ఊసూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఈరోజు (మే 9) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపుగా రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందింది అని వార్తలు వస్తున్నాయి. అయితే... తెలంగాణలోని అన్ని థియేటర్లలో మహర్షి చిత్రాన్ని 5 షోలు వేసుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అదనపు ఆటతో పాటు టిక్కెట్ల రేటు పెంపుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని ప్రచారం జరిగింది. సింగిల్ స్క్రీన్స్‌లో 80 రూపాయల టికెట్ 100 రూపాయలు, 150 రూపాయల టికెట్ 200 రూపాయలకు పెంచారు.
అసలు జరిగింది ఏంటంటే... తెలంగాణ ప్రభుత్వంతో సంబంధం లేకుండా థియేటర్ ఓనర్లు కోర్టు ద్వారా రేట్లు పెంపునకు సంబంధించి అనుమతి తెచ్చుకున్నారట. ఈ విషయం పై తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండానే 79 థియేటర్లు ధరలను పెంచాయని మండిపడ్డారు.
వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే ఆలోచన ప్రభుత్వం చేయదని.. ఈ విషయంలో చట్టపరంగా ముందుకు వెళ్లాలని హోంశాఖ కార్యదర్శికి సూచించానని స్పష్టం చేశారు. థియేటర్ ఓనర్స్ పై తెలంగాణ ప్రభుత్వం ఫైర్ అవుతోంది. మరి... ఈ వివాదం ఎంత వరకు వెళుతుందో..?