తల్లి తన బిడ్డలపై ఎలాంటి ప్రేమను పంచుతుందో దాని పర్యవసానాలు ఏమిటో అనే పాయింట్ ఇప్పటి జనరేషన్ కు తెలియజేసే కాన్సెప్ట్ తో తల్లి మనసు చిత్రం రూపొందుతోంది. నేటితో ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందని చిత్ర యూనిట్ లొకేషన్ లో కేక్ కట్ చేస్తూ ఫొటోను షేర్ చేశారు. సీనియర్ దర్శకులు ముత్యాల సుబ్బయ్య పర్యవేక్షణలో ఆయన శిష్యుడు వి.శ్రీనివాస్ (సిప్పీ) దర్శకత్వం వహించారు. ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ నిర్మాతగా మారారు.
రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రధారులు పోషించారు. షూటింగ్ పార్ట్ పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్మాత ముత్యాల అనంత కిషోర్ మాట్లాడుతూ, "సన్నివేశాలకు అనుగుణంగా హైదరాబాద్ లోని వివిధ లొకేషన్స్ లో టాకీ, క్లైమాక్స్, పాటలతో సహా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేశాం. సినిమా ప్రారంభోత్సవం రోజున ఏదైతే సింగిల్ షెడ్యూల్ లో ఈ చిత్రం చిత్రీకరణను పూర్తి చేస్తామని చెప్పామో...అందుకు తగ్గట్టు సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేశాం.
మంచి కథ, కథనాలు ఈ చిత్రానికి ప్రధాన బలమైతే, అందుకు సరిపోయే ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు మరో బలం. మనసు ను కట్టి పడేసే అద్భుత చిత్రంగా దీనిని మలిచాం. మా నాన్నగారి పర్యవేక్షణలో దర్శకుడు అద్భుతంగా సినిమాను తీశారు. మేము అనుకున్నట్లే చాలా బాగా వచ్చింది. తొలి ప్రయత్నం లోనే ఒక మంచి సినిమా తీసినందుకు ఆనందంగా ఉంది. షూటింగ్ సకాలం లో పూర్తి కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి" అని చెప్పారు.
చిత్ర సమర్పకులు ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ, "ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలన్న తపనతో మా అబ్బాయి నిర్మాతగా చేస్తున్న చిత్రమిది. వాస్తవిక జీవితానికి అద్దంపట్టేవిధంగా ఉంటుంది. అందుకే నా వైపు నుంచి మా అబ్బాయి నిర్మాతగా తీసేందుకు ప్రోత్సహించా" అని అన్నారు.
దర్శకుడు వి.శ్రీనివాస్ (సిప్పీ) మాట్లాడుతూ, "ఓ మధ్య తరగతి తల్లి చుట్టూ తిరిగే కుటుంబ కథతో, పలురకాల భావోద్వేగాలు , ఆ తల్లి సంఘర్షణల నేపథ్యంలో ఈ చిత్రాన్ని మలిచాం" అని చెప్పారు.
ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో , రఘుబాబు, శుభలేఖ సుధాకర్, సాహిత్య, వైష్ణవి, దేవిప్రసాద్, ఆదర్శ్ బాలకృష్ణ, శాంతకుమార్, గౌతం రాజు, దేవిశ్రీ, జబర్దస్త్ ఫణి తదితరులు తారాగణం.