Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బజారున పడిన టాలీవుడ్ పరువు.. అంతా 'మా' ఎన్నికల పుణ్యమా?

బజారున పడిన టాలీవుడ్ పరువు.. అంతా 'మా' ఎన్నికల పుణ్యమా?
, సోమవారం, 18 మార్చి 2019 (18:39 IST)
టాలీవుడ్‌లో దర్శకరత్న దాసరి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది... ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలంటూ నానా హంగామాలు, ఆర్బాటాలు చేసేసి ఏదో సాధించేసిన కొత్త అధ్యక్షుడైనా... నిన్న మొన్నటి వరకు ఆ పదవిలో ఉండి తాజాగా మాజీ అయిన పాత అధ్యక్షుడైనా రాజీ మంత్రం లేకుండా ఒకరికొకరు ఏ మాత్రం తగ్గకుండా కీచులాడుకుంటూ ఉంటే మా పరిస్థితి ఏమిట్రా భగవంతుడా అని కార్మికులు జుట్టు పీక్కుంటున్నారు. 
 
వివరాలలోకి వెళ్తే... మా హాట్ సీటులో కూర్చోవాలనే తహతహతో ఉన్న తాజా అధ్యక్షుడి వర్గాన్ని కాస్త వెయిట్ చేయించాలి అన్నట్టుగా మాజీ వర్గం పావులు కదుపుతోంది.. ఒకసారి ఈయన.. ఇంకోసారి ఆయన ప్రెస్ మీట్లు పెట్టేసి `మా` పరువు, మర్యాదలను గంగలో కలిపేస్తున్నారు. పాత అధ్యక్షుడు కొత్త అధ్యక్షుడు ఇద్దరిదీ అదే బాట కొనసాగుతోంది. 
 
ఆయన పరువు తీసాడు సరే.. ఈయనైనా కాపాడతాడా? అంటే ఇక్కడ అటువంటి సీనేమీ కనిపించడం లేదు. ఇద్దరి మధ్యా రాజీ బేరం లేదు. తగ్గేది లేదు. నువ్వా నేనా? అంటూ వర్గ పోరు కొనసాగుతూనే ఉంది. నిన్న నరేష్ - జీవిత వర్గం తమ ప్రత్యర్థిని మీడియా ముఖంగా తిట్టారు. రేపు శివాజీ రాజా మీడియా మీట్ అంటూ తిట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇలా ఉంది 'మా' పరిస్థితి
 
దీనిని శివాజీ రాజా నరేష్‌ల వ్యక్తిగత సమస్యగా పరిగణించాలా?! అసలేమని అర్థం చేసుకోవాలి? కేవలం ఇద్దరి మధ్య వ్యక్తిగత కక్షలు వ్యవస్థను చిన్నాభిన్నం చేయవా?  కార్మికుల సమస్యల్ని జఠిలం చేసేలా ఉన్నాయని ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ఇక ఆర్టిస్టుల పథకాల అమలు కానీ లేదా ఇన్సూరెన్స్ వంటి కీలకమైన పనుల్లో కానీ ప్రస్తుత గొడవలతో సాధ్యమయ్యే పనేనా?  సొంత బిల్డింగ్ కట్టేస్తామని బీరాలు పోవడమేనా? ఇలా అయితే నిధుల సేకరణ ఎలా జరుగుతుంది?  కొట్లాడుకుంటూ వీళ్లు సొంత భవంతి నిర్మిస్తారా?  ఇదేం పెద్దరికం? అంటూ పలువురు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
ఇంతకీ వీటిని ఆపాల్సిన చిరంజీవి మోహన్ బాబు వంటి పెద్దలు ఏమైపోయారో? అంటూ ఆర్టిస్టుల్లో చర్చ సాగుతోంది. కంటి సైగతో ఆపేవాడు లేక వెనుక నుంచి కథలు నడిపించే పెద్దలతో పని కాక `మా` పరువు ఇప్పుడు నడి బజారులోనే ఉంది. దాసరి తర్వాత అదుపులో పెట్టేవారే లేకపోయారా? అంటూ పరిశ్రమలోని కార్మికులు వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ గుడి గోపురంపై సుదర్శనచక్రం.. ఎటు తిరిగినా మీవైపే తిరుగుతుంది...