`మంచి కథ. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు లభిస్తే ఖచ్చితంగా అన్నయ్య బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి నటిస్తాం. నాకు అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. అందులోనూ రాజమౌళి గారి సినిమాలో నటించాలనుంది. సితార మంచి విలువలున్న బ్యానర్. అందరికీ గౌరవం ఇస్తారు. అలాంటి బేనర్లో నటించడం చాలా సంతోషంగా వుంది` అని వర్దమాన కథానాయకుడు బెల్లంకొండ గణేష్ అన్నారు.
ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం 'స్వాతిముత్యం'. బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ చిత్రంతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. దసరానాడు అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన హీరో గణేష్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
స్వాతిముత్యం ఎలా మొదలైంది?
నేను ఓ మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమవ్వాలని ఎదురుచూస్తున్న సమయంలో లక్ష్మణ్ ఈ కథ చెప్పారు. ఈ కథతో వస్తే తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని నమ్మి, ఈ కథను సితార వారి దగ్గరకు తీసుకెళ్లగా నాగ వంశీ గారికి కూడా కథ నచ్చింది. ఇది తమ బ్యానర్ లో చేస్తే మంచి సినిమా అవుతుందని భావించిన ఆయన ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు.
మాస్ సినిమాతో కాకుండా ఇంత క్లాస్ సినిమాతో రావడానికి కారణం?
సినిమా అంటే ఖచ్చితంగా పోరాట సన్నివేశాలు ఉండాలని నేను అనుకోను. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఎలాంటి జోనర్ సినిమానైనా ఆదరిస్తారు. కథ బాగుండాలి, సినిమా బాగుండాలి అని ఆలోచించాను కానీ ప్రత్యేకంగా ఈ జోనర్ లోనే సినిమా చేయాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు.
మీ మొదటి సినిమాకి ఇలాంటి కథని ఎంచుకోవడానికి కారణమేంటి?
ప్రస్తుతం కథలో కొత్తదనం లేకపోతే ప్రేక్షకులు థియేటర్లకు రావడంలేదు. తర్వాత ఓటీటీలో చూడొచ్చులే అనుకుంటున్నారు. అందుకే నేను కత్తదనం ఉన్న కథ కోసం వెతుకుతుండగా.. లక్ష్మణ్ వచ్చి ఈ కథ చెప్పారు. ఈ కథలో వైవిద్యం ఉంది. ఇది ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మి ఈ సినిమా చేయడం జరిగింది.
హీరోగా సెట్ లో అడుగుపెట్టడం ఎలా అనిపించింది?
సినిమా రంగం, సినిమా సెట్ నాకు కొత్త కాదు. ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకున్న అనుభవం ఉంది. మొదటి నుంచి సినిమా రంగంలోనే ఉండాలి, ఇక్కడే ఏదోకటి చేయాలని అనుకునేవాడిని. తెర వెనక ప్రొడక్షన్ వ్యవహారాలు అలవాటే గానీ కెమెరా ముందు నటించడం ఇదే మొదటిసారి. అయితే ముందే నటనలో శిక్షణ తీసుకోవడం, అన్ని విషయాల గురించి తెలుసుకోవడం వల్ల చిత్రీకరణ సమయంలో ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు.
'విక్కీ డోనార్' చిత్రానికి, మీ చిత్రానికి పోలికలు ఉన్నాయి అంటున్నారు?
రెండు చిత్రాల కథాంశం మాత్రమే ఒకటి. ఈ రెండు చిత్రాలకు ఎలాంటి సంబంధం లేదు. సినిమా చూశాక ఆ విషయం మీకే అర్థమవుతుంది.
ఈ సినిమా పట్ల మీ నాన్నగారి(బెల్లంకొండ సురేష్) అభిప్రాయమేంటి?
లక్ష్మణ్ వచ్చి నాకు ఈ కథ చెప్పగానే మొదట నాన్నగారికే చెప్పాను. ఆయనకు కూడా కథ బాగా నచ్చింది. నేను నా మొదటి సినిమా బయట బ్యానర్ లో చేయాలని ముందునుంచే అనుకున్నాను. ఎందుకంటే బయట బ్యానర్ లో చేయడం వల్ల కథని నమ్మి ఈ సినిమా చేస్తున్నారన్న విషయం ప్రేక్షకులకు అర్థమవుతుంది.
మీకు ఏ జోనర్ సినిమాలు ఇష్టం?
నాకు రొమాంటిక్ కామెడీ సినిమాలు చూడటం ఇష్టం. కానీ చేయడం మాత్రం అన్ని రకాల సినిమాలు చేయాలనుంది. నా మొదటి పది సినిమాలు పది విభిన్న జోనర్లు చేయాలి అనుకుంటున్నాను.
దీనికంటే ముందు ప్రారంభించిన మీ సినిమా ఆగిపోయింది కదా?
అవును పవన్ సాధినేని గారు దర్శకుడు. ఆ కథ కూడా చాలా బాగుంటుంది. అది అమెరికాలో కొన్ని రోజులు చిత్రీకరణ చేయాల్సి ఉంది. కానీ ఆ సమయంలోనే కరోనా రావడంతో అప్పుడు ఆ చిత్రాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇప్పటికైనా దర్శక నిర్మాతలు పిలిస్తే ఆ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
మీ తదుపరి సినిమా గురించి చెప్పండి?
'నేను స్టూడెంట్' అనే ఒక థ్రిల్లర్ మూవీ చేస్తున్నాను. ఇప్పటికే చిత్రీకరణ కూడా పూర్తయింది. మరో రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
మీ అభిమాన హీరో ఎవరు?
వెంకటేష్ గారు. చిన్నప్పటి నుంచి నేను వెంకటేష్ గారి సినిమాలు ఎక్కువ చూసేవాడిని.