కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ కె.రాఘవేంద్రరావు. వందకు పైగా చిత్రాలను తెరకెక్కించి... శతాధిక చిత్రాల దర్శకుడిగా.. తెలుగు ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ కమర్షియల్ దర్శకుడు "అన్నమయ్య" సినిమాతో భక్తిరస చిత్రాలను కూడా అద్భుతంగా తీయగలనని నిరూపించారు.
"శ్రీరామదాసు, శిరిడి సాయి, ఓం నమో వెంకటేశాయ".. ఇలా నాగార్జునతో నాలుగు భక్తిరస చిత్రాలు తెరకెక్కించారు.
అయితే... ఆయన నాగార్జునతో తెరకెక్కించిన "ఓం నమో వెంకటేశాయ" సినిమా తర్వాత ఇప్పటివరకు తన తదుపరి చిత్రం ఏంటి అనేది ఎనౌన్స్ చేయలేదు. ఆ సినిమా టైమ్‌లో అదే రాఘవేంద్రరావు ఆఖరి సినిమా అని ప్రచారం జరిగింది. 'ఓం నమో వెంకటేశాయ' చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
దీంతో తన ఆఖరి చిత్రం విజయవంతమైన చిత్రం అయితే బాగుంటుంది అనే ఉద్దేశ్యంతో ఇప్పుడు ఓ సినిమా చేయాలనుకుంటున్నారట.
ఆ సినిమా గురించి దర్శకేంద్రుడు స్పందిస్తూ... ముగ్గురు హీరోలు, ముగ్గురు కథానాయికలతో ఓ సినిమా చేయబోతున్నా అని చెప్పారు. దానికి దర్శకత్వం చేస్తానా? నిర్మాతగానే ఉంటానా? అనేది త్వరలో చెబుతా. వెబ్‌సిరీస్ కోసం మూడు కథలు సిద్ధం చేశాను. సీరియళ్లు ఎలాగూ ఉన్నాయి అని చెప్పారు.
అయితే... ఒకవేళ ఆయన దర్శకత్వం వహించకపోతే ముగ్గురు హీరోలు నటించే ఈ సినిమాకి దర్శకత్వం వహించే నాలుగవ దర్శకుడు ఎవరు..? అసలు కథ ఏంటి..? ఎప్పుడు ప్రారంభం..? తదితర వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..!