దీపావళి కానుకగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ''సర్కార్'' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌కు యూట్యూబ్‌లో భారీ వ్యూస్ వచ్చాయి. దీపావళి పండుగ కానుకగా నవంబర్ 6వ తేదీన భారీస్థాయిలో ''సర్కార్'' సినిమాను విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి గల క్రేజ్ కారణంగా తమిళనాడులో విడుదలకి ముందురోజు రాత్రి బెనిఫిట్ షోలు కూడా భారీగా వేస్తున్నారు. చెన్నైలో మాత్రమే వంద బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తున్నారు.
మిగిలిన ప్రాంతాల్లో మరో వంద బెనిఫిట్ షోలు వేస్తున్నారు. ఈ సినిమాకి హిట్ టాక్ రావడమంటూ జరిగితే, వసూళ్లపరంగా తమిళనాడులో 'బాహుబలి-2' రికార్డును అధిగమించడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు. గతంలో మురుగదాస్-విజయ్ కాంబినేషన్లో కత్తి, తుపాకి వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. ఈ సినిమాతో మళ్లీ హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయమని సినీ జనం అంటున్నారు.
ఇదిలా ఉంటే, తుపాకి, మెర్సల్ సినిమాలతో విజయ్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైపోయారు. తెలుగులోకి అనువాదమైన ఈ రెండు సినిమాలను తెలుగు ప్రజలు ఆదరించారు. ఇప్పుడు ''సర్కార్'' సినిమాను కూడా తెలుగులోకి అనువాదం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో కూడా నవంబర్ 6నే ఈ చిత్రం విడుదలవుతోంది. త్వరలోనే హైదరాబాద్‌లో గ్రాండ్ ఫంక్షన్ కూడా నిర్వహించబోతున్నారని తెలుగు సినిమాలకు పీఆర్వోగా పనిచేస్తోన్న వంశీ కాక ట్వీట్ చేశారు.