Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"ది ఎలిఫెంట్ విస్పరర్స్" కథేంటి? ఆస్కార్ అవార్డు ఎందుకిచ్చారు?

the elephant whisperer
, మంగళవారం, 14 మార్చి 2023 (09:54 IST)
తాజాగా జరిగిన 95వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం లాస్ ఏంజిల్స్‌లో అట్టహాసంగా జరిగింది. ఇందులో భారతీయ చిత్రం తొలి అవార్డును సొంతం చేసుకుంది. బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో భారత్ నుంచి నామినేట్‌ అయిన 'ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌' ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్‌కు ఆస్కార్ అవార్డు రావడానికి కారణం ఏంటో ఓ సారి తెలుసుకుందాం. 
 
"ది ఎలిఫెంట్ విస్పరర్స్" ... రఘు, అమ్ము అనే రెండు ఏనుగు పిల్లలు, వాటిని ఆదరించిన బెల్లీ, బొమ్మన్ అనే దంపతుల కథ. మొత్తం 42 నిమిషాల ఫుటేజీ కోసం 450 గంటల ఫుటేజీని చిత్రీకరించారు దర్శకురాలు కార్తీకి గోన్‌సాల్వెస్. ఈ ఒక్క విషయంలోనే దర్శకురాలితో పాటు ఈ లఘు చిత్రం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అదే నేడు ఆస్కార్ అవార్డు వచ్చేలా చేసింది. అలాగే, దర్శకురాలిగా తొలి ప్రయత్నంలోనే ప్రతిష్ఠాత్మక అకాడమీ పురస్కరాన్ని సొంతం చేసుకున్నారు. 
 
అయిదేళ్ల క్రితం.. ఇంటికి వెళుతున్నప్పుడు ఓ వ్యక్తి ఏనుగు పిల్లతో వెళ్లడం కార్తికి గమనించింది. వాళ్లిద్దరి అనుబంధం ఆమెను ఆశ్చర్యపరిచింది. అతనితో మాట కలిపితే తప్పిపోయిన ఏనుగు పిల్లను ఆయన చేరదీసిన విధానం చెప్పాడు. ఆ సంఘటనే ఆమె కెరియర్‌ను మలుపు తిప్పింది. ‘ద ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ తీసేలా ప్రేరేపించింది. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, ‘నా సినిమాలోని బొమన్‌, బెల్లీ ఇద్దరూ ఆ ఏనుగు పిల్లలను నిజంగా పెంచుతున్నవాళ్లే. వాళ్ల అనుబంధమే కథగా తీశా. దాన్ని హడావుడి కథగా ముగించడం ఇష్టం లేదు. భావోద్వేగాలను చూపించాలి. కెమెరా లేదన్న భావన కలిగించినప్పుడే అది సాధ్యం. దాని కోసం నేను ముందు 18 నెలలు వాళ్లతో అనుబంధం పెంచుకున్నా. 
 
మిగతా సమయమంతా ఏనుగులు, వాళ్ల మధ్య సహజ సాన్నిహిత్యాన్ని చిత్రీకరించాం. అందుకే 450 గంటల ఫుటేజీ వచ్చింది. ఈ సమయంలోనే బొమన్‌, బెల్లీ పెళ్లి చేసుకున్నారు. అలా కట్టునాయకన్‌ తెగ సంస్కృతినీ తెలియజేసే అవకాశం వచ్చింది. మొత్తం అటవీ ప్రాంతం కదా.. కొన్ని అపాయాలూ తప్పలేదు. అయినా అవన్నీ అందమైన అనుభవాలే' అని కార్తికి వివరించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇన్‌స్టాలో వైరల్ అవుతున్న అల్లు అర్జున్, స్నేహారెడ్డి ఫ్యామిలీ ఫోటోలు