తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ రెడ్డి ఆదివారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. 2004లో హన్మకొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆయన అనారోగ్యం బారినపడటంతో క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు.
భారతీయ జనతా పార్టీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన మందాడి సత్యనారాయణ రెడ్డి ఆ తర్వాత రాష్ట్ర ఉపాధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీజేపీని వీడిన ఆయన తెరాసలో చేరారు. తెరాస తరపునే ఆయన హన్మకొండ స్థానంలో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
2009లో హన్మకొండ నియోజకవర్గం రద్దు కావడంతో ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. అదేసమయంలో అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తదితరులు తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.