Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'లక్ష్మీస్ ఎన్టీఆర్'.. రాత్రికి రాత్రే మాట మార్చిన వర్మ!

Advertiesment
'లక్ష్మీస్ ఎన్టీఆర్'.. రాత్రికి రాత్రే మాట మార్చిన వర్మ!
, సోమవారం, 18 మార్చి 2019 (11:30 IST)
వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ... మరోసారి తన తొందరపాటు లక్షణాన్ని నిరూపించుకున్నారు. అయితే... ఈసారి ఆయన నోరు పారేసుకుంది... రాజకీయాలపైనో... రాజకీయ ప్రముఖులపైనో కాదు... సెన్సార్ బోర్డుపై... ఎట్టకేలకు పొరపాటు జరిగింది అని ఒప్పుకున్న ఆర్జీవీ రాత్రికి తన స్వరాన్ని మార్చారు.
 
వివరాలలోకి వెళ్తే... ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 22వ తేదీన విడుదల కావాల్సి వుంది. అయితే, ఈ చిత్ర విడుదలపై ఇపుడు నీలినీడలు కమ్ముకున్నాయి. దీనికితోడు ఆ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ ఒకే రోజు చేసిన విభిన్న ప్రకటనలతో ఈ అనుమానానికి మరింత బలం చేకూర్చుతోంది. 
 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పోలింగ్‌ జరిగే ముందు... అంటే ఏప్రిల్‌ 11కి ముందుగా ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సెన్సార్‌ దరఖాస్తును పరిశీలించలేమని సెన్సార్‌బోర్డు తమ చిత్ర నిర్మాతలకు లిఖిత పూర్వకంగా తెలిపిందంటూ రామ్ గోపాల్‌ వర్మ ఆదివారంనాడు పేర్కొంటూ... సెన్సార్‌ బోర్డు తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. 
 
సినిమాని చూడకముందే అందులో ఉన్న విషయం గురించి వారికి ఎలా తెలుస్తుందంటూ, ఓ వర్గానికి కొమ్ము కాయడానికే సెన్సార్‌ బోర్డు ఇలాంటి పనులు చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా విడుదలను సెన్సార్‌ బోర్డు అడ్డుకుంటోందనీ, ఇది చట్టవిరుద్ధమైన చర్య అంటూ మండిపడ్డారు. కొంత మంది వ్యక్తుల ఒత్తిడికి తలొగ్గి సినిమాని చూసేందుకు సెన్సార్‌ బోర్డు విముఖత వ్యక్తం చేస్తోందనీ... సినిమాను చూడకుండా వాయిదా వేసే అధికారం సెన్సార్‌ బోర్డుకు లేదనీ, అలా చేస్తే ఆర్టికల్‌ 19 ప్రకారం తమ భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకున్నట్లే అవుతుందనీ నోరు పారేసుకున్నారు. 
 
సెన్సార్‌ బోర్డుకు వ్యతిరేకంగా కోర్టుకు కూడా వెళ్తామని ట్విట్టర్‌ వేదికగా స్పష్టం చేసిన ఆయన... ఈ అంశం మీద సోమవారం విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. దానికిగానూ తన న్యాయవాది సుధాకర్‌రెడ్డితో కలిసి మీడియా ముందుకు రానున్నట్లు, అప్పుడు సెన్సార్‌ మీద చట్టపరంగా తీసుకోబోయే చర్యల గురించి పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు ఆయన తెలియజేశారు.
 
అయితే.. రాత్రి 9:30 గంటలకు ఆయన తన స్వరాన్ని పూర్తిగా మార్చివేసారు. తమ కార్యాలయ అధికారులకు, సెన్సార్‌ బోర్డు అధికారులకు మధ్య సమాచార లోపంతో గందరగోళం నెలకొందని ఓ ప్రకటన విడుదల చేసారు. ఇందుకుగానూ... సోమవారం ప్రెస్‌మీట్‌ను రద్దు చేసినట్లు తెలిపారు. సెన్సారు బోర్డు అధికారులు సినిమాని సెన్సార్‌ చేసే పనుల్లో ఉన్నారని ఆయన వెల్లడించారు. ఈ ప్రక్రియను రెండు మూడు రోజుల్లో చేపట్టనున్నట్లు బోర్డు అధికారులు తమకు తెలిపారనీ పేర్కొన్నారు. 
 
మరో దర్శకుడు అగస్త్యతో కలిసి వర్మ తెరకెక్కించిన చిత్రం ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’... మాజీ సీఎం ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత ఏం జరిగిందనే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని... ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు. సెన్సార్‌ బోర్డు ఎలాంటి కట్స్‌ చెప్పకుంటే నిర్ణీత షెడ్యూల్‌కు సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే బోర్డు కట్స్‌ చెబితే మాత్రం విడుదల ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయ్ దేవరకొండ సరసన నయనతార?