Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు ప్రజలు నిజంగానే దేవుళ్ళు : కె.జి. ఎఫ్ హీరో య‌శ్‌

Advertiesment
తెలుగు ప్రజలు నిజంగానే దేవుళ్ళు : కె.జి. ఎఫ్ హీరో య‌శ్‌
, శుక్రవారం, 28 డిశెంబరు 2018 (13:52 IST)
కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన సినిమా `కెజిఎఫ్` (కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌). రాక్‌ స్టార్ యశ్‌ హీరో. మిస్ దివా శ్రీ‌నిధి శెట్టి క‌థానాయిక‌. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వ‌హించారు. విజయ్‌ కిరగందూర్ నిర్మించ‌గా, ఈ చిత్రాన్ని తెలుగులో వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్ర‌పాటి రిలీజ్ చేశారు. హైద‌రాబాద్‌లో స‌క్సెస్ మీట్ జ‌రిగింది.
 
చిత్ర క‌థానాయ‌కుడు యశ్‌ మాట్లాడుతూ – “కె.జి.యఫ్ గొప్ప విజ‌యం సాధించింది. నా నిర్మాత‌ల వ‌ల్ల‌నే ఇది సాధ్య‌మైంది. ఈ సినిమా పాన్‌ ఇండియా సినిమా, బిజినెస్‌ సినిమా అవుతుంది అని ముందుగా నమ్మిన వ్యక్తి విజయ్‌ కిరగందుర్‌. తెలుగు లోనూ పెద్ద విజ‌యం సాధించాం. ఇక్క‌డి ప్రజల అభిమానం చూస్తుంటే డాక్టర్‌ రాజ్‌ కుమార్‌ చెప్పిన `అభిమానులే దేవుళ్ళు` అనే మాట గుర్తుకు వస్తోంది. నా తొలి సినిమాకే ఇంత ఘ‌నంగా వెల్‌కమ్‌ చెప్పిన తెలుగు ప్రజలు నిజ‌మైన‌ దేవుళ్ళు.
 
10 ఏళ్ల‌ క్రితం ప‌రిశ్ర‌మ‌కు వచ్చినప్పుడు కూడా నాకు ఇలాంటి వెల్‌కమ్‌ చెప్పి ఆశీర్వదించారు. ఇప్పుడు కూడా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోయినా నన్ను ప్రేమగా అక్కున చేర్చుకున్నారు. ఈ సినిమాను ముందు నుండి నమ్మి ప్రతీ ఊరిలో ప్రతి ఇంటికీ తీసుకెళ్లిన అంద‌రికీ నా ధన్యవాదాలు. ఇలాంటి సినిమాలకి మంచి పంపిణీదారులు అవసరం. ఆ విషయంలో నేను సాయిగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సినిమాను చూసి బూస్టప్‌ ఇచ్చిన ఎస్‌. ఎస్‌. రాజమౌళిగారికి నా ధ‌న్య‌వాదాలు. అంత గొప్ప వ్య‌క్తి నా గురించి అద్భుతంగా మాట్లాడడం నిజంగా నాకు ఆశ్ఛర్యం క‌లిగింది. ఆయన అంచనాలను ఈ సినిమా ఘన విజయం ద్వారా అందుకున్నామని అనుకుంటున్నాం.
 
రామరాజుగారు చాలా హార్డ్‌ వర్కర్‌. ఈ సినిమాకు ఆయన తండ్రి శ్రీ కైకాల సత్యనారాయణ గారి పేరును ఇచ్చి చాలా సహకారం అందించారు. హనుమాన్‌గారు నిజంగా నాలో స్ఫూర్తి నింపిన‌ వ్యక్తి. ఆయన కృషి వల్లనే ఈ సినిమా డబ్బింగ్‌ సినిమాలా కాకుండా స్ట్రెయిట్‌ తెలుగు సినిమాలా మాటలు అందించారు. ఈ సినిమా కోసం ఆయన ఐదు వెర్షన్స్‌లో డైలాగ్స్‌ రాసి ఇచ్చారు. రామజోగయ్య శాస్త్రిగారు ఈ స్క్రిప్ట్‌లో ఇన్‌వాల్వ్‌ అయి పాట‌లు రాశారు. 
 
ద‌ర్శ‌కుడు ప్రశాంత్‌ నీల్‌ ఈ సినిమాను హాలీవుడ్‌ స్థాయిలో తెరకెక్కించారు. ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించింది అంటే ఆయన టేకింగ్‌ కారణం. భువన గౌడ గారి ప్రతీ ఫ్రేమ్‌ అద్భుతంగా ఉండి హాలీవుడ్‌ స్థాయిని గుర్తుచేసింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీనిధి శెట్టి చాలా లక్కీ. ఒకేసారి అయిదు భాషలలో పరిచయం అయింది. తెలుగు హీరోలు చాలా గ్రేట్‌. వాళ్ళ డాన్సులు, ఫైట్స్‌ లకు నేను పెద్ద ఫ్యాన్‌ని. తెలుగు హీరోలందరి సినిమాలు చూసి నేను తెలుగు మాట్లాడడం నేర్చుకున్నాను. వాళ్ళే నా స్ఫూర్తి అన్నారు.
 
కైకాల రామారావు మాట్లాడుతూ – “సినిమాను ఆదరించిన ప్రతీ ప్రేక్షకుడికి నా ధ‌న్య‌వాదాలు. సినిమా మంచి హిట్‌ అయినందుకు అభినందనలు“ అన్నారు. మాటల రచయిత హనుమాన్‌ మాట్లాడుతూ – “స్క్రిప్ట్‌ చూసి తెలుగులో కూడా విడుదల చేస్తే బాగుంటుంది అనుకున్నాను. సినిమా తెలుగులో ఇంత పెద్ద హిట్‌ అవుతుంది అనుకోలేదు. ఇలాంటి సినిమాలో భాగం అయినందుకు సంతోషం“ అన్నారు.
 
ఛాయాగ్రాహ‌కుడు భువమ్‌ గౌడ మాట్లాడుతూ -“మా సినిమా యూనిట్‌ మూడు సంవత్సరాల కష్టానికి తగిన గౌరవం దక్కింది. మా టీం అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంత పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకులకు థాంక్స్‌“ అన్నారు. క‌థానాయిక‌ శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ – “ఈ సినిమా లో నేను భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన ప్రశాంత్‌ నీల్‌ గారికి, విజయ్‌, యష్‌కు థాంక్స్‌“ అన్నారు.
 
గోల్డెన్‌ ఫిలిమ్‌ అనేలా ఉంది – రామ‌జోగయ్య శాస్త్రి
ప్ర‌ముఖ గీత ర‌చ‌యిత రామ జోగ‌య్య‌శాస్త్రి మాట్లాడుతూ…కె.జి.యఫ్‌ అంటే కన్నడ గోల్డెన్‌ ఫిలిమ్‌ అనేలా సినిమా ఉంది. ఈ సంవత్సరానికి బ్రహ్మాండమైన ముగింపు. ఈ సినిమా పాన్‌ ఇండియా సినిమా అయ్యిందంటే ఆ క్రెడిట్‌ అంతా చిత్ర యూనిట్‌కి దక్కుతుంది. ఈ సినిమాను నేను పూర్తిగా చూసి పాటలు రాయడం జరిగింది. ఈ సినిమాలో అన్ని పాటలు నేనే రాశాను. పాటలు వింటుంటే ఉల్లాసం ఉద్రేకం వస్తున్నాయి. డబ్బింగ్‌ సినిమాకు ఇంత మంచి ఆదరణ నిజంగా ఊహాతీతం. ఈ సినిమా గణ విజయం ద్వారా యష్‌ నటుడిగా ఇంకో మెట్టు పైకి ఎదిగాడు. ఇంత పెద్ద మాన్‌స్టర్‌ హిట్‌ సినిమాలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్ట్రాతో తాగుతున్నాను..?