టీవీ యాంకర్, సీరియల్స్ నటి విశ్వశాంతి అనుమానాస్పదంగా మృతి చెందారు. గత నాలుగు రోజులుగా తన నివాసం నుంచి ఆమె బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగువారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఇంట్లోకి వెళ్లి చూడగా విశ్వశాంతి అనుమానాస్పదంగా చనిపోయి కనిపించింది.
ఆమె హైదరాబాద్ నగరంలోని ఎల్లారెడ్డి గూడలో ఉన్న ఇంజనీర్స్ కాలనీలో నివాసం ఉంటుంది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ అమలవుతోంది. దీంతో ఆమె ఇంటికే పరిమితమైంది. అయితే, గత నాలుగు రోజులుగా ఆమె ఇంటి నుంచి బయటకు రాలేదు.
దీంతో అనుమానం వచ్చిన పొరుగువాళ్లు ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు వెళ్లారు. ఇంట్లో ఆమె మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విశ్వశాంతి మృతదేహాన్నిపోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
కాగా, విశ్వశాంతి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఆమె నివసిస్తున్న అపార్టుమెంట్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. గత మూడేళ్లుగా ఆ అపార్టుమెంట్‌లో విశ్వశాంతి నివసిస్తోంది. ఆమె స్వస్థలం విశాఖ జిల్లాగా పోలీసులు గుర్తించారు.