ప్రస్తుతం ఓటీటీ వినియోగం ఎంతలా పెరిగిందో అందరికీ తెలిసిందే. ఏ భాషలో మంచి చిత్రం వచ్చినా కూడా ప్రేక్షకులందరూ చూసేస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా సినిమాలను చూసి ఆదరిస్తున్నారు. అలా ఓటీటీలతో భాషాబేధం లేకుండా పోయింది. ప్రస్తుతం తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఇరువక్కు ఆయిరమ్ కంగళ్ అనే సినిమాను తెలుగులోకి తీసుకొస్తున్నారు. రేయికి వేయి కళ్లు పేరిట ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలోకి తీసుకొస్తున్నారు. ఈ శుక్రవారం అంటే సెప్టెంబర్ 30 ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
డీమోంటీ కాలనీ, దేజావు, డైరీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు అరుళ్‌నిధి స్టాలిన్. ప్రస్తుతం అరుళ్‌నిధి.. రేయికి వేయి కళ్లు అనే సినిమాతో ఆహా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోన్నాడు. తమిళంలో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. విజయవంతంగా యాభై రోజులు ఆడి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రేక్షుకులు, విమర్శకులు అందరూ కూడా సినిమాలోని ట్విస్టులకు ఫిదా అయిపోయారు. చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా సాగే ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు వస్తోంది.
రేయికి వేయి కళ్లు సినిమాకు స్క్రీన్ ప్లే ప్రధానబలం. రివర్స్ ఆర్డర్ స్క్రీన్ ప్లేతో సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా మలిచారు. ఒక్కోసారి ఈ సినిమాను చూస్తుంటే.. హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన మోమెంటో సినిమా గుర్తుకు వస్తుంటుంది. డైరెక్టర్ ము. మారన్ ఒక్కో పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టించకుండా కథ, కథనాలు పకడ్బంధీగా రాసుకున్నారు.
రేయికి వేయి కళ్లు కథ అంతా కూడా ఒక సీరియల్ మర్డర్ నేపథ్యంలో జరుగుతుంది. తన పని తాను చేసుకుంటూ సైలెంట్‌గా ఉండే క్యాబ్ డ్రైవర్ భరత్ (అరుళ్‌నిధి), డబ్బుల కోసం జనాలను బ్లాక్ మెయిల్ చేసే గణేష్ (అజ్మల్) మధ్యే ఈ కథ తిరుగుతుంది. చివరి వరకు కూడా హంతకుడు ఎవరు అన్నది ప్రేక్షకులు ఊహించలేరు.. అంచనా వేయలేరు. అదే ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.
రాక్షసన్ (తెలుగులో రాక్షసుడు) సినిమాను నిర్మించిన యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, డిల్లీ బాబులు.. రేయికి వేయి కళ్లు చిత్రాన్ని నిర్మించారు. శామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అరవింద్ సింగ్ సినిమాటోగ్రఫీ, శాన్ లోకేష్ ఎడిటింగ్ అన్నీ కూడా అద్భుతంగా కుదిరాయి.