తమిళ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత కె.మురళీధరన్ గురువారం గుండెపోటుతో మరణించారు. ఆయనకు వయసు 65 యేళ్లు. తన కుటుంబ సభ్యులతో కలిసి కుంభకోణం వెళ్లగా అక్కడ గుండెపోటుకు గురై తుదిశ్వాస విడించారు. కోలీవుడ్‌లోని పెద్ద స్టార్లందరితో ఆయన సినిమాలు నిర్మించారు. గత కొంతకాలంగా చిత్ర పరిశ్రమకు దూరమై కుటుంబ సభ్యులతో ఉంటున్నారు.
లక్ష్మీ మూవీ మేకర్స్ బ్యానరుపై ఆయన తమిళంలో 'గోకులంలో సీతై' అనే చిత్రాన్ని నిర్మించగా, అది తెలుగులోకి పవన్ కళ్యాణ్ హీరోగా "గోకులంలో సీత" పేరుతో రీమేక్ చేసారు. తెలుగులో ఈ చిత్రం హక్కులను గీతా ఆర్ట్స్ కొనుగోలు చేసి రీమేక్ చేయగా, పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మంచి చిత్రంగా నిలిచింది.
1994లో సినీ నిర్మాతగా తన తొలి చిత్రాన్ని నిర్మించిన మురళీధరన్.. కమల్ హాసన్‌తో 'అన్బేశివం', విజయకాంత్‌తో 'ఉలవత్తురై', కార్తీక్‌తో 'గోకులత్తిల్ సీతై', అజిత్‌తో 'ఉన్నైతేడి', విజయ్‌తో 'ప్రియముడన్', ధనుష్‌తో 'పుదుప్పేట', సింబుతో 'సిలంబాట్టం' వంటి చిత్రాలు నిర్మించారు.
కాగా, మురళీధరన్ మృతిపట్ల కమల్ హాసన్ తన ప్రగాఢ సంతాన్ని వ్యక్తం చేసారు. ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించిన మురళీధరన్ ఇకలేరన్న వార్తను జీర్ణించుకోలేక పోతున్నట్టు చెప్పారు. ప్రియమైన శివ.. ఆ రోజులు నాకు గుర్తుకు వస్తున్నాయి. ఆయనకు నా నివాళులు అంటూ ట్వీట్ చేశారు.