Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరద బాధితులకు అండగా నిలుస్తాం: చిత్ర పరిశ్రమ

Raghavendra Rao, Suresh Babu, Damodar Prasad, Tammareddy  and others

డీవీ

, గురువారం, 5 సెప్టెంబరు 2024 (18:49 IST)
Raghavendra Rao, Suresh Babu, Damodar Prasad, Tammareddy and others
ఎప్పుడు ప్రకృతి విపత్తులు సంభవించినా బాధితులను ఆదుకునేందుకు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చిన వరదల వల్ల ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. దీంతో బాధితులను ఆదుకోవడానికి సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. చిత్ర పరివ్రమలోని అన్ని విభాగాలు కలిసి సాయం చేసేందుకు నడుం బిగించారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సినీ పరిశ్రమ చేయబోతున్న యాక్షన్ ప్లాన్ గురించి వివరించారు.
 
ఈ సందర్భంగా ఛాంబర్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ..‘‘విజయవాడ, ఖమ్మంలో వరదలు రావడం వల్ల చాలా మంది బాధ పడుతున్నారు. ఇలాంటి విపత్తులు ఎప్పుడు వచ్చినా సాయం చేసేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. అలాగే ఈసారి కూడా ఎలాంటి సహాయసహకారాలు చేస్తే బాగుంటుంది అనేదానిపై చర్చించాము. ఫిల్మ్ ఛాంబర్ తరపున ఏపీకి రూ.25 లక్షలు, తెలంగాణకు రూ.25 లక్షలు, అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ తరపున ఏపీకి 10 లక్షలు, తెలంగాణకు 10 లక్షలు, అలాగే ఫెడరేషన్ తరపున చెరో 5 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాం. రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు సంబంధించి అకౌంట్ నంబర్స్ అలాగే, ఛాంబర్ నుంచి ఒక అకౌంట్ నంబర్ ఇస్తున్నాం. సహాయం ఇవ్వాలనుకునేవారు ఈ అకౌంట్స్‌కు డబ్బులు పంపించవచ్చు’’ అని తెలిపారు.
 
సీనియర్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు మాట్లాడుతూ..‘‘ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మన పరిశ్రమ ఆదుకునే విషయంలో ముందుంటుంది. ఇప్పుడు కూడా సినీ పరిశ్రమ అండగా ఉంటుంది. డబ్బు రూపంలోనే కాకుండా నిత్యావసరాలను కూడా అందించే ప్రయత్నం చేస్తాం. మా కుటంబం నుంచి కోటి రూపాయలు అందిస్తున్నాం. ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని చెప్పారు.
 
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ..‘‘మేము ఈ స్థాయికి రావడానికి కారణం ప్రజల ఆదరణే. ఇప్పుడు వాళ్లు కష్టాల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో మనం వాళ్లను ఆదుకోవాలి. అలాగే మాకు ఎప్పుడూ అండగా ఉండే ప్రభుత్వాలకు మద్దతును తెలియజేయడానికే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం.’’ అని చెప్పారు.
 
ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ..‘‘తెలుగు రాష్ట్రాల్లో వరదల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలామంది హీరోలు విరాళాలు అందించారు. అలాగే చాంబర్ నుంచి కూడా సహాయం చేయాలని నిర్ణయించాం. మా నిర్మాణ సంస్థ నుంచి రెండు రాష్ట్రాలకు చెరో పాతిక లక్షలు ఇస్తున్నాం. ఇండస్ట్రీలోని అందరూ ముందుకు వచ్చి ఫెడరేషన్ నంబర్‌కు విరాళాలు అందించాలని కోరుతున్నాం. తద్వారా వచ్చిన విరాళాలను ప్రభుత్వాలకు అందిస్తాం’’ అని చెప్పారు.
 
ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ..‘‘రేపు అన్ని యూనియన్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఒకరోజు వేతనం ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. మా కార్మికుల తరపున తెలుగు రాష్ట్రాలకు ఎంత చేయాలో అంతా చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం.’’ అని చెప్పారు.
 
నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ..‘‘వరద బాధితులను ఆదుకోవడం కోసం ఇండస్ట్రీ నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేశాం. తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమేం ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుని కమిటీ వాటిని తీర్చేలా ముందుకు వెళ్తుంది.’’ అని చెప్పారు.
 
ఈ ప్రెస్ మీట్‌లో రాఘవేంద్రరావు, దిల్ రాజు, సురేష్ బాబు, భరత్ భూషణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, జెమినీ కిరణ్, అశోక్ కుమార్, అనిల్, అమ్మిరాజు, భరత్ చౌదరి పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం అండగా ఉంటాం: రాఘవేంద్రరావు