తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ దర్శకుడు శరత్ కన్నుమూశారు. పలువురు అగ్ర హీరోలతో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ఆయన గురువారం ఉదయం కన్నుమూశారు. 74 యేళ్ల శరత్ గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతూ వచ్చాడు. దీంతో ఆయనను హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. కుటుంబ కథా నేపథ్యంతో పాటు బలమైన హీరోయిజం ఉన్న చిత్రాలను తెరకెక్కించడంతో ఆయన ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
గత 1986లో వచ్చిన 'చాదస్తపు మొగుడు' ద్వారా ఆయన చిత్ర దర్శకుడుగా అరంగేట్రం చేశారు. ఇందులో సుమన్, భానుప్రియ జంటగా నటించారు. ఆ తర్వాత 'పెద్దింటల్లుడు' చిత్రం ఆయన కెరీర్‌లో కమర్షియల్ హిట్‌గా నిలిచింది.
ఈ సక్సెస్‌తో వెనుదిరగని ఆయన... ఆ తర్వాత 25కిపైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. హీరో సుమన్‌తో అత్యధికంగా ఎనిమిది చిత్రాలను రూపొందించారు. వీటిలో "బావ బావమరిది, చిన్నల్లుడు" వంటి చిత్రాలు ఉన్నాయి. అలాగే, బాలకృష్ణతో "వంశోద్ధారకుడు, పెద్దన్నయ్య, వంశానికొక్కడు, సుల్తాన్" వంటి చిత్రాలను తెరకెక్కించారు.