రావు రమేష్ ఇప్పుడు సినీ ప్రేక్షకులకు ఈయన తెలియనివారు లేరు. ఈయన తండ్రి రావు గోపాలరావు. స్టేజీ నటుడినుంచి సినిమాల్లోకి వచ్చిన రావు గోపాలరావుది ప్రత్యేక శైలి, వాయిస్. పదాల విరుపు, మాటల ఆరోహణ, అవరోహణ, ఒత్తి పలకడం వంటి ఆయన ప్రత్యేకతలు. ముత్యాలముగ్గు సినిమాలో `సెగ్రెటరీ.. పైనేదో మర్డర్ జరిగినట్లులేదు ఆకాశంలో. సూర్యుడు నెత్తుటి గెడ్డలాలేడు. మనిషిఅన్నాక కాస్త కళాపోషణ వుండాలయ్యా! అంటూ తన దైన శైలిలో పలికిన మాటలు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇలా చాలా సినిమాల్లో ఆయనది ప్రత్యేక మేనరిజం. ఆ తర్వాత అలాంటి నటుడు మళ్ళీ రాడు అనుకోవడం పరిపాటే. కానీ ఆయన నట వారసునిగా ఆయన కుమారుడు రావు రమేష్ వచ్చాడు. ఈయనేమీ అంత ఈజీగా రాలేదు. అస్సలు నాకు నటుడిగా చేయాలని లేదండి బాబోయ్.. అంటూ తన స్నేహితులకు చెప్పినా వారు వినలేదు. ఆఖరికి బలవంతంగా నటుడు అయ్యాడన్నమాట. ఈ విషయాన్ని ఆయన ఓ సందర్భంలో చెబుతూ అంతా దైవనిర్ణయం. మన చేతుల్లో ఏమీ లేదన్నారు. అలాంటి నటుడు పుట్టినరోజు ఈరోజే. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని సంగతులు తెలుసుకుందాం.
రావు రమేష్ శ్రీకాకుళంలో జన్మించాడు. చెన్నైలో పెరిగాడు. అతను చెన్నైలో బి.కాం. పూర్తి చేశాడు. ఆయనకు ఫోటోగ్రఫీ అంటే ఆసక్తి. అక్కడ బ్రిటిష్ లైబ్రరీ & అమెరికన్ లైబ్రరీకి వెళ్ళి ఫోటోగ్రఫీ పుస్తకాలను అధ్యయనం చేసేవాడు.తాను చదివే పనిలో సాధారణంగా తన గడ్డం గీసుకోవడం కూడా మరచిపోయేవాడు. అంత ఆసక్తితో చదివేవాడు. ఆ సమయంలో సినిమాటోగ్రాఫర్ వి.ఎస్.ఆర్ స్వామి ఆయనను ప్రోత్సహించి బెంగుళూర్ వద్ద తన స్నేహితురాలు వద్దకు పంపాడు. ఆయన అక్కడ పారిశ్రామిక ఫోటోగ్రఫీ గురించి నేర్చుకున్నాడు. కానీ అతని తల్లి అతనిని తండ్రిలా నటనను వృత్తిగా ఎన్నుకోమని ప్రోత్సహించింది. ప్రారంభంలో అతన నటన గురించి అయిష్టంగా ఉన్నా ఒక సంవత్సరం పాటు అతని తల్లి నిరంతరం ప్రోత్సహించటంతో చివరికి నటించుటకు అంగీకరించాడు.
చెన్నలో తన స్నేహితుడు ఘంటశాల వెంకటేశ్వరరావుగారి తనయుడు ఘంటశాల రత్నకుమార్ ఇచ్చిన ప్రోత్సాహంతో టి.వి.సీరియల్స్ లో నటించాడు. ప్రారంభ షాట్ ఒక అమ్మాయితో సన్నిహితంగా వుండే సీన్‌లో బెదిరిపోయాడు. అనకు ఇది సెట్‌కాదని వచ్చేశాడు. ఆ సీరియల్ మధ్యలోనే నిలిచిపోయింది. అప్పుడు రమేశ్ కి నందమూరి బాలకృష్ణ సినిమా సీమ సింహంలో సిమ్రాన్ సోదరుడుగా అవకాశం వచ్చింది. హిట్ కాకపోవడంతో వేషాలు లేవు. ఇక లాభంలేదని తిరిగి చెన్నైలో టి.వి ధారావాహికలు "పవిత్ర బంధం", "కలవారి కోడలు" లలో నటించటం ప్రారంభించారు. అప్పడు అతనిని దర్శకుడు క్రిష్ తన గమ్యం సినిమాలో అవకాశం కల్పించాడు. నగ్జలైట్ పాత్ర. అలా తన గమ్యం ఎటువైపు వెళుతుందో అర్థంకాకపోవడంతో వచ్చిన అవకాశాలను వదులుకోవద్దని స్నేహితుడు సూచన మేరకు నటించడం ప్రారంభించారు.
తనకంటూ ప్రత్యేకమైన బాణీని ఏర్పాటు చేసుకుని సీరియల్స్‌కు డైలాగ్‌లు చెబితే అవి పెద్దగా ఆకట్టుకోలేదు. అందుకే తన తండ్రిలా మాట విరుపు, నింపాదిగా మాట్లాడడం, నొక్కి పలకడం వంటి మేనరిజాన్ని తనదైన శైలిలో అలవర్చుకున్నాడు. అలా ఒక్కో సినిమాకు అతని డైలాగ్ డిక్షన్ నటన ప్రేక్షకులకు ఆకట్టుకుంది.
ఇక సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో `అరె వాడిని ఓసారి ఎవరికైనా చూపించండ్రిరా.. అంటూ మహేష్‌బాబుతో పలికే మేనరిజం బాగా ఆకట్టుకుంది. ఇక `అ..ఆ` సినిమాలో శత్రువులు ఎక్కడో వుండరు. మన కూతుళ్ళ రూపంలో వుంటారంటూ...` పలికే సంభాషణలు ప్రత్యేక ముద్ర వేశాయి. రాజేంద్రప్రసాద్ నటించిన సినిమాలో తన తండ్రి చేసిన `రొయ్యలనాయుడు` పాత్రనే తన శైలిలో అల్లు అర్జున్ సినిమాలో రావురమేష్ నటించి మెప్పించాడు.
ఇలా ఒకటికాదు చాలా సినిమాలు తనదైన మేనరిజంతో ముందుకుసాగుతున్న ఆయన తాజాగా గోపీచంద్ సినిమా `సీటీమార్`లోనూ భిన్నమైన పాత్ర, యాస్‌ను చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టర్‌ను విడుదల చేసింది. నట వారసుడిగా సీనిరంగంలోకి వచ్చినా అనుకోకుండా నటుడు అయి ఇలా కెరీర్ మారిపోతుందని ఎప్పడూ తాను అనుకోలేదని రావు రమేష్ చెబుతుంటారు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు వెబ్ దునియా శుభాకాంక్షలు తెలియజేస్తుంది.