మాత్రం గుర్తుపెట్టుకుంటారు. అలాగే నేను రైటర్, డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన డ్రీమ్ కూడా ఫ్యూచర్ లో నెరవేర్చుకుంటా. స్క్రిప్ట్ వర్క్ కూడా చేస్తున్నా. ఇప్పుడు నటుడిగా అవకాశాలు వస్తున్నాయి కాబట్టి నటిస్తుంటా. మా కుటుంబంలో ఎవరికీ సినిమా ఇండస్ట్రీతో పరిచయాలు లేవు. నేను కూడా ఇక్కడ స్థిరపడగలనని మా ఫ్యామిలీ వారికి నమ్మకం లేకుండేది. 90s మిడిల్ క్లాస్ బయోపిక్ తర్వాత వారికి కొంత నమ్మకం ఏర్పడింది.
- సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేసేప్పటి నుంచే విమర్శలు అలవాటు అయ్యాయి. రేపు మా మూవీ టికెట్ కొని థియేటర్ లోకి వెళ్లిన ఆడియెన్స్ లో కొందరికి మా సినిమా నచ్చకపోవచ్చు. వారు ఏదైనా విమర్శిస్తే పాజిటివ్ గా తీసుకుంటా. ఏదైనా లోపం ఉంటేనే విమర్శిస్తారు. ఆ లోపాన్ని సరిచేసుకుంటే ఎదుగుతామని నమ్ముతా.
- సినిమా స్క్రిప్ట్ వరకు నా ఇన్వాల్వ్ మెంట్ లేదు. మా డైరెక్టర్ సాయి మార్తాండ్ బిర్యానీ చేస్తే నేను కొత్తిమీర చల్లాను అంతే. ఆదిత్య హాసన్ గారు ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఆయన తన సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల ప్రమోషన్స్ కు రాలేకపోతున్నారు.
- అమ్మానాన్నలతో కలిసి చూసే సినిమాలే చేయాలనుకుంటున్నా. మా పేరెంట్స్ తో నేను కలిసి కంఫర్ట్ గా మూవీ చూడాలి. సినిమా చూశాక వాళ్లు మంచి సినిమా చేశావని చెప్పాలి. నేను రాసే స్క్రిప్ట్స్ కూడా అలాగే ఉంటాయి. సోషల్ మీడియా కంటెంట్ కూడా అందరికీ నచ్చేలా చేశాను. "లిటిల్ హార్ట్స్" సినిమాను మా పేరెంట్స్ ఇంకా చూడలేదు. రేపు చూపిస్తాను.
- లిటిల్ హార్ట్స్ ప్రమోషన్స్ లో మేము జెన్యూన్ గా మాట్లాడుతున్నాం. ప్రేక్షకులకు కనెక్ట్ అవుతున్నాం. ఇలాంటి సినిమాను థియేటర్స్ లో చూస్తేనే కామెడీ ఫీల్ అవుతారు. ఓటీటీలో చూస్తే అంతగా కనెక్ట్ కారు. అందుకే థియేటర్స్ లో చూడమని కోరుతున్నాం.
- శివానీ నాగరంతో వర్క్ చేయడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. సింజిత్ యెర్రమల్లి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. తన మ్యూజిక్ సినిమాకు వన్ ఆఫ్ ది హైలైట్ అవుతుంది. "లిటిల్ హార్ట్స్" హిలేరియస్ రోమ్ కామ్ మూవీ. థియేటర్స్ లో చూడండి. నిన్న వేసిన ప్రీమియర్స్ నుంచి మంచి టాక్ వచ్చింది. ఆ టాక్ తో మా కాన్ఫిడెంట్ మరింత పెరిగింది. నా నెక్ట్స్ మూవీ స్క్రిప్ట్స్ వింటున్నా. త్వరలో అనౌన్స్ చేస్తాను.