సినీ నటుడు పృథ్వీకి విజయవాడ ఫ్యామిలీ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. భరణం కేసులో పృథ్వీ భార్యకు నెలకు రూ.8లక్షలు భరణం చెల్లించాలని విజయవాడ ఫ్యామిలీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
2017 నుంచి భార్యకు భరణం బకాయిలు కూడా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. గత ఐదేళ్లుగా విజయవాడ న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న కేసులో పృథ్వీ భార్యకు భారీగా భరణం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది.
మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంకు నటుడు బాలిరెడ్డి పృథ్వీరాజ్ అలియాస్ శేషుతో విజయవాడకు చెందిన శ్రీలక్ష్మీకి 1984లో వివాహం జరిగింది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత పృథ్వీరాజ్ తరచూ తనను వేధించే వాడని, 2016 ఏప్రిల్ 5న తనను ఇంటి నుంచి గెంటేయడంతో పుట్టింట్లో ఉంటున్నట్లు పృధ్వీ భార్య కోర్టుకు ఫిర్యాదు చేశారు.
తన పోషణ భారంగా మారడంతో భర్త నుంచి భరణం ఇప్పించాలంటూ ఆమె 2017 జనవరి 10న విజయవాడ 14వ అదనపు ఫ్యామిలీ కోర్టులో దావా వేశారు. దాదాపు ఐదేళ్లుగా విచారణ జరిగిన తర్వాత పృథ్వీ భార్యకు నెలకు రూ.8లక్షల భరణం చెల్లించాలని న్యాయమూర్తి ఇందిరా ప్రియదర్శిని ఆదేశించారు.
కోర్టు తీర్పుతో సినీ నటుడు పృథ్వీ తన భార్యకు దాదాపు ఆరు కోట్ల రుపాయలకు పైగా భరణం బకాయి చెల్లించాల్సి ఉంటుంది. ఈ తీర్పును పృథ్వీరాజ్ హైకోర్టులో సవాలు చేస్తారో, భార్యతో రాజీకి వస్తారో చూడాల్సి ఉంది.