The Great Pre Wedding Show
వెర్సటైల్ యాక్టర్ తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నవంబర్ 7న వచ్చిన చిత్రం ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో. సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా 7PM ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించారు. తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌తో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మౌత్ టాక్‌తో అద్భుతమైన స్పందనతో పాటు మంచి మసూళ్లను రాబట్టుకుంది.
ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోను గమనిస్తే ఓ చిన్నపాటి విలేజ్‌లో ఉండే ఫొటోగ్రాఫర్ రమేష్ కథ. తను ఆ గ్రామానికి చెందిన లోకల్ లీడర్ ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తాడు. అయితే ఆ మెమురీ కార్డు పోవటంతో అతను పడే ఇబ్బందులు.. ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడనే విషయాలను కామెడీ కోణంలో చూపించారు. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. గ్రామంలో మనం చూసే వ్యక్తులను, వారి హావభావాలను దర్శకుడు అందంగా, చక్కగా నవ్వుకునేలా, ఎంజాయ్ చేసేలా ఉండే పాత్రలు అన్నీ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా హీరో తిరువీర్ మాట్లాడుతూ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చిత్రంలో నేను పోషించిన రమేష్ అనే పాత్ర మనం అందరూ మన టౌన్, గ్రామంలో చూసేలానే ఉంటుంది. అతని పాత్రలోని అమాయకత్వం, తప్పు జరిగినప్పుడు పడే ఆందోళన, తప్పుపు సరిదిద్దుకోవటానికి చేసే ప్రయత్నాలు అన్నీ కామెడీగా ఉంటూనే హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. అతని పాత్రలోని భిన్న కోణాలు నన్నెంతో ఆకట్టుకున్నాయి. అవే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి. ఇప్పుడీ సినిమా జీ 5లో డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కావటం చాలా ఆనందంగా ఉంది. ఇంకా చాలా మందికి సినిమా రీచ్ అవుతుంది. రమేష్ పాత్ర, అతని ప్రపంచం మరింత మందిని మెప్పిస్తుంది అన్నారు.
హీరోయిన్ టీనా శ్రావ్య మాట్లాడుతూ పాత్రల్లోని సహజత్వం నుంచే సినిమాలో ఓ స్వచ్చత మనకు కనిపిస్తుంది. సెట్స్‌లో మేం పని చేసేటప్పుడు ప్రతీ క్షణం నిజాయతీతో కష్టపడ్డం. అదే నిజ జీవితంలో ఉండేలా పాత్రలను, సన్నివేశాలను మలిచింది. నటీనటులందరం వంద శాతం ఎఫర్ట్ పెట్టి వర్క్ చేశాం. అదే మీకు సినిమాలో సహజత్వంతో కనిపించింది. ఇప్పుడీ సినిమా జీ 5లో డిసెంబర్ 5నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రపంచ వ్యాప్తంగా జీ5కి ఉన్న బేస్ మరింతగా సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళుతుంది. వారు కూడా సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాం అన్నారు.