మెగాస్టార్ చిరంజీవిపై తెలుగు చిత్ర పరిశ్రమలోని మెగా ప్రొడ్యూసర్లలో ఒకరైన ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ గట్టిగా కౌంటరిచ్చారు. చిరంజీవి ఏం తెలుసని మూడు రాజధానులు అంటున్నారంటూ మండిపడ్డారు. ప్రపంచంలో మూడు రాజధానుల వ్యవస్థ పూర్తిగా విఫలమైందనే విషయం చిరంజీవికి తెలియదా? అంటూ నిలదీశారు. పైగా, చిరంజీవి వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నట్టు చెప్పారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతగా ఉన్న వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వనీదత్ శనివారం ఓ మీడియాతో మాట్లాడారు. మూడు రాజధానుల వ్యవస్థపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. చిరంజీవి వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. పైగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తే రూ.కోట్లు సంపాదించుకుంటారు, కానీ, ఆయన సినిమాలు వదిలివేసి రైతులు కోసం పోరాటం చేస్తున్న విషయం చిరంజీవికి తెలియదా అంటూ అశ్వనీదత్ ప్రశ్నించారు.
ప్రస్తుతం రాజధాని రైతుల పరిస్థితి చూస్తుంటే చాలా ఆవేదనగా ఉందన్నారు. రాజధాని కోసం భూములిచ్చినందుకు వారికి శాపమా అంటూ ప్రశ్నించారు. ప్రతి ఇంటికి పది మంది పోలీసులు పెట్టారు... ఇది వారికిచ్చే బహుమానమా? అంటూ నిలదీశారు. పైగా, రాజధాని రైతులు సినీ హీరోల మద్దతును కోరవద్దని, ఈ గడ్డపై పుట్టిన వారు ఎంతో మంది స్టార్లు ఉన్నారనీ, వారి సినిమాలు చూడకుండా మానేస్తే వారే దిగివస్తారని అశ్వనీదత్ సలహా ఇచ్చారు.
అంతేకాకుండా డీజీపీ గౌతం సవాంగ్ తన మిత్రుడని, అతని హయాంలో ఇలా జరగటం తనను తీవ్రంగా కలిచివేస్తోందన్నారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణకు రైతులు భూమిలిచ్చారనీ, వారికి అమరావతి ప్రాంతంలో ప్రత్యామ్నాయ భూములిచ్చారన్నారు. ఇపుడు ఆ రైతులకు తిరిగి విమానాశ్రయ పరిధిలో ఉన్న భూములు ఇస్తారా? అంటూ అశ్వనీదత్ ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి చేసిన దాంట్లో పది శాతం చేసినా గొప్ప సీఎంగా చరిత్రలో మిగిలిపోతారన్నారు. 151 సీట్లు ఇచ్చిన ప్రజలను అపహాస్యం చేయొద్దని కోరారు. హాస్య నటుడు పృథ్వీ వంటివారు చేసే కామెంట్స్‌ను అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటివారివల్లే జగన్ భ్రష్టుపట్టిపోతున్నారని ఆయన మండిపడ్డారు.