Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 28 April 2025
webdunia

ఫాసిస్ట్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి.. రాష్ట్రపతి పాలన విధించాలి... కంగనా

Advertiesment
Kangana Ranaut
, శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (08:16 IST)
బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా మరోమారు మహారాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఓ ఫాసిస్టు ప్రభుత్వంగా ఆరోపించింది. ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలంటూ డిమాండ్ చేసింది. 
 
బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య కేసు అనేక మలుపులు తిరిగి డ్రగ్స్ మాఫియా వరకు వచ్చి ఆగింది. ఈ అంశంపై కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు శివసేనకు ఆగ్రహం తెప్పించాయి. ముఖ్యంగా ముంబైను పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో పోల్చడాన్ని శివసేన నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఆమె సినీ కార్యాలయాన్ని అక్రమ మరమ్మతుల పేరుతో పాక్షికంగా కూల్చివేశారు. ఈ చర్య దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ తర్వాత కంగనా హైకోర్టును ఆశ్రయించగా, కూల్చివేతపై స్టే విధించింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 
 
ఆ తర్వాత కంగనా ముంబైను వీడి తన స్వరాష్ట్రానికి వెళ్లిపోయింది. అక్కడ నుంచి ట్వీట్ల రూపంలో మహారాష్ట్రపై యుద్ధం కొనసాగిస్తోంది. తాజాగా.. మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగనా తన ట్వీట్లలో తీవ్ర విమర్శలు చేసింది. ఈ కరోనా మహమ్మారి వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రం మహారాష్ట్ర అని, రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుంటే.. ఈ ఫాసిస్ట్ ప్రభుత్వం కట్టడి చర్యలు తీసుకోవడం మానేసి వారికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని వేధించడమే పనిగా పెట్టుకుందని కంగనా ట్వీట్ చేసింది.
 
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేసింది. అంతేకాదు, ఫెమినిస్టులపై (స్త్రీవాదులు) కూడా కంగనా మండిపడింది. ఫెమినిస్టులంతా ఎలాంటి ఆధారాలు లేకుండా తన ఇంటిని అక్రమ కట్టడమని అంటున్నారని, తాను ఈ కేసులో బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌పై గెలుస్తానని, బీఎంసీ నష్టపరిహారం చెల్లించక తప్పదని కంగనా విశ్వాసం వ్యక్తం చేసింది. అప్పుడు ఈ ఫెమినిస్టులంతా తనకు క్షమాపణ చెబుతారా అని కంగనా ప్రశ్నించింది.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రావణిని అన్ని విధాలుగా వాడేసిన అశోక్ రెడ్డి.. అయినా ఆశ చావలేదు...