రౌడీబాయ్స్‌తో హీరోగా ఆశిష్‌కు చక్కటి శుభారంభం దక్కడం ఆనందంగా ఉంది. నటన, డ్యాన్సుల్లో పరిణతి కనబరచడచంతో పాటు ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌లో కూడా నటుడిగా అందర్ని ఆకట్టుకున్నాడని ప్రశంసిస్తున్నారు అని అన్నారు దిల్‌రాజు.
- శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్‌తో కలిసి ఆయన నిర్మించిన తాజా చిత్రం రౌడీబాయ్స్. ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్ నిర్మాత దిల్‌రాజు పాత్రికేయులతో ముచ్చటించారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి చక్కటి స్పందన లభిస్తున్నది. కథ, కథనాలు బాగున్నాయని, ఆశిష్ అద్భుతంగా నటించాడని చెబుతున్నారు. కథ, పాత్రలతో యువతరం కనెక్ట్ అవుతుండటంతో ఓపెనింగ్స్ నిలకడగా ఉన్నాయి.
- పండుగ తర్వాత కూడా వసూళ్లు తగ్గలేదు. ఐదు రోజుల్లో దాదాపు ఏడు కోట్ల గ్రాస్ వచ్చింది. నాలుగున్నర కోట్ల షేర్ లభించింది. మౌత్‌టాక్‌తో వసూళ్లు నిలకడగా వున్నాయి. సంక్రాంతి బరిలో విడుదలై అందరి అభినందనలు అందుకుంటుంది. ఆంధ్రాలో చాలా చోట్ల హౌస్‌ఫుల్‌తో సినిమా ఆడుతుంది. కొత్త హీరో సినిమాకు ఈ స్థాయి ఆదరణ దక్కడం సంతోషంగా ఉంది. రెండో వారంలో ఇదే ఆదరణ లభిస్తుందనే నమ్మకముంది.
- ఆశిష్ అరంగేట్రం కోసం ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమా కంటే నటనకు ప్రాధాన్యమున్న యూత్‌ఫుల్ కథ అయితేనే బాగుంటుందని కొంతమంది శ్రేయోభిలాషులు సలహాలిచ్చారు. అతడి కెరీర్‌ను దృష్టిలో పెట్టుకొనే ఈ కథను ఎంచుకున్నాం. భవిష్యత్తులో అతడు మంచి కథలు ఎంచుకునేలా చూసే బాధ్యత నాపై ఉంది.
ఓటీటీ ఆలోచన రాలేదు
సినిమాను ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదు. థియేటర్స్ కోసమే రూపొందించాం. యాభై రోజుల తర్వాతే ఓటీటీలో విడుదలచేస్తాం. దేవిశ్రీప్రసాద్ పాటలకు చక్కటి స్పందన లభిస్తున్నది. త్వరలో మ్యూజికల్ కంటెస్ట్ నిర్వహించబోతున్నాం. ఏపీలో యాభై శాతం ఆక్యుపెన్సీ అమలులో ఉన్నా సినిమా కలెక్షన్స్ మాత్రం బాగున్నాయి. ఈ నిబంధనను మా సినిమాకు అడ్వాంటేజ్‌గానే భావిస్తున్నాం. కరోనా భయాలు పక్కనపెట్టి సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్‌చేసే అవకాశం ఉంటుంది. తెలంగాణలో గురువారం నుంచి వసూళ్లు పెరుగుతాయనే నమ్మకముంది.
సుకుమార్‌తో కలిసి
ఆశిష్ హీరోగా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌తో కలిసి సెల్ఫిష్ పేరుతో ఓ సినిమాను నిర్మించబోతున్నాం. సుకుమార్ శిష్యుడు కాశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. సుకుమార్ సంభాషణలను అందించనున్నారు. ఆర్య తర్వాత నేను, సుకుమార్‌తో కలిసి చేస్తున్న చిత్రమిది. అందువల్లే బాధ్యతగా భావిస్తున్నాం.
ఏపి అండ్ తెలంగాణలో రౌడిబాయ్స్ వసూళ్లు
తొలిరోజు ఏపీ తెలంగాణలో మొత్తం 1 కోటి 42లక్షలు, రెండోరోజు 1 కోటి 62 లక్షలు, మూడోరోజు 1 కోటి 55 లక్షలు, నాలుగో రోజు 1 కోటి 32 లక్షలు, ఐదో రోజు 1 కోటి 5 లక్షలు గ్రాస్‌ను వసూలు చేసింది.