మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". భారతదేశ తొలి స్వాతంత్ర్య పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఏ. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హీరో రామ్ చరణ్ నిర్మించారు.
భారీ తారాగణం, భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ముందు వివాదాస్పదమైంది. 'సైరా' చిత్రకథ విషయంలో తమతో ముందు కుదుర్చుకున్న ఒప్పందాన్ని చిరంజీవి, రామ్ చరణ్ తుంగలో తొక్కారని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశీయులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికే పలుమార్లు చిరంజీవి నివాసం ఎదుట నిరసన ప్రదర్శనలు చేపట్టిన ఉయ్యాలవాడ వంశీకులు తాజాగా పోలీసులను ఆశ్రయించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథకు అవసరమైన వివరాలను తమ నుంచే సేకరించి, తిరిగి తమ మీదనే కేసులు పెట్టారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
నరసింహారెడ్డి గురించిన సమాచారం ఇచ్చినందుకు డబ్బులు ఇస్తామని చెప్పి, మాట తప్పారని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
ఇదే అంశంపై ఉయ్యాలవాడ వంశీయులు స్పందిస్తూ, తమను చిరంజీవి, రామ్ చరణ్ ఛీటింగ్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా కోసం తమతో రామ్ చరణ్ స్వయంగా మాట్లాడాడని, నోటరీపై 22 మందితో సంతకాలు చేయించారని వెల్లడించారు.
'సైరా' మార్కెట్ విలువలో 10 శాతం ఇస్తామని మాటిచ్చారని, ఆ లెక్కన తమకు రూ.50 కోట్లు రావాల్సి ఉందని అన్నారు. కానీ, ఇప్పుడు సినిమా అయిపోయిందని చెబుతూ మాట తప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సినిమా షూటింగ్ సమయంలో తమ ఆస్తులు, స్థలాలను వాడుకున్నారని ఆరోపించారు. తమను ఆర్థికంగా ఆదుకోవాలని రామ్ చరణ్‍ను, దర్శకుడ్ని కోరామని వారు తెలిపారు. ఆదుకోకపోగా, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ చిత్రయూనిట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు.